ఆరలేదని మొక్కజొన్న రైతును ముంచేశారు
ప్రభుత్వ నిర్లక్ష్యం, మార్క్‌ఫెడ్ అడ్డగోలు నిబంధనలతో మొక్కజొన్న రైతుల బేజారు
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలు, ప్రైవేటు వ్యాపారుల మాయాజాలం, ప్రభుత్వ నిర్లక్ష్యం.. వెరసి మొక్కజొన్న రైతును నిలువునా ముంచుతున్నాయి. నెల కింద క్వింటాలు రూ. 1,700 అమ్మిన మొక్కజొన్న.. రైతు చేతికి పంట వచ్చేసరికి ఒక్కసారిగా రూ. 1,100-1,200కు పడిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1,310 అయినా అందడం లేదని రైతన్న గగ్గోలు పెట్టాక, మార్కెట్ యార్డుల్లో ‘ధర్మాగ్రహాన్ని’ చూపాకగానీ సర్కారు మొద్దు నిద్ర వీడలేదు. అయినా, అన్నదాతకు ఆవేదన తప్పడంలేదు. మొక్కజొన్న కొనుగోళ్లకు ‘మార్క్‌ఫెడ్’ను రంగంలోకి దించినా.. ‘కనీస మద్దతు ధర’ లభిస్తుందనుకున్న రైతుల ఆశలు ‘తేమ శాతం’లో కొట్టుకుపోయాయి. 14 శాతం కన్నా ఎక్కువ తేమ ఉన్న మొక్కజొన్నలను కొనబోమని ‘మార్క్ ఫెడ్’ భీష్మించడంతో మార్కెట్‌కు తెచ్చిన సరకును రైతులు అక్కడే ఆరబెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఈసారి సర్కారుకు వరుణుడు తోడవడంతో మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్న వర్షానికి తడిసిపోయింది. రాష్ట్రంలో ఈ ఖరీఫ్‌లో 15.55 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యింది.
అందులో దాదాపు 12 లక్షల ఎకరాల సాగు మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలోనే ఉంది. 20 రోజుల ముందు వరకూ కూడా మార్కెట్లో క్వింటాలు మొక్కజొన్న ధర రూ.1,600- 1,700 మధ్య ఉంది. కానీ, ప్రైవేటు వ్యాపారులంతా కలసి పంట రైతు చేతికి వచ్చే సమయానికి రూ. 1,200కు ధర తగ్గించేశారు. ప్రైవేటు వ్యాపారుల ఆగడాలను అడ్డుకుని, సకాలంలో మార్క్‌ఫెడ్ లాంటి సంస్థలను కొనుగోళ్లకు దింపాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ కూ ర్చుంది. చివరికి రైతులు ఆందోళనలతో మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించింది. కానీ, సవాలక్ష నిబంధనలు పెడుతూ రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలులో జాప్యం చేయడం మొదలుపెట్టింది. అప్పటికే ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేటు వ్యాపారుల మాయాజాలంతో కుంగిపోయిన రైతన్నను వర్షం నిండా ముంచేసింది.
అడ్డగోలు నిబంధనలు: నిర్ణీత 14 శాతం కన్నా ఏమాత్రం ఎక్కువ తేమ ఉన్నా మార్క్‌ఫెడ్ మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదు. అదే ప్రైవేటు వ్యాపారులు తేమ శాతం ఎక్కువ ఉంటే కాస్త ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్ రైతులకు వెంటనే డబ్బు చెల్లించదు. కనీసం వారం తర్వాతే సొమ్ము అందుతుంది. అదే ప్రైవేటు వ్యాపారులు వెంటనే డబ్బు చెల్లిస్తారు. దానికితోడు కొనుగోళ్లలోనూ మార్క్‌ఫెడ్ జాప్యం చేయడంతో.. కనీస మద్దతు ధరకన్నా తక్కువకు ప్రైవేటు వ్యాపారులకు రైతులు మొక్కజొన్నను విక్రయించాల్సి వస్తోంది. దాంతో రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న ప్రైవేటు వ్యాపారులు... తమ మాయాజాలంతో రైతులను అందినకాడికి దోచుకుంటున్నారు.
ప్రైవేటు దందాతో ‘పౌల్ట్రీ’కీ ముప్పు: రాష్ట్రంలో ఉత్పత్తయ్యే మొక్కజొన్నలో 80 శాతానికిపైగా కోళ్ల పరిశ్రమ వినియోగానికే పోతుంది. దాంతో మొక్కజొన్న సరుకంతా ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో ఉంటే.. అది తమకు ఇబ్బందేనని కోళ్ల పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రైవేటు వ్యాపారులు మొక్కజొన్న కొనుగోలు సమయంలో ధర తగ్గించేసి రైతులను... అమేటప్పుడు ధర పెంచేసి తమనూ దోచుకునే అవకాశం ఉందని చెబుతున్నాయి.
మొక్కజొన్నను వీలైనంత మేరకు మార్క్‌ఫెడ్‌లాంటి ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తే.. రైతులకూ, తమకూ ప్రయోజనకరమని పౌల్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. మార్కెట్‌కు తెచ్చిన సరుకును తేమశాతం పేరుతో తిరస్కరించకుండా, అదనంగా ఉన్న తేమ శాతానికి తగినట్లుగా కొంత ధర తగ్గించైనా మార్క్‌ఫెడ్ మొక్కజొన్నను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే, ఈ విషయమై మార్క్‌ఫెడ్ ఎండీ దినకర్ బాబును వివరణ కోరగా.. ప్రభుత్వం ప్రత్యేకమైన ఆదేశాలు ఇస్తే తప్ప తేమ శాతం అధికంగా ఉన్న సరుకు కొనుగోలు చేయడం కుదరదని తేల్చిచెప్పారు. జిల్లా కలెక్టర్ల సూచన మేరకు ఇప్పటివరకూ 53 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, దాదాపు 34 వేల క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేశామని మార్క్‌ఫెడ్ జీఎం తేజోవతి ‘సాక్షి’కి తెలిపారు. ఈ కొనుగోళ్లకు సంబంధించి రూ. 4.45 కోట్లను ఆయా కేంద్రాలకు విడుదల చేశామని తెలిపారు.