సాక్షి, అమరావతి: పసుపు రైతుకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారం, పది రోజులుగా మార్కెట్‌లో కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.6,850 చొప్పున రైతులకు చెల్లించేలా సన్నాహాలు చేస్తోంది.
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో 60,812 ఎకరాల్లో పసుపు సాగు చేయగా 1,89,628 టన్నులు దిగుబడి వచ్చినట్టు అంచనా. గతేడాది మార్కెట్‌లో గరిష్టంగా క్వింటాల్‌కు రూ.7,900కు పైగా ధర పలకగా, ఈ ఏడాది మార్చి–ఏప్రిల్ వరకు క్వింటాల్‌కు రూ.7,500 వరకు పైగా పలికింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పంట రావడం, పొరుగు రాష్ట్రాల నుంచి మన పంటకు డిమాండ్ లేకపోవడం, ఎగుమతులు క్షీణించడం వంటి కారణాల వల్ల పసుపు ధర పతనమవుతూ వచ్చింది.
గతేడాదితో పోలిస్తే ఎగుమతులు ఈ ఏడాది 20% తగ్గడంతో ప్రస్తుతం క్వాలిటీని బట్టి క్వింటాల్ రూ.5,500 నుంచి రూ.6 వేలకు మించి ధర పలకడం లేదు. దీంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.6,850కు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
కనీసం 30 వేల టన్నుల కొనుగోలు లక్ష్యం
ఈ–పంటలో నమోదు ప్రామాణికంగా కనీసం 30వేల టన్నుల పసుపు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రైతుల వద్ద ఏ మేరకు నిల్వలు ఉన్నాయో అంచనా వేసేందుకు ఆర్బీకే సిబ్బంది ద్వారా సర్వే చేపట్టింది. పంట కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్ల వరకు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు.
సీఎం యాప్ ద్వారా ఆధార్ ఆధారిత రైతు ఖాతాల్లో పంట సొమ్ము జమ చేస్తారు. సర్వే పూర్తి కాగానే సీఎం యాప్ ద్వారా జూన్ రెండో వారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు. ఆర్బీకేల ద్వారా జూలై 31వ తేదీ వరకు కొనుగోలు చేస్తారు. పంట సేకరణకు నోడల్ ఏజెన్సీగా మార్క్‌ఫెడ్ వ్యవహరించనుండగా, జిల్లా జాయింట్ కలెక్టర్లు (రైతు భరోసా) నేతృత్వంలో జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది.
జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగే కొనుగోలు ప్రక్రియలో డీసీఎంఎస్, పీఏసీఎస్, ఏఎంసీలు, ఎఫ్‌పీవోలు, స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. వీరికి 2.5 శాతం కమిషన్ చెల్లించనున్నారు.
తొందరపడి అమ్ముకోవద్దు
2019–20లో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల నుంచి పసుపు కొనుగోలు చేసింది. ఆ తర్వాత వరుసగా రెండేళ్లూ మంచి ధర పలికింది. ప్రస్తుతం మార్కెట్ ధరలను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
రైతుల వద్ద ఉన్న నిల్వలను గుర్తించేందుకు ఆర్బీకేల ద్వారా చేపట్టిన సర్వే పూర్తి కాగానే కొనుగోళ్లు చేపడతాం. మార్కెట్‌లో తిరిగి ధరలు పెరిగే అవకాశం ఉంది. రైతులు తొందరపడి అమ్ముకోవద్దు.
– పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment