మృత్యుఘోష
ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంట కళ్లముందే ఎండిపోతోంది. కరుణించాల్సిన వరుణుడు కనికరం చూపడం లేదు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తడిసిమోపడవుతున్నాయి...ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న రైతన్న పురుగుల మందే చివరివిందుగా చేసుకుని తనువు చాలిస్తున్నాడు. కుటుంబాలను ఒంటరిచేసి వెళ్లిపోతున్నాడు. తాజాగా గురువారం ఒక్కరోజే జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇరువురు రైతన్నలు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, తీవ్ర ఆందోళనతో గుండెపోటుకు గురై మరో అన్నదాత నేలకూలాడు.
జగదేవ్‌పూర్ : అప్పులబాధలు తాళలేక ఓ రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని చేబర్తి పంచాయతీ నర్సన్నపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బుకల కొండయ్య (28), స్వప్న అనే దంపతులు తమకున్న మూడెకరాలలో పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేసేవారు. అయితే ప్రతి ఏటా వ్యవసాయంలో నష్టపోతూ వస్తున్నారు. ఈసారి కూడా పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశాడు. ఈ నేపథ్యం లో పంటల పెట్టుబడులు, కుటుంబ పోషణకు సుమారు రూ. 3 లక్షల మేర అప్పులు చేశాడు.
అయితే పంట లు చేతికందక అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం వారం రోజులుగా దిగాలుగా ఉన్నాడు. అయితే బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అయితే విషయాన్ని గమనించిన కొం డయ్య తల్లి స్థానికుల సాయంతో గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భా ర్య స్వప్న, ఇద్దరు కుమార్తులు ఉన్నా రు. ఈ మేరకు ఎస్‌ఐ వీరన్న కేసును దర్యాప్తు చేస్తున్నారు. కొండయ్య మృతితో నర్సన్నపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నాయకుల పరామర్శ : నర్సన్నపేట గ్రామంలో అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కొండయ్య కుటుంబ సభ్యులను గురువారం సాయంత్రం టీడీపీ గజ్వేల్ ఇన్‌చార్జ్ బుర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎల్లు రాంరెడ్డి, జెడ్పీటీసీ రాంచంద్రం, చేబర్తి సర్పంచ్ జమునాబాయి, నాయకులు భూమయ్యయాదవ్, ఇంద్రసేనారెడ్డి, బుద్ద చిన్న సత్యం, శ్రీకాంత్, ఎర్రవల్లి ఎంపీటీసీ భాగ్యమ్మ, శ్రీనివాస్‌రెడ్డిలు, శరత్‌లు పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బుర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో 57 రైతు ఆత్మహత్యలు జరిగినట్లు చెప్పారు. జగదేవ్‌పూర్ మండలంలో ఇప్పటికి వరకు ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నా రు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఒక్క కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.