పసుపుపై ఆశలు | Guntur, Prakasam districts to store up to yellow one hundred thousand quintals | Sakshi
Sakshi News home page

పసుపుపై ఆశలు

Published Sat, Apr 9 2016 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

పసుపుపై ఆశలు

పసుపుపై ఆశలు

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో లక్ష క్వింటాళ్ల వరకు నిల్వ
దుగ్గిరాల యార్డులో క్వింటా రూ. 8వేల వరకు కొనుగోలు
ధర మరింత పెరుగుతుందని వేచిచూస్తున్న వ్యాపారులు
అప్పుల నుంచి బయటపడేందుకు అమ్ముకుంటున్న వైనం
 

 
తెనాలి : మార్కెట్ మాయాజాలంతో పెట్టుబడులు, ధ రకు పొంతన లేకున్నా పసుపు సాగు చేస్తున్న రైతులు మరోసారి ఈ సీజనులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రస్తుతం కొత్త పసుపు దుగ్గిరాల మార్కెట్ యార్డుకు వస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసినా పుచ్చు వచ్చిన చేలల్లో మినహా  దిగుబడులు ఆశాజనకంగా ఉండడం రైతులకు ఊరటనిచ్చింది. మార్కెట్ ధరలపైనే ఈ పర్యాయం రైతులు, వ్యాపారులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. పెరుగుతుందన్న వ్యాపారుల భరోసాతో కోల్ట్‌స్టోరేజీల్లో భారీ పరిమాణంలో పసుపు నిల్వలున్నాయి.


 20 వేల ఎకరాల్లో సాగు..
 ఈసారి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 20 వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు. ప్రధానంగా ఇక్కడ ఎప్పట్నుంచో వస్తున్న కడప, టేకూరుపేట రకాలనే ఈసారీ సాగు చేశారు. విత్తనం ధర, సాగు ఖర్చులు, ఎరువులు, పసుపు వండినందుకు మొత్తం లెక్కిస్తే, పెట్టుబడులు ఎకరాకు రూ.75 వేల వరకు పెట్టారు. కౌలు రైతుల ఎకరాకు మరో రూ.30-50 వేలు అదనంగా వ్యయం చేసినట్టు. కౌలురేట్లు ప్రాంతాన్ని బట్టి రూ.30 నుంచి 50 వేల వరకు పలుకుతున్నాయి. ఎకరాకు 20-25 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలు రూ.8000 లోపుగానే ఉండటం గమనించాల్సిన అంశం. రైతులు విక్రయిస్తే పెట్టుబడులకు బొటాబొటీగా వచ్చినట్టవుతుంది. మిగిలేదేం ఉండదు. పుచ్చు ఆశించిన చేలల్లో దిగుబడి ఎటూ తగ్గినందున ఆ రైతులు కొంత నష్టపోక తప్పని పరిస్థితి.


 రూ. 8 వేల వరకు అమ్మకాలు...
ప్రస్తుత సీజనులో దుగ్గిరాల మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లు బాగానే సాగుతున్నాయి. సోమవారం క్వింటాలు రూ.7,500 నుంచి రూ.8,000 వరకు అమ్మకాలు జరిగాయి. నాసిరకం, పుచ్చులు రూ.7000కు మించి ధరపడలేదు. 2013-14లో గరిష్ట సగటు ధర క్వింటాలు రూ.5,290 ఉంటే, 2014-15లో రూ. 7,200 వరకు పలికింది. 2015-16లో ధరలు కొంతమేర రైతుల్లో ఆశలు రేపాయి. 2015 ఏప్రిల్‌లో మోడల్ ధర రూ.6,711 ఉంటే మే నెలలో రూ.6,865, జూన్‌లో రూ.6,500లకు కొనుగోళ్లు జరిగి, అక్టోబరుకు వచ్చేసరికి రూ.8,000లకు చేరుకొన్నాయి. ఈ ట్రేడింగ్ ప్రవేశపెట్టాక గత నవంబరులో రూ.9,000లకు అమ్మకాలు జరిగి, నవంబరు 27న రూ.9,500లకు చేరుకొంది. ఏడాదంతా క్రమంగా పెరుగుతూ వస్తున్న పసుపు ధరలకు డిసెంబరు, జనవరిలో కొంత మాంద్యం ఏర్పడింది.
 
 
 ధరలు పెరుగుతాయనే అంచనా ...

మళ్లీ ఇప్పుడు సీజను ఆరంభమైనందున పసుపు ధరలు పెరుగుతాయన్న అంచనా ఉంది. ఈ సీజనుపై ఆశపెట్టుకొని పెద్ద వ్యాపారులు పలువురు ఏడాదిగా నిల్వ చేసుకున్నారు. తెనాలి మార్కెట్ యార్డులో, గిడ్డంగిలో కలిపి 5 వేల బస్తాలుంటే, దుగ్గిరాలలోని మూడు కోల్ట్ స్టోరేజీలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పలు కోల్ట్‌స్టోరేజీల్లో పసుపు నిల్వలున్నట్టు చెబుతున్నారు. అన్నిచోట్ల కలిపి దాదాపు లక్ష క్వింటాళ్ల  నిల్వలున్నట్టు అనధికార అంచనా. అద్దెలు, తెచ్చిన అప్పులకు వడ్డీలతో కలుపుకుంటే వందల కోట్ల రూపాయలు ఇప్పుడు పసుపుపై పెట్టుబడులు పెట్టారు. వీరంతా మార్కెట్లో ధర పుంజుకునే రోజుకోసం ఎదురుచూస్తున్నారు. సాధారణ రైతులు మాత్రం రేపటికి ఎదురుచూడకుండా ఉన్నంతలో అప్పుల్నుంచి బయటపడదామన్న భావనతో యార్డులో అమ్మకాలకు దిగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement