Buying Centers
-
12 వరకు మొక్కజొన్న కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: మార్కెట్లో ధరలు పుంజుకున్నప్పటికీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మరికొంతకాలం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అనుమతికి మించి రైతుల నుంచి కొనుగోలు చేయడమేగాక సకాలంలో డబ్బు చెల్లిస్తూ వారికి బాసటగా నిలుస్తోంది. ప్రభుత్వ జోక్యంతో మార్కెట్లో ధరలు మళ్లీ పుంజుకోవడంతో మొక్కజొన్న రైతులు సంతోషిస్తున్నారు. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. అయినప్పటికీ రైతు ప్రయోజనాల దృష్ట్యా ఈ నెల 12వ తేదీ వరకు కొనుగోళ్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదిరోజుల్లోనే రైతులకు సొమ్ము మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోంది. కనీస మద్దతుధర కంటే మార్కెట్లో మొక్కజొన్న ధరలు తగ్గినట్టు సీఎం యాప్ ద్వారా గుర్తించిన మరుక్షణం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపింది. కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.1,962 కాగా, మార్కెట్లో రూ.1,500 నుంచి రూ.1,800 చొప్పున పలుకుతుండడంతో మొక్కజొన్న ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లోని 1,548 ఆర్బీకేల పరిధిలో కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. మే 5వ తేదీన కొనుగోళ్లు ప్రారంభించింది. తొలుత 25,316 మంది రైతులు తమ వివరాలను ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు 698 ఆర్బీకేల పరిధిలో 8,915 మంది రైతుల నుంచి కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.1,962 చొప్పున రూ.140.18 కోట్ల విలువైన 71,445 టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు పదిరోజుల్లోనే డబ్బు చెల్లిస్తోంది. ఇప్పటికే సీఎం యాప్ ద్వారా 6,292 మంది రైతులకు రూ.95.29 కోట్లు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని వారం, పదిరోజుల్లో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెస్పీకి మించి పలుకుతున్న ధర ప్రభుత్వ జోక్యంతో వ్యాపారులు సైతం పోటీపడడంతో మార్కెట్లో ధరలు అనూహ్యంగా పుంజుకున్నాయి. ఫలితంగా ప్రస్తుతం సాధారణ కామన్ వెరైటీ సైతం కనీస మద్దతు ధరతో సమానంగా ఉండగా, ఫైన్ క్వాలిటీ మొక్కజొన్న ధర క్వింటాల్ రూ.2 వేలకు పైగా పలుకుతోంది. దీంతో రైతులు తమ వద్ద ఉన్న నిల్వలను బహిరంగమార్కెట్లో అమ్ముకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 85 శాతానికి పైగా రైతుల వద్ద ఉన్న నిల్వలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో తొలుత ఈ నెల 9వ తేదీతో కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించినా.. చివరి గింజ అమ్ముకునే వరకు రైతులకు అండగా నిలవాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు ఈ నెల 12వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. సీఎం యాప్ ద్వారా ప్రతి రోజు మొక్కజొన్నతో సహా ఇతర పంట ఉత్పత్తుల మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే నష్టపోయేవాడిని.. పంట చేతికొచి్చంది. మార్కెట్లో ధర లేదు. పెట్టుబడి కూడా దక్కుతుందో లేదో అని ఆందోళన చెందా. ఏం చేయాలో పాలుపోలేదు. ప్రభుత్వం మా ఊళ్లోనే ఆర్బీకేలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. 113 క్వింటాళ్లు ఈ కేంద్రంలో అమ్ముకున్నా. పదిరోజులు తిరక్కుండానే క్వింటా రూ.1,962 చొప్పున రూ.2.22 లక్షలు నా అకౌంట్లో జమ అయ్యాయి. చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఆదుకోకపోతే నష్టపోయేవాడిని. – ఎస్.వెంకటేశ్వరరెడ్డి, పాలపాడు, పల్నాడు జిల్లా కొనుగోలు కేంద్రంలో విక్రయంతో లబ్ధి నేను 10 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశా. బయట క్వింటా రూ.1,600కు మాత్రమే కొంటున్నారు. దీంతో మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలనుకున్నా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజుల కిందట క్వింటా రూ.1,900 చొప్పున 10 టన్నులు విక్రయించా. దీంతో క్వింటాకు రూ.300 చొప్పున, 10 టన్నులకు రూ.30 వేల మేర లబ్ధి కలిగింది. – చీడెపూడి సాంబిరెడ్డి, వలివేరు, బాపట్ల జిల్లా కేంద్రాలు కొనసాగిస్తాం ప్రభుత్వ జోక్యం వల్ల వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో మొక్కజొన్న ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కనీస మద్దతు ధరకు మించే కొనుగోలు చేస్తున్నారు. ఫైన్ క్వాలిటీ రూ.2 వేలకుపైగా పలుకుతోంది. ప్రభుత్వాదేశాలతో ఈ నెల 12వ తేదీ వరకు కేంద్రాలు తెరిచే ఉంటాయి. రైతుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి మరికొంతకాలం కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. – రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు: కోన శశిధర్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది రూ.8,600 కోట్లతో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. గతం కంటే ఎక్కువ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 25 లక్షల 25 వేల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు చేయగా ఎప్పుడూ లేని విధంగా కడప, కర్నూల్లో అధికంగా కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు. ఇక రైతులు, దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొంటున్నామని, ఈ క్రమంలో రైతుల పొలాలకు వెళ్లి ధాన్యం కోనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్బీకేల్లో రైతులకు రిజిస్ట్రేషన్, కొనుగోలు కూపన్లు ఇవ్వడం ద్వారా రైతులకు పేమెంట్ ఆలస్యం లేకుండా చేస్తున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి రూ.3,900 కోట్లు రావాల్సి ఉండగా, కేంద్రం ఏటా ఇచ్చే అడ్వాన్స్ కూడా ఇవ్వలేదని అయినా పెండింగ్‌లో ఉన్న రూ.300 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. జులై నెలాఖరు వరకు ధాన్యం సేకరణ చేస్తామని అన్నారు. చదవండి: Jagananna Vidya Kanuka: నాణ్యమైన ‘కానుక’.. ఈ ఏడాది అవి అదనం -
లారీ రాదు.. కాంటా కాదు!
ఈమె పేరు నక్క రమ్య. నాగారం పంచాయతీ వార్డు సభ్యురాలు. రెండు ఎకరాల్లో వరి సాగు చేశారు. వంద బస్తాల ధాన్యం పండింది. దీంతో సంతోషించిన ఆమె అధికారులు ఇచ్చిన టోకెన్ ప్రకారం 15రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చారు. అయితే, ఇప్పటి వరకు కూడా తూకం వేయడం లేదు. లారీ వచ్చి ఇక్కడి ధాన్యాన్ని తీసుకెళ్తే తప్ప కాంటా వేయలేమని సిబ్బంది చెబుతున్నారు. అకాల వర్షాలతో భయంగా ఉందని వాపోతున్నారు. హసన్‌పర్తి: కాలం కలిసి రావడంతో చేతికొచ్చిన పంటను చూసి ఆనందపడాలా... రోజులు గడిచిపోతూ అకాల వర్షం కురుస్తున్నా కాంటాలు కాకపోవడంతో ఆందోళన చెందాలా... కాంటాలు అయినా ధాన్యాన్ని తరలించకపోవడంతో దిగులు పడాలా... ఇవీ అన్నదాతల సందేహాలు! కొనుగోలు కేంద్రాల్లో ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తూకం వేయకపోగా, తూకం వేసిన ధాన్యాన్ని సైతం తరలించేందుకు లారీలు పంపించకపోవడంతో నిద్ర, ఆహారం మానుకుని నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొనుగోలుకేంద్రాల వద్ద కుప్పలుగా ధాన్యం పేరుకుపోతున్నా అధికారుల పట్టింపులేని తనం రైతుల ఆందోళనకు కారణమవుతోంది. ఓ దశలో రైతులు ఐకేపీ, పీఏసీఎస్ నిర్వాహకులతో గొడవకు దిగుతున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. 92 కొనుగోలు కేంద్రాలు వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 92 కేంద్రాలు ఏర్పాటుచేశారు. జిల్లాలోని వరంగల్, కాజీపేట, ఖిలా వరంగల్, ఐనవోలు, హసన్‌పర్తి, హన్మకొండ, ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 29 కొనుగోలు కేంద్రాలు ఐకేసీ ఆధ్వర్యాన మిగిలిన 63 కేంద్రాలు ఆయా మండలాల్లోని పీఏసీఎస్‌ల ఆధ్వర్యాన నిర్వహిస్తున్నారు. ఈసారి టోకెన్ పద్ధతి ప్రారంభించిన అధికారులు టోకెన్లల తేదీల వారీగానే రైతులు తమ ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ఇంత వరకు బాగానే ఉన్నా... కేంద్రాలకు తీసుకొచ్చిన వారి ధాన్యాన్ని కాంటా వేయడంతో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒకవేళ కాంటా పూర్తయినా మిల్లులకు తరలించడంలో లారీల కొరత కారణంగా జాప్యం జరుగుతుండడంతో రైతులే కాపలా ఉండాల్సి వస్తోంది. పేరుకుపోయిన ధాన్యం... ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద వరి «ధాన్యం పేరుకపోయ్యింది. జిల్లా వ్యాప్తంగా 92 కేంద్రాలు నిర్వహిస్తుండగా, ఒక్కో కేంద్రం ప్రస్తుతం 10 నుంచి 90 లారీలకు సరిపడా ధాన్యం నిల్వ ఉన్నట్లు అంచనా. ఇందులో చాలా వరకు తూకం వేయని ధాన్యమే ఉండడం గమనార్హం. హసన్‌పర్తి మండలంలోని వంగపహాడ్ ప్రాథమిక వ్యవసాయ ప్రాధమిక సహకార కేంద్రం వద్ద 60లారీలు, బైరాన్‌పల్లి కేంద్రం 20 లారీలు, మల్లారెడ్డిపల్లిలో 40 లారీలు, సూదన్‌పల్లి కేంద్రం వద్ద 20లారీలు, నాగారం వద్ద 90 లారీలు, అన్నాసాగరం వద్ద 15 లారీలు, దేవన్నపేట వద్ద 10 లారీలు, సీతంపేట వద్ద 15లారీలు, ఎల్లాపురం వద్ద 10లారీలు, జయగిరి వద్ద15 లారీలు, గంటూరుపల్లి వద్ద 15 లారీలు, పెంబర్తి వద్ద 10లారీలు, పెగడపల్లి వద్ద 30 లారీలకు సరిడా ధాన్యం నిల్వ ఉందని రైతులు చెబుతున్నారు. కాగా, ఇందులో చాలా మంది రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు దాటుతోందని తెలుస్తోంది. కాంటా పూర్తికాక ముందే వర్షం వస్తే తడిచిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజులకో లారీ ఒక కేంద్రానికి లారీ పంపిస్తే.. మరో నాలుగు రోజులు గడిస్తే తప్ప లారీ రావడం లేదని సమాచారం. మిల్లుల వద్ద ధాన్యం దింపడానికి హమాలీల కొరత కారణంగా సమయం పడుతుండగా.. లారీలు కూడా సరిపడా సమకూర్చలేకపోతున్నారని తెలుస్తోంది. కాగా, ధాన్యం తీసుకెళ్లడానికి లారీలు పంపించాల్సిన బాధ్యతను ప్రభుత్వం ఆర్టీఏ అధికారులకు అప్పగించింది. దీంతో నాలుగు రోజుల క్రితం బాహుపేట ఆర్టీఏ అధికారులకు ఒక ఖాళీ లారీను ఆపి «వంగపహాడ్‌లోని ధాన్యం కేంద్రానికి పంపించారు. ఇద్దరు రైతులను ఆ లారీలో ఎక్కించారు. అయితే లారీ డ్రైవర్ మధ్యలోనే రైతులను దింపేసి వెళ్లిపోయాడు. ఈ మేరకు సాయంత్రం వరకు వారు ఇంటికి చేరుకోకపోవడంతో పీఏసీఎస్ చైర్మన్ తన బైక్‌పై వారిని తీసుకురావాల్సి వచ్చింది. ఇకనైనా లారీ అసోసియేషన్ల బాధ్యులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యుల సమన్వయంతో లారీలను సమకూర్చి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. ఈయన పేరు చేరాలు. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈయన నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాడు. సుమారు మూడు వందల బస్తాల పంట పండింది. ఏప్రిల్ 29వ తేదీన కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకెళ్తే ఇప్పటి వరకు కాంటా వేయలేదు. రెండు రోజుల క్రితం వీచిన గాలి దుమారానికి ధాన్యం కొట్టుకపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ధాన్యం కాంటా వేసేలా అధికారులు చూడాలని కోరుతున్నాడు రోజూ ఆందోళనే.. ధాన్యం తీసుకొచ్చి పది రోజులైతాంది. ఇప్పటి వరకు తూకం వేయలేదు. రోజూ ఇక్కడికి వచ్చి కాంటా వేయమని అడుగుతున్నాం. లారీలు వస్తే కానీ తూకం వేయలేమని చెబుతున్నారు. సోమవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది.– గండు సరోజన, వంగపహాడ్ ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తున్నాం... కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకెళ్లడానికి లారీలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ కొనుగోలు కేంద్రానికి అక్కడ ఉన్న ధాన్యం నిల్వల మేరకు లారీలు పంపుతున్నాం. ఇటు ఎల్కతుర్తి, అటు రాంపూర్ వద్ద ఆర్టీఏ అధికారులను ఖాళీ లారీలను ఆపి కొనుగోలు కేంద్రాలకు మళ్లిస్తున్నారు. ఇటీవల లారీల వల్ల ఇబ్బందులు ఎదురైన విషయం వాస్తవమే. వీటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నా. – రాజ్‌కుమార్,సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ -
ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం
సాక్షి, కరీంనగర్ : ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 170 కొనుగోలు కేంద్రాలను ఈ నెలాఖరు వరకు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. సింగిల్‌విండో ఆధ్వర్యంలో 104, ఐకేపీ 50, డీసీఎంస్ 15, మెప్మా ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లలో గతంలో తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు ప్రస్తుత సీజన్ నుంచి కొత్త నిబంధనల అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. ధాన్యం రవాణా, పర్యవేక్షణ, కనీస మద్దతు ధర, వివిధ శాఖల సమన్వయం కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీలో జిల్లా పోలీస్ కమిషనర్, జిల్లా లేబర్ ఆఫీసరు, లీడ్‌బ్యాంకు మేనేజరు సభ్యులుగా ఉంటారు. ధరణిపైనే భారం... ధాన్యం కొనుగోళ్లలో కీలకపాత్ర పోషించిన వీఆర్వోలను తప్పించి కొత్తగా ఏఈవోలకు బాధ్యతలు అప్పగించారు. గతంలో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లాలంటే ఆయా గ్రామాల వీఆర్వోలు సంబంధిత పంట ఎంత పండించారంటూ నిర్ధారణ చేసి ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. ప్రస్తుతం ధరణి వెబ్‌సైట్‌ను సహకార సంఘాలు, ఐకేపీ సంఘాలకు లింకేజీ చేయడంతో సంబంధిత రైతుల వివరాలన్నింటిని ఏఈవోలు సమగ్రంగా పరిశీలిస్తారు. రైతులు తెచ్చిన ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేస్తారు. నెలాఖరులో ప్రారంభం.. జిల్లాలో నెలకొన్న వర్షభావ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్ వరినాట్లు ఆలస్యమయ్యాయి. జూన్‌లో నాట్లు వేసినట్లయితే ఈ నెల మొదటివారంలో వరిపంట కోతకు వచ్చినట్లయితే ధాన్యం సేకరణ ప్రారంభించేవాళ్లు. ఆగస్టు నెలాఖరు వరకు వరినాట్లు వేయడంతో పంట దిగుబడి వచ్చేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశముంది. ప్రస్తుత ఖరీఫ్‌లో హుజూరాబాద్, గన్నేరువరం, మానకొండూరు, తిమ్మాపూర్, చిగురుమామిడి, వీణవంక, సైదాపూర్, కొత్తపల్లి, కరీంనగర్ మండలాల్లో వరిపంట ఎక్కువగా సాగైంది. వరికోతలు ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో ఈ నెలాఖరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖరీఫ్‌లో 66,422 హెక్టార్లలో వరి సాగు కాగా.. 2.20 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1835, సాధారణ రకానికి రూ.1815 చెల్లించనున్నారు. కౌలురైతులకు ఇబ్బంది.. ధాన్యం కొనుగోళ్లలోని కొత్త నిబంధనలతో కౌలురైతులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి భూమి తోపాటు ఇతర భూమిని కౌలుకు తీసుకుని పం టలు పండిస్తున్నారు. కౌలురైతులు పండించిన ధాన్యం కేంద్రాలకు తీసుకొచ్చినప్పుడు అసలైన రైతుల వివరాలే ధరణి వెబ్సైట్లో ఉంటాయి. ఈ రైతుల పేరిటనే ధాన్యం విక్రయించడంతోపాటు డబ్బులు సైతం వారి బ్యాంకు ఖాతాల్లోనే జమయ్యే అవకాశం ఉండడంతో కౌలురైతులు కేంద్రాలకు వచ్చేందుకు వెనుకంజ వేస్తారని అధికారులు పేర్కొంటున్నారు. -
మద్దతు ధరల కోసమే కొనుగోలు కేంద్రాలు
మెట్పల్లి(కోరుట్ల): రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందించడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం మినుముల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మినుములకు బహిరంగ మార్కెట్లో తక్కువ ధర ఉన్నందున రైతుల విజ్ఞప్తి మేరకు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. క్వింటాల్‌కు రూ.5400 మద్దతు ధర అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్‌చైర్మన్ నల్ల తిరుపతిరెడ్డి, సహకార సంఘం చైర్మన్ మారు మురళీధర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ చీటీ వెంకట్రావు, మార్క్‌ఫెడ్ డీఎం శ్యాంకుమార్, నాయకులు మారు సాయిరెడ్డి, ఇల్లెందుల శ్రీనివా స్, గురిజెల రాజిరెడ్డి, జావీద్ తదితరులున్నారు. -
ప్రా‘ధాన్య’మొచ్చే !
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పంటకు తెగుళ్లు, దిగుబడి తగ్గిన కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ నామమాత్రంగానే ఉంటుందనుకున్నప్పటికీ..ఊహించని విధంగా కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గతేడాది కంటే అధికంగా కొనుగోలు చేసి..మరింత ముమ్మరంగా సేకరిస్తుండడం విశేషం. జిల్లాలో పౌర సరఫరాల శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు రైతుల సరుకుతో కళకళలాడుతున్నాయి. ఈ సీజన్ పూర్తయ్యే నాటికి 48వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు తొలుత 91 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే ఈసారి దిగుబడి పడిపోయిందనే భావనతో మొత్తం 60 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాలు 51 ఉండగా, ఐకేపీ కేంద్రాలు తొమ్మిది ఉన్నాయి. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 39,323మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. గతేడాది 34,835మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. గ్రేడ్– ఏ రకం క్వింటా ధర రూ.1590, కామన్ రకానికి రూ.1540గా నిర్ణయించారు. సుడిదోమ దెబ్బతో తగ్గిన దిగుబడి.. ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఖమ్మంజిల్లాలో మొత్తం లక్ష మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 60వేల హెక్టార్లలో వరిని సాగు చేశారు. ప్రతి ఏడాది ఎకరానికి 30నుంచి 32 బస్తాల దిగుబడి వచ్చేది. అయితే రైతులను ఈ ఏడాది సుడిదోమ దెబ్బతీయడంతో ఎకరానికి 6 నుంచి 8బస్తాల దిగుబడి తగ్గింది. ఫలితంగా కొనుగోలు కేంద్రాలను కూడా తగ్గించారు. కానీ..సేకరణ ఆశాజనకంగా ఉండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ముందు నుంచే సన్నద్ధం.. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రాధాన్యతను వివరిస్తూ ఆ శాఖాధికారులు ముందు నుంచే దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం రైతులను చైతన్యపరిచారు. గతేడాది ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యంగా నిర్ణయించగా..1.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. అప్పుడు ఖమ్మం జిల్లాలోని 21మండలాల పరిధిలో 34,835.609మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించగా గతేడాది కంటే ఇప్పటి వరకు 5వేల మెట్రిక్ టన్నుల «ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 4,416మంది రైతుల నుంచి మొత్తం 39,323.040 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసినట్లయింది. అందులో గ్రేడ్ ఏ రకం– 32,103.760మెట్రిక్ టన్నులు, కామన్ రకం 7,219.280మెట్రిక్ టన్నుల «ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ.62,23,48,624 చెల్లించాల్సి ఉంది. ఇందులో 4,259మంది రైతులకు రూ.61,80,86,124లు చెల్లింపులు చేయగా..157మంది రైతులకు సంబంధించిన రూ.42,62,500లు చెల్లించాల్సి ఉంది. 2016–17 వివరాలు ఇలా.. కొనుకోలు కేంద్రాలు 49 రైతులు 4,536 గ్రేడ్ ఏ రకం 24,955.903 మెట్రిక్ టన్నులు కామన్ రకం 9879.706 మెట్రిక్ టన్నులు మొత్తం కొనుగోళ్లు 34,835.609 గ్రేడ్ ఏ రకం క్వింటా ధర రూ.1,510 కామన్ రకం ధర రూ.1,470 చెల్లింపులు రూ. 52,20,65,813.50 -
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
► కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ సదాశివపేట: కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం అందించే మద్దతు ధర రూ.1510కు రైతులు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ సూచించారు. సోమవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ధ్యాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాణిక్కరాజ్ మాట్లాడుతూ.. సదాశివపేట ప్రాథమిక వ్యవసాయ పరిపతి సహకార సంఘంలో 2007 మంది సభ్యులున్నప్పటికీ 600 మంది రైతులు మాత్రమే పంట రుణాలు తీసుకున్నారని, 50 మంది లాంగ్‌టర్న్ లోన్స్ తీసుకున్నారన్నారు. ఖరీఫ్ సీజన్లో కనీసం 1500 మంది రైతులు పంట రుణాలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా పీఎసీఎస్ సొసైటీల్లో సభ్యులుగా ఉన్న రైతులు ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం రూ.5 వేల పంట రుణాలు తీసుకోవచ్చన్నారు. కాగా, రూ.5 వేల పంటరుణం డబ్బులను రైతు చేతికి అందజేమన్నారు. ఈక్రమంలో రైతులు తీసుకున్న రూ.5 రుణానికి ఆరు నెలల తర్వాత రూ.300 వడ్డీ కలిపి చెల్సించాల్సి ఉంటుందని తెలిపారు. ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి అయితే ఈ ఖరీఫ్‌లో ఖర్చు రూ.1000 తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్‌కు ధర రూ.1510, బీ గ్రేడ్‌కు రూ.1470 మద్దతు ధర లభిస్తుందన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులను సూచించారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చింతకుంట రాధాభాయి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతోందని చెప్పారు. అనంతరం మార్కెట్ కార్యాలయం ఎదుట హమాలీలకు, రైతుల కోసం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్‌ను కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, రూరల్ బ్యాంక్ చైర్మన్లు గడీల అశిరెడ్డి, అంజిరెడ్డి, సివిల్ సప్లయ్ మేనేజర్ విజయ్‌కుమార్, మార్కెట్ డీఎం నరేందర్‌రెడ్డి, డీఎస్ఓ జితేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పెద్దగొల్ల అంజనేయులు, డైరెక్టర్లు తుల్జరామ్, ప్రభుదాస్, రాములు, మల్కయ్య, ఉల్లిగడ్డ విద్యాసాగర్, కొత్త రమేశ్, మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, సూపర్వైజర్ శ్రీనివాస్, పీఎస్సీస్ సీఈఓ విజయ్‌కుమార్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొత్తగొల్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శి చిన్న, యువత అధ్యక్షుడు విరేశం, మండల కో–ఆప్షన్ మెంబర్ సలావుద్దీన్, రైతులు పాల్గొన్నారు. -
మక్క రైతుకు మద్దతేది?
నా పేరు చంద్రగిరి రాజయ్య. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం దుబ్యాల గ్రామం. ముప్పై క్వింటాళ్ల మక్కలు మార్కెట్‌కు తీసుకవచ్చిన. తేమ చూసి తక్కువ ధర పెట్టిండ్రు. క్వింటాల్‌కు రూ.960 చొప్పున కొన్నరు. సర్కారు మద్దతు ధర వస్తుందని పక్క జిల్లా నుంచి వస్తే.. నిలువున దోచుకునేందుకు సిద్ధమైండ్రు. ధర పలికితేనే మక్కలు ఇస్తనని చెప్పిన. అడ్తిదారులు ఇంకో మాటే మాట్లాడలేదు. మంగళవారం మార్క్‌ఫెడ్ వాళ్లు కాంట పెడ్తరట. వాళ్లైనా మద్దతు ధర పెడ్తరని ఎదురుచూస్తున్న. - జమ్మికుంట కరీంనగర్ అగ్రికల్చర్: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రణాళిక గాడి తప్పింది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సిన మార్క్‌ఫెడ్ యంత్రాంగం నిరక్ష్యం చేసింది. ఫలితంగా మక్క రైతులకు సర్కారు ‘మద్దతు’ దక్కకుండా పోతోంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1310 ఉండగా, వ్యాపారులు రూ.900 నుంచి రూ.1080 మాత్రమే చెల్లిస్తున్నారు. తేమ, నాణ్యత సాకుతో మక్క రైతులను నిండా ముంచుతున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జోక్యంతో ఎట్టకేలకు మార్క్‌ఫెడ్ అధికారులు కదిలారు. జమ్మికుంట, హుజూరాబాద్ మార్కెట్లలో మంగళవారం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చారు. జిల్లావ్యాప్తంగా 25 మార్కెట్ యార్డులున్నాయి. యార్డు సౌకర్యం లేని మేడిపల్లి, కథలాపూర్, పోత్గల్, కాటారం, మల్లాపూర్ మినహా మార్కెట్లు మినహా 20 యూర్డుల్లో మక్కల కొనుగోలుకు ప్రణాళిక రూపొందించారు. అయితే దశలవారీగా మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తుల ఆధారంగా కేంద్రాలను పెంచేందుకు యోచిస్తున్నారు. గతేడాది జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మార్కెట్లలో మొదటి దశలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి కూడా మొదటి దశలో ఇవే మార్కెట్లలో కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం జమ్మికుంట, హుజూరాబాద్ మార్కెట్లలో కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. తొలకరి ప్రారంభ దశలో విత్తనాలు వేసుకున్న రైతులు ప్రస్తుతం మక్కల నూర్పిళ్లు చేసేస్తున్నారు. ఈసారి వర్షాలు ఆలస్యంగా కురవడంతో దిగుబడులు కూడా కొంత ఆలస్యంగానే వస్తాయనుకుని కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తున్నట్టు మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. కానీ.. నేలల ప్రభావం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికే దిగుబడులు చేతికొచ్చాయి. మరో వారం రోజుల్లో కుప్పలు తెప్పలుగా మార్కెట్‌కు వచ్చే అవకాశముంది. కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరుచుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వారు ధర అమాంతం తగ్గించి నిలువునా దోచుకుంటున్నారు. మొక్కజొన్నకు కేంద్రప్రభుత్వం రూ.1310 మద్దతు ధర ప్రకటించింది. దళారులు ఇప్పటికే విక్రయానికి వస్తున్న మక్కలకు రూ.900 నుంచి రూ.1000 వరకు కొనుగోలు చేసి రైతులను దగా చేస్తున్నారు. సోమవారం కరీంనగర్ మార్కెట్ యార్డుకు 56 క్వింటాళ్ల మక్కలు వచ్చారుు. వ్యాపారులు రూ.1001 నుంచి రూ.1085 మాత్ర మే చెల్లించారు. జమ్మికుంట మార్కెట్లో 335 క్వింటాళ్ల మక్కలు కొన్నారు. అక్కడ రూ.900 నుంచి రూ.1000 మాత్రమే ధర నిర్ణరుుంచారు. ఒక్కో క్వింటాలుకు రూ.300 నుంచి రూ.400 దాకా కోతపెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మార్కెట్లలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తేనే.. దళారుల నుంచి విముక్తి లభిస్తుందని రైతులు అంటున్నారు. సమయానికి వర్షాలు కురవకపోవడంతో దిగుబడిలో నాణ్యత కొరవడే అవకాశముంది. గింజలు రంగుమారటం, పరిమాణంలో చిన్నగా ఉండడం తదితర సమస్యలు తలెత్తే అవకాశముంది. ప్రభుత్వం దిగుబడిలో 40 శాతం మేరకే కొనుగోలు చేసేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. నాణ్యత లేని దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో ప్రభుత్వరంగ సంస్థలు కొనుగోలు చేస్తేనే మేలు జరుగుతుంది. -
ధాన్యం కొనుగోలుకు 617 కేంద్రాలు
కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య కరీంనగర్, న్యూస్‌లైన్ : రబీలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు జిల్లాలో 617 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ సీజన్లో జిల్లాలో 13.41మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేశామని అన్నారు. అందులో సుమారు 5లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ సంస్థలతో కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 311 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, 303 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, 3 గిరిజన కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీబ్యాగ్‌లు, అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. జిల్లాలోని ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైస్‌మిల్లర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని రవాణా చేసేందుకు 262 రైస్ మిల్లులను ఎంపిక చేసి అనుసంధానం చేసినట్లు చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించకుండా ధాన్యం కొనుగోలు చే సే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జిల్లా సరఫరా అధికారి చంద్రప్రకాశ్, డెప్యూటీ రవాణా అధికారి మీరాప్రసాద్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.