Yellow farmers
-
పసుపు రైతుకు ఏపీ సర్కార్ బాసట
సాక్షి, అమరావతి: పసుపు రైతుకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారం, పది రోజులుగా మార్కెట్లో కనీస మద్దతు ధర కూడా లభించకపోవడంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద పసుపు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.6,850 చొప్పున రైతులకు చెల్లించేలా సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 60,812 ఎకరాల్లో పసుపు సాగు చేయగా 1,89,628 టన్నులు దిగుబడి వచ్చినట్టు అంచనా. గతేడాది మార్కెట్లో గరిష్టంగా క్వింటాల్‌కు రూ.7,900కు పైగా ధర పలకగా, ఈ ఏడాది మార్చి–ఏప్రిల్ వరకు క్వింటాల్‌కు రూ.7,500 వరకు పైగా పలికింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పంట రావడం, పొరుగు రాష్ట్రాల నుంచి మన పంటకు డిమాండ్ లేకపోవడం, ఎగుమతులు క్షీణించడం వంటి కారణాల వల్ల పసుపు ధర పతనమవుతూ వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఎగుమతులు ఈ ఏడాది 20% తగ్గడంతో ప్రస్తుతం క్వాలిటీని బట్టి క్వింటాల్ రూ.5,500 నుంచి రూ.6 వేలకు మించి ధర పలకడం లేదు. దీంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.6,850కు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కనీసం 30 వేల టన్నుల కొనుగోలు లక్ష్యం ఈ–పంటలో నమోదు ప్రామాణికంగా కనీసం 30వేల టన్నుల పసుపు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం రైతుల వద్ద ఏ మేరకు నిల్వలు ఉన్నాయో అంచనా వేసేందుకు ఆర్బీకే సిబ్బంది ద్వారా సర్వే చేపట్టింది. పంట కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 30 క్వింటాళ్ల వరకు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. సీఎం యాప్ ద్వారా ఆధార్ ఆధారిత రైతు ఖాతాల్లో పంట సొమ్ము జమ చేస్తారు. సర్వే పూర్తి కాగానే సీఎం యాప్ ద్వారా జూన్ రెండో వారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు. ఆర్బీకేల ద్వారా జూలై 31వ తేదీ వరకు కొనుగోలు చేస్తారు. పంట సేకరణకు నోడల్ ఏజెన్సీగా మార్క్‌ఫెడ్ వ్యవహరించనుండగా, జిల్లా జాయింట్ కలెక్టర్లు (రైతు భరోసా) నేతృత్వంలో జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగే కొనుగోలు ప్రక్రియలో డీసీఎంఎస్, పీఏసీఎస్, ఏఎంసీలు, ఎఫ్‌పీవోలు, స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. వీరికి 2.5 శాతం కమిషన్ చెల్లించనున్నారు. తొందరపడి అమ్ముకోవద్దు 2019–20లో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల నుంచి పసుపు కొనుగోలు చేసింది. ఆ తర్వాత వరుసగా రెండేళ్లూ మంచి ధర పలికింది. ప్రస్తుతం మార్కెట్ ధరలను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రైతుల వద్ద ఉన్న నిల్వలను గుర్తించేందుకు ఆర్బీకేల ద్వారా చేపట్టిన సర్వే పూర్తి కాగానే కొనుగోళ్లు చేపడతాం. మార్కెట్లో తిరిగి ధరలు పెరిగే అవకాశం ఉంది. రైతులు తొందరపడి అమ్ముకోవద్దు. – పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్ -
మోదీపై పోటి.. ఆ రైతుకు 787 ఓట్లు
సాక్షి, హైదరాబాద్ : వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేసిన నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు చెందిన రైతు సున్నం ఇస్తారికి 787 ఓట్లు వచ్చాయి. పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణకు చెందిన 24 మంది రైతులు నామినేషన్ వేశారు. అయితే అందులో 23 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా సున్నం ఇస్తారి అనే వ్యక్తి మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన 787 ఓట్లు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో మూడు లక్షల అరవై వేలకు పైగా మెజారిటీతో అఖండ విజయం సాధించారు. -
వారణాసి చేరుకున్న పసుపు రైతులు
ఆర్మూర్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంట్ నియో జకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన 50 మం ది పసుపు రైతులు శనివారం వారణాసికి చేరుకున్నా రు. పసుపు రైతుల సమస్యలను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లడం కోసం వారణాసి నుంచి బరిలో నిలవాలని తెలంగాణ పసుపు రైతుల సంఘం ప్రతినిధులు నిర్ణయించారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన పసుపు రైతులు శనివారం వారణాసికి చేరుకున్నారు. పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేసే స్వతంత్ర అభ్యర్థిని బలపరుస్తూ స్థానిక ఓటర్లు తమ వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. ఇప్పటికే పసుపు రైతులు పలువురి మద్దతు కూడగట్టుకున్నప్పటికీ అక్కడి పోలీసులు మద్దతుదారులపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు పలువురు రైతు నాయకులను అరెస్టు చేశారని పసుపు రైతులు ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. తెలంగాణ పసుపు రైతులకు మద్దతుగా తమిళనాడుకు చెందిన పసుపు రైతులు సైతం శనివారం వారణాసికి చేరుకున్నారని చెప్పారు. ఈ నెల 29లోగా నామినేషన్లు సమర్పిస్తామన్నారు. కాగా, తమిళనాడులోని ఈరోడ్ ప్రాం తానికి చెందిన పసుపు రైతుల సంఘం జాతీయ అధ్యక్షుడు దైవశిగామణి సహకారంతో వారణాసిలో నామినేషన్లు వేయడానికి పూనుకున్నారు. -
వారణాసికి పసుపు రైతులు
ఆర్మూర్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పసుపు రైతుల బృందం బయలుదేరి వెళ్లడం జిల్లాలో చర్చనీయాంశమైంది. నామినేషన్లు సమర్పించేందుకు జిల్లాకు చెందిన సుమారు 25 మంది రైతులు ఆర్మూర్ నుంచి గురువారం బయలుదేరి వెళ్లారు. తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన పసుపు రైతులు ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పసుపు రైతుల సమస్యలను దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయడం, ఎన్నికల అనంతరం కేంద్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలనే లక్ష్యంగా రైతులు ఈ నామినేషన్లు వేయనున్నారు. ఇటీవల రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా 178 మంది రైతులు నామినేషన్లు వేసి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చర్చ జరిగేలా చేయగలిగారు. అయితే రైతుల ఐక్య కార్యాచరణ కమిటీతో సంబంధం లేకుండా తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులు నామినేషన్లు వేస్తే సమస్య తీవ్రత దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుందని పసుపు రైతులు భావిస్తున్నారు. దీంతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్లు వేసిన రైతులు కాకుండా పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ నామినేషన్లు వేయనున్నారు. పసుపు పంటకు గిట్టుబాటు ధర సాధించుకోవడంతో పాటు పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమ బాట పట్టిన రైతులు తమకు గెలుపు, ఓటములు ముఖ్యం కాదని తమ సమస్య దేశ వ్యాప్తంగా చర్చకు వస్తే త్వరలో పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. బయల్దేరిన పసుపు రైతులు.. పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని రైతు సేవా కేంద్రం సమీపానికి చేరుకున్న పసుపు రైతులు విలేకరులతో మాట్లాడారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి పసుపు రైతులు చలో వారణాసి పేరిట నామినేషన్లు వేయడానికి బయల్దేరుతున్నామన్నారు. తమకు మద్దతుగా తమిళనాడుకు చెందిన పసుపు రైతుల సంఘం జాతీయ అధ్యక్షుడు దైవశిగామణి ఆధ్వర్యంలో సైతం పసుపు రైతులు తరలి వస్తున్నారన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా పోటీలో ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పసుపునకు ప్రత్యేక బోర్డు సాధించుకోవడమే లక్ష్యంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పసుపు రైతులపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. 12 ఏళ్లుగా తాము పసుపు రైతుల పక్షాన ఉద్యమాలు చేపడుతున్నామన్నారు. డిచ్పల్లి మండలంలో పసుపు పండించరన్న అరవింద్ జ్ఞానం ఏపాటితో అర్థమయిందన్నారు. డిచ్పల్లి మండలంలో రెండు వందల మంది రైతులు 300 ఎకరాల్లో పసుపు పంటను పండిస్తున్నారన్నారు. అనంతరం ఆర్మూర్ మండలం మామిడిపల్లి శివారు నుంచి బస్సులో హైదరాబాద్ వరకు బయల్దేరిన పసుపు రైతులకు కోటపాటి నర్సింహనాయుడు వీడ్కోలు పలికారు. హైదరాబాద్ నుంచి వీరు రైలు ప్రయాణం ద్వారా వారణాసికి చేరుకోనున్నారు. వారణాసికి బయల్దేరిన వారిలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి గంగారెడ్డి, కొట్టాల చిన్నారెడ్డి, వేముల శ్రీనివాస్, నాగలింగం, గురడి రాజరెడ్డి తదితరులున్నారు. కాగా వారణాసికి వెళ్లిన రైతులతో మాకు సంబంధం లేదని నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన పసుపు రైతులు విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.వారణాసి వెళ్లిన వారంతా టీఆర్ఎస్ నాయకులన్నారు. కమ్మర్పల్లి నుంచి.. కమ్మర్పల్లి: ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేసే వారణాసి స్థానం నుంచి నామినేషన్ వేయడానికి కమ్మర్పల్లి నుంచి రైతులు గురువారం వారణాసి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీపై పోటీ చేస్తున్నామని తెలిపారు. బద్దం రాజశేఖర్ రెడ్డి, వేముల శ్రీనివాస్‌రెడ్డి, చింత గణేష్, రాజేష్, పెంట ముత్తెన్న, బద్దం రాజేశ్వర్, రాజేందర్, శివ, మోహన్, పాషా, లక్ష్మణ్ తదితరులు వారణాసి వెళ్లిన వారిలో ఉన్నారు. ఏర్గట్ల నుంచి.. మోర్తాడ్: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై ఎంపీగా పోటీ చేయడానికి ఏర్గట్ల మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం తరలి వెళ్లారు. పసుపు ఏర్పాటు లక్ష్యంగా ప్రధానిపై పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వారణాసికి తరలివెళ్లిన వారిలో నాయకులు తుపాకుల శ్రీనివాస్‌గౌడ్, ఉపేంద్ర, బద్దం ముత్యం, దండబోయిన సాయన్న, బర్మ చిన్న నర్సయ్య తదితరులు ఉన్నారు. మాకు సంబంధం లేదు.. పెర్కిట్ (ఆర్మూర్): వారణాసిలో నామినేషన్లు వేస్తున్న వారితో మాకు ఎలాంటి సంబంధం లేదని ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన రైతులు స్పష్టం చేశారు. ఆర్మూర్ మండలం పెర్కిట్ ఎమ్మార్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు నాయకులు మాట్లాడుతూ వారణాసిలో నామినేషన్లు వేస్తున్న వారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారని స్పష్టం చేశారు. తాము పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రోడ్డెక్కినపుడు వారు ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేసారన్నారు. వాళ్లకు చిత్త శుద్ధి ఉంటే అప్పుడే మాతో కలిసి వచ్చేవారన్నారు. తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. మండలాల వారీగా కమిటీలు వేసుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన రైతులు కోల వెంకటేశ్, ఏలేటి మల్లారెడ్డి, గడ్డం రాజేశ్వర్, మహేందర్, నర్సయ్య, ఆరె సాయన్న, సుమన్, సంజీవ్, మోహన్ రెడ్డి, సంతోష్ రెడ్డి, లింగా రెడ్డి, ప్రవీణ్, రైతు ప్రతినిధులు అన్వేష్ రెడ్డి, సాయా రెడ్డి, ప్రభాకర్, దేవరాం పాల్గొన్నారు. -
ప్రధాని మోదీపై పోటీకి సై
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోటీ చేసేందుకు సుమారు 25 మంది పసు పు రైతులు గురువారం వారణాసికి తరలివెళ్లారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు చెందిన ఈ రైతులు ఆర్మూర్ నుంచి నాగ్‌పూర్‌కు బస్సులో బయలుదేరారు. అక్కడి నుంచి రైలులో శుక్రవారం వారణాసి చేరుకుంటారు. శనివా రం తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు. పసుపుబోర్డు ఏర్పాటుతోపాటు పంట కు మద్దతు ధర కల్పించాలనే తమ డిమాండ్‌ను దేశవ్యాప్తంగా చర్చకు దారితీసేలా ఇటీవల నిజామాబా ద్ నుంచి పసుపు రైతులు నామినేషన్లు వేశారు. ఇప్పు డు ప్రధానిపైనే పోటీ చేయడం ద్వారా తమ డిమాం డ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుందని వారు భావిస్తున్నారు. ఏఐసీసీ అధినేత రాహుల్ బరిలోకి దిగుతున్న వయనాడ్ నుంచి నామినేషన్లు వేయాలని భావించినా వీలు పడలేదని రైతులు పేర్కొన్నారు. స్థానిక రైతు సంఘాల సహకారంతో.. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయాలంటే సంబంధిత నియోజకవర్గంలో 10 మంది ఓటర్లు మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. దీంతో ఇక్కడి రైతులు వారణాసిలోని కొన్ని స్వతంత్ర రైతు సంఘాలతో సంప్రదింపులు జరిపారు. వీరి సహకారంతో నామినేషన్లు వేస్తామని పసుపు రైతు సంఘం రాష్ట్ర నాయకులు కోటపాటి నర్సింహ నాయుడు పేర్కొన్నారు. ఈరోడ్ పసుపు రైతుల మద్దతు నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు పసుపు సాగు చేసే తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతానికి చెందిన పసుపు రైతులు కూడా మద్దతు పలికారు. ఈరోడ్ పసుపు రైతులు కూడా వారణాసిలో నామినేషన్లు దాఖలు చేస్తారని ఇక్కడి రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఆల్ ఇండియా పసుపు రైతుల సంఘం అధ్యక్షులు పి.కె.వైవశిఖామణి తమకు మద్దతు పలికారని నర్సింహనాయుడు పేర్కొన్నారు. -
మోదీపై నిజామాబాద్ రైతుల పోటీ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి సంచలనం సృష్టించిన నిజామాబాద్ రైతులు ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపైనే పోటీ చేయాలని నిర్ణయించారు. వారణాసి నుంచి పోటీ చేసి తమ సమస్యను దేశవ్యాప్తంగా మరింత చర్చ జరిగేలా చేయాలని భావిస్తున్నారు. నిజామాబాద్ నుంచి నామినేషన్లు వేయడాన్ని కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నాయని, కేవ లం టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవితను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేయడం వల్ల అసలు విషయం పక్క దారి పట్టిందన్న భావన ఆ రైతుల్లో నెలకొంది. తెలంగాణ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి 50 మంది పసుపు రైతులు ‘చలో వారణాసి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అక్కడికి బయలుదేరినట్లు పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి తెలిపారు. అక్కడ మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయనున్నట్లు తెలిపారు. తమకు మద్దతుగా తమిళనాడు పసుపు రైతుల సంఘం అధ్యక్షు డు దైవశిగామణి నాయకత్వంలో మరికొందరు పసు పు రైతులు నామినేషన్లు వేయడానికి వస్తున్నట్లు తెలిపారు. తమ ప్రధాన ఉద్దేశం పసుపు బోర్డు, మద్దతు ధర సాధన మాత్రమేనన్నారు. గత ఐదేళ్లలో ఎంపీగా కవిత పసుపు బోర్డు సాధించడం కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఈ నెల 29 వరకు వారణాసిలో నామినేషన్లకు గడువు ఉన్నందున ఇతర రైతులు కూడా పెద్ద సంఖ్యలో తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
పసుపుబోర్డు కోసం కొట్లాడింది నేనే
రాయికల్(జగిత్యాల): పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్రంతో కొట్లాడింది తానే అని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ఆమె జగిత్యాల జిల్లా రాయికల్‌లో నిర్వహించిన బహిరంగసభ, ఆర్యవైశ్యుల సమావేశంలో మాట్లాడారు. పసుపు పంటకు మద్దతు ధర కోసం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో కలసి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వ్యవసాయ మంత్రితో పాటు పలువురు ముఖ్యమంత్రులను కలిశామని గుర్తుచేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పసుపు రైతుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నేడు పసుపు రైతులపై బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన రాష్ట్ర కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేశారని తెలిపారు. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను మనం గెలిపించుకుంటే ఢిల్లీలో సమస్యలపై పోరాటం చేయవచ్చని తెలిపారు. -
ఎక్కని కొండలేదు.. మొక్కని బండ లేదు
సాక్షి, జగిత్యాల: పసుపు రైతులకు న్యాయం కోసం తాను ఎక్కని కొండలేదని, మొక్కని బం డ లేదని సిట్టింగ్ ఎంపీ, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. ఇరవై ఏళ్లలో వారి కోసం ఎవరూ చేయనంతగా తన శక్తి మేరకు కృషి చేశానని చెప్పారు. జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలో విలేకరులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులు తన మీద పోటీ చేస్తే సమస్య పరిష్కారమవుతుందనుకుంటే తనకూ సంతోషమేనని వ్యాఖ్యానించారు. రైతుల కోసం ఎవరూ చేయనంతగా తన శక్తి మేరకు కొట్లాడానని పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో జాతీయ స్థాయి పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తమకు 16 సీట్లు ఇచ్చి గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి పసుపు బోర్డును సాధిస్తామని హామీ ఇచ్చారు. దేశం గతి మా రాలి, దేశంలో మంచి మార్పు రావాలంటే టీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఇచ్చి ఆశీర్వదించాలని కవిత కోరారు. 16 సీట్లను 116 చేసే సత్తా సీఎం కేసీఆర్‌కు ఉందన్నారు. ఆయనకు దేశంలో ఆ స్థాయి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. -
పసుపు రైతులను ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎర్రజొన్న, పసుపు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోర్తాడ్‌లో జరిగిన సభలో ప్రతి పసుపు కొమ్మును, ఎర్రజొన్న విత్తును కొంటామని సీఎం కేసీఆర్ చెప్పారని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్. దాసోజు శ్రావణ్‌కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్, కిసాన్ సెల్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, కార్యవర్గ సభ్యుడు ఆదిరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌లతో కలసి ఆయన మాట్లాడారు. పసుపు పంటకు 2007–08 సంవత్సరంలోనే రూ.15వేల వరకు ధర ఉండేదని, ఇప్పుడది రూ.4–5వేలకు పడిపోవడంతో ప్రతి ఎకరాకు రైతు రూ.2లక్షల మేర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కవిత పసుపు బోర్డు ఏర్పాటుపై అక్కడి రైతాం గానికి హామీ ఇచ్చినా సాధించలేకపోయారని విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడకుం డా ప్రభుత్వమే తగిన ధర చెల్లించి కొనుగోలు చేయాలని, లేదంటే స్థిరీకరణ ధర ద్వారా మా ర్కెట్ శక్తులను నియంత్రించాలని కోరారు. పోటీపడి దరఖాస్తులిస్తున్నారు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆశావాహులు పోటీలుపడి దరఖాస్తులు చేస్తున్నారని, వచ్చిన దరఖాస్తులన్నింటినీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ పరిశీలించిన అనంతరం జాబితాను అధిష్టానానికి పంపు తామని భట్టివిక్రమా ర్క చెప్పారు. ఈనెలాఖరుకల్లా లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఓ కొలిక్కి వస్తుందని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తుపై అధిష్టానందే తుది నిర్ణయమన్నారు. -
పసుపుపై ఆశలు
► గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో లక్ష క్వింటాళ్ల వరకు నిల్వ ► దుగ్గిరాల యార్డులో క్వింటా రూ. 8వేల వరకు కొనుగోలు ► ధర మరింత పెరుగుతుందని వేచిచూస్తున్న వ్యాపారులు ► అప్పుల నుంచి బయటపడేందుకు అమ్ముకుంటున్న వైనం తెనాలి : మార్కెట్ మాయాజాలంతో పెట్టుబడులు, ధ రకు పొంతన లేకున్నా పసుపు సాగు చేస్తున్న రైతులు మరోసారి ఈ సీజనులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుతం కొత్త పసుపు దుగ్గిరాల మార్కెట్ యార్డుకు వస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసినా పుచ్చు వచ్చిన చేలల్లో మినహా దిగుబడులు ఆశాజనకంగా ఉండడం రైతులకు ఊరటనిచ్చింది. మార్కెట్ ధరలపైనే ఈ పర్యాయం రైతులు, వ్యాపారులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. పెరుగుతుందన్న వ్యాపారుల భరోసాతో కోల్ట్‌స్టోరేజీల్లో భారీ పరిమాణంలో పసుపు నిల్వలున్నాయి. 20 వేల ఎకరాల్లో సాగు.. ఈసారి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 20 వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు. ప్రధానంగా ఇక్కడ ఎప్పట్నుంచో వస్తున్న కడప, టేకూరుపేట రకాలనే ఈసారీ సాగు చేశారు. విత్తనం ధర, సాగు ఖర్చులు, ఎరువులు, పసుపు వండినందుకు మొత్తం లెక్కిస్తే, పెట్టుబడులు ఎకరాకు రూ.75 వేల వరకు పెట్టారు. కౌలు రైతుల ఎకరాకు మరో రూ.30-50 వేలు అదనంగా వ్యయం చేసినట్టు. కౌలురేట్లు ప్రాంతాన్ని బట్టి రూ.30 నుంచి 50 వేల వరకు పలుకుతున్నాయి. ఎకరాకు 20-25 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలు రూ.8000 లోపుగానే ఉండటం గమనించాల్సిన అంశం. రైతులు విక్రయిస్తే పెట్టుబడులకు బొటాబొటీగా వచ్చినట్టవుతుంది. మిగిలేదేం ఉండదు. పుచ్చు ఆశించిన చేలల్లో దిగుబడి ఎటూ తగ్గినందున ఆ రైతులు కొంత నష్టపోక తప్పని పరిస్థితి. రూ. 8 వేల వరకు అమ్మకాలు... ప్రస్తుత సీజనులో దుగ్గిరాల మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లు బాగానే సాగుతున్నాయి. సోమవారం క్వింటాలు రూ.7,500 నుంచి రూ.8,000 వరకు అమ్మకాలు జరిగాయి. నాసిరకం, పుచ్చులు రూ.7000కు మించి ధరపడలేదు. 2013-14లో గరిష్ట సగటు ధర క్వింటాలు రూ.5,290 ఉంటే, 2014-15లో రూ. 7,200 వరకు పలికింది. 2015-16లో ధరలు కొంతమేర రైతుల్లో ఆశలు రేపాయి. 2015 ఏప్రిల్‌లో మోడల్ ధర రూ.6,711 ఉంటే మే నెలలో రూ.6,865, జూన్‌లో రూ.6,500లకు కొనుగోళ్లు జరిగి, అక్టోబరుకు వచ్చేసరికి రూ.8,000లకు చేరుకొన్నాయి. ఈ ట్రేడింగ్ ప్రవేశపెట్టాక గత నవంబరులో రూ.9,000లకు అమ్మకాలు జరిగి, నవంబరు 27న రూ.9,500లకు చేరుకొంది. ఏడాదంతా క్రమంగా పెరుగుతూ వస్తున్న పసుపు ధరలకు డిసెంబరు, జనవరిలో కొంత మాంద్యం ఏర్పడింది. ధరలు పెరుగుతాయనే అంచనా ... మళ్లీ ఇప్పుడు సీజను ఆరంభమైనందున పసుపు ధరలు పెరుగుతాయన్న అంచనా ఉంది. ఈ సీజనుపై ఆశపెట్టుకొని పెద్ద వ్యాపారులు పలువురు ఏడాదిగా నిల్వ చేసుకున్నారు. తెనాలి మార్కెట్ యార్డులో, గిడ్డంగిలో కలిపి 5 వేల బస్తాలుంటే, దుగ్గిరాలలోని మూడు కోల్ట్ స్టోరేజీలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పలు కోల్ట్‌స్టోరేజీల్లో పసుపు నిల్వలున్నట్టు చెబుతున్నారు. అన్నిచోట్ల కలిపి దాదాపు లక్ష క్వింటాళ్ల నిల్వలున్నట్టు అనధికార అంచనా. అద్దెలు, తెచ్చిన అప్పులకు వడ్డీలతో కలుపుకుంటే వందల కోట్ల రూపాయలు ఇప్పుడు పసుపుపై పెట్టుబడులు పెట్టారు. వీరంతా మార్కెట్లో ధర పుంజుకునే రోజుకోసం ఎదురుచూస్తున్నారు. సాధారణ రైతులు మాత్రం రేపటికి ఎదురుచూడకుండా ఉన్నంతలో అప్పుల్నుంచి బయటపడదామన్న భావనతో యార్డులో అమ్మకాలకు దిగుతున్నారు. -
పసుపు రైతుకు ప్రతి ఏటా నష్టాలే!
ధారూరు, న్యూస్‌లైన్: ఒకప్పుడు తులం బంగారానికి వచ్చిన ధర క్వింటాలు పసుపునకు వచ్చిందని, మళ్లీ ఆ మద్దతు ధర రాకపోతుందా.. అనే ఆశతో ప్రతీ సంవత్సరం పసుపు పంటను సాగు చేస్తున్నా నష్టాలే తప్పలాభాలు రావటం లేదని పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర లభిస్తుందన్న ఆశతో మండలంలోని పలు గ్రామాల రైతులు యేటా పసుపును సాగు చేస్తూనే ఉన్నారు. కేవలం 2010లో క్వింటాలు పసుపునకు రూ.18 వేల నుంచి రూ.19,500 వరకు మద్దతు ధర పలికింది. అప్పటి నుంచి రైతులు పెద్ద మొత్తంలో పసుపును పండిస్తున్నా 2011 నుంచి ఇప్పటివరకు ధర త గ్గడమే తప్ప పెరిగిన దాఖలాలు లే వని రైతులు వాపోతున్నారు. మండలంలోని కేరెల్లి, కొండాపూర్‌ఖుర్దు, ధర్మాపూర్, కొండాపూర్‌కలాన్, అవుసుపల్లి, ధారూరు, చింతకుంట, హరిదాస్‌పల్లి, అల్లిపూర ఎబ్బనూర్, బాచారం తదితర గ్రామాల్లో రైతులు దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో పసుపుపంట పండిస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక నష్టాలనే చవిచూస్తున్నారు. పసుపు పంట సాగు చేసిన రైతన్నలు ఎకరాకు రూ.60 వేల పెట్టుబడి పెడుతున్నా అమ్మకానికి మార్కెట్‌కు వెళితే మాత్రం క్వింటాలుకు రూ. 5,200 నుంచి రూ.6 వేల వరకే మద్దతు ధర పలకడంతో పెట్టుబడులు పోను చేతికి చిల్లిగవ్వ కూడా రాకపోగా నష్టాలే వస్తున్నాయని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 సంవత్సరాలుగా బహిరంగ మార్కెట్లో మద్దతు ధర రాకున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం తమ దీన స్థితిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు పొలాల పక్కనే పారుతున్న నది, వాగుల నుంచి డీజిల్ మోటార్ల ద్వారా నీటిని వాడటంవల్ల వేలల్లో ఖర్చవుతుందని రైతులు వాపోవున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడమే ప్రధాన కారణమని రైతులు పేర్కొన్నారు. ఒక తడికి ఎకరాకు డీజిల్ ఖర్చు రూ.5 నుంచి రూ.6 వేల వరకు అవుతుందన్నారు. కనీసం 4, 5 తడుల నీరు పెట్టాలని, ఇందుకు రూ.20 వేలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. 20 రోజుల పాటు కష్టాలే.. పంట చివరి దశలో 20 రోజుల పాటు శ్రమించాల్సి ఉంటుందని రైతులు పేర్కొన్నారు. పొలాన్ని దున్ని పసుపును వెలికి తీయడంతో పాటు ఉడికించడం, కొమ్ము, గొండలు వేరు చేయడం వంటి పనులు ఉంటాయన్నారు. పెద్ద మొత్తంలో కూలీలు అవసరవువుతారని, వారికి దినసరికూలి రూ.200 చొప్పున ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇంత ఖర్చు చేసినా పసుపుకొమ్ములను ఆరబెడితే ప్రస్తుతం అకాల వర్షాలు పసుపుకొమ్ముల రంగు మారడానికి కారణవువుతుందని వాపోతున్నారు. దీంతో ధర మరింత తగ్గి నష్టాలనే చవి చూస్తున్నామన్నారు. పసుపు రైతుల బాధలు గమనించి క్వింటాలుకు కనీసం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు మద్దతు ధర లభించేలా చూడాలని వారు అధికారులను కోరుతున్నారు. -
లోక్‌సభకు వందల సంఖ్యలో నామినేషన్లు వేస్తాం
ఆర్మూర్, న్యూస్‌లైన్ : నిజామాబాద్ పార్లమెంట్ స్థా నానికి నిర్వహించే ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలో వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తామని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆర్మూ ర్ మండలం మామిడిపల్లిలోని రైతు సేవా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి గ్రామం నుంచి ఒకరు లేదా ఇద్దరు రైతులు, గల్ఫ్ బాధితులు నామినేషన్లు వేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. పసుపు రైతులు, గల్ఫ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని పలు మార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి ఆశించిన స్పందన రావడం లేదన్నారు. ఎన్నికల సమయం కావడంతో వారు ఓట్ల కోసం తమ వద్దకు వస్తున్నందున తమ నిరసన తెలియజేయడంలో భాగంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తే ఈవీఎం స్థానంలో పెద్ద ఎత్తున బ్యాలెట్ పేపర్ ముద్రించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుందన్నారు. అందుకే రైతులు, గల్ఫ్ బాధితులతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి మంగళవారం ఉదయం 11 గంటలకు పెర్కిట్‌లోని నిమ్మల గార్డెన్స్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో రైతులు, గల్ఫ్ బాధితులు వచ్చి తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో సమన్వయకర్త కొత్తకుర్మ శివకుమార్, ముత్యాల మనోహర్‌రెడ్డి, వెల్ది ప్రసాద్, వెల్ది గౌతం రాజు తదితరులు పాల్గొన్నారు.