మక్క రైతుకు మద్దతేది?
నా పేరు చంద్రగిరి రాజయ్య. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం దుబ్యాల గ్రామం. ముప్పై క్వింటాళ్ల మక్కలు మార్కెట్‌కు తీసుకవచ్చిన. తేమ చూసి తక్కువ ధర పెట్టిండ్రు. క్వింటాల్‌కు రూ.960 చొప్పున కొన్నరు. సర్కారు మద్దతు ధర వస్తుందని పక్క జిల్లా నుంచి వస్తే.. నిలువున దోచుకునేందుకు సిద్ధమైండ్రు. ధర పలికితేనే మక్కలు ఇస్తనని చెప్పిన. అడ్తిదారులు ఇంకో మాటే మాట్లాడలేదు. మంగళవారం మార్క్‌ఫెడ్ వాళ్లు కాంట పెడ్తరట. వాళ్లైనా మద్దతు ధర పెడ్తరని ఎదురుచూస్తున్న. - జమ్మికుంట
కరీంనగర్ అగ్రికల్చర్:
జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ప్రణాళిక గాడి తప్పింది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సిన మార్క్‌ఫెడ్ యంత్రాంగం నిరక్ష్యం చేసింది. ఫలితంగా మక్క రైతులకు సర్కారు ‘మద్దతు’ దక్కకుండా పోతోంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1310 ఉండగా, వ్యాపారులు రూ.900 నుంచి రూ.1080 మాత్రమే చెల్లిస్తున్నారు. తేమ, నాణ్యత సాకుతో మక్క రైతులను నిండా ముంచుతున్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జోక్యంతో ఎట్టకేలకు మార్క్‌ఫెడ్ అధికారులు కదిలారు. జమ్మికుంట, హుజూరాబాద్ మార్కెట్లలో మంగళవారం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చారు. జిల్లావ్యాప్తంగా 25 మార్కెట్ యార్డులున్నాయి. యార్డు సౌకర్యం లేని మేడిపల్లి, కథలాపూర్, పోత్గల్, కాటారం, మల్లాపూర్ మినహా మార్కెట్లు మినహా 20 యూర్డుల్లో మక్కల కొనుగోలుకు ప్రణాళిక రూపొందించారు.
అయితే దశలవారీగా మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తుల ఆధారంగా కేంద్రాలను పెంచేందుకు యోచిస్తున్నారు. గతేడాది జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మార్కెట్లలో మొదటి దశలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి కూడా మొదటి దశలో ఇవే మార్కెట్లలో కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం జమ్మికుంట, హుజూరాబాద్ మార్కెట్లలో కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు.
తొలకరి ప్రారంభ దశలో విత్తనాలు వేసుకున్న రైతులు ప్రస్తుతం మక్కల నూర్పిళ్లు చేసేస్తున్నారు. ఈసారి వర్షాలు ఆలస్యంగా కురవడంతో దిగుబడులు కూడా కొంత ఆలస్యంగానే వస్తాయనుకుని కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తున్నట్టు మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. కానీ.. నేలల ప్రభావం వల్ల కొన్ని చోట్ల ఇప్పటికే దిగుబడులు చేతికొచ్చాయి.
మరో వారం రోజుల్లో కుప్పలు తెప్పలుగా మార్కెట్‌కు వచ్చే అవకాశముంది. కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరుచుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వారు ధర అమాంతం తగ్గించి నిలువునా దోచుకుంటున్నారు. మొక్కజొన్నకు కేంద్రప్రభుత్వం రూ.1310 మద్దతు ధర ప్రకటించింది. దళారులు ఇప్పటికే విక్రయానికి వస్తున్న మక్కలకు రూ.900 నుంచి రూ.1000 వరకు కొనుగోలు చేసి రైతులను దగా చేస్తున్నారు.
సోమవారం కరీంనగర్ మార్కెట్ యార్డుకు 56 క్వింటాళ్ల మక్కలు వచ్చారుు. వ్యాపారులు రూ.1001 నుంచి రూ.1085 మాత్ర మే చెల్లించారు. జమ్మికుంట మార్కెట్‌లో 335 క్వింటాళ్ల మక్కలు కొన్నారు. అక్కడ రూ.900 నుంచి రూ.1000 మాత్రమే ధర నిర్ణరుుంచారు. ఒక్కో క్వింటాలుకు రూ.300 నుంచి రూ.400 దాకా కోతపెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మార్కెట్లలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తేనే.. దళారుల నుంచి విముక్తి లభిస్తుందని రైతులు అంటున్నారు.
సమయానికి వర్షాలు కురవకపోవడంతో దిగుబడిలో నాణ్యత కొరవడే అవకాశముంది. గింజలు రంగుమారటం, పరిమాణంలో చిన్నగా ఉండడం తదితర సమస్యలు తలెత్తే అవకాశముంది. ప్రభుత్వం దిగుబడిలో 40 శాతం మేరకే కొనుగోలు చేసేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. నాణ్యత లేని దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో ప్రభుత్వరంగ సంస్థలు కొనుగోలు చేస్తేనే మేలు జరుగుతుంది.