న్యూస్‌లైన్ నెట్‌వర్క్: రైతు ఆత్మహత్యల పరంపర శుక్రవారం కూడా కొనసాగింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఒక్కరోజే ఏడుగురు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధతో మహబూబ్‌నగర్ జిల్లాలో ముగ్గురు... మెదక్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పోశమ్మగడ్డ తండాకు చెందిన వడ్యావత్ లచ్చిరాంనాయక్ (50) తనకున్న నాలుగెకరాల్లో అప్పు చేసి వేసిన పత్తిపంట తీవ్ర వర్షాభావంతో ఎండిపోయింది. దీంతో గతేడాది అప్పుతో కలసి మొత్తం రూ. 4లక్షల అప్పు ఎలా తీర్చాలని మనస్థాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కొడంగల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన దోమ ఆశప్ప (30) పదెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. పంటలు వేయడానికి రూ.70 వేలు అప్పు చేశాడు. ఖరీఫ్ సీజన్‌లో వేసిన కంది, పత్తి పంట కొంతభాగం ఎండిపోయింది. దీంతో మనస్తాపం చెంది శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వంగూరు మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన రైతు మేకల పర్వత్‌రెడ్డి తనకున్న నాలుగెకరాల పొలంలో పత్తిపంట సాగుచేశాడు. ఇందుకోసం ప్రైవేటుగా రూ.లక్షా 70 వేలు, రూ.30 వేలు బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. వర్షాభావ పరిస్థితులవల్ల పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో పొలంలోనే ఉరేసుకున్నాడు. అలాగే, మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడికి చెందిన లక్ష్మణ్(23) ఇటీవల సోదరి వివాహం కోసం కొంత అప్పు చేశాడు. ఉన్న ఎకరా పొలంలో మూడు బోర్లు వేసినా నీరు రాలేదు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో లక్ష్మణ్ దుబాయి వెళ్లి సంపాదించిన డబ్బుతో అప్పు తీర్చాలని భావించాడు. దుబాయి వెళడానికి సిద్ధమవుతుండగా అప్పుల వాళ్లు డబ్బులు చెల్లించాకే వెళ్లాలంటూ అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెంది ఉరేసుకొని మృతి చెందాడు.
నల్లగొండ జిల్లా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన గుండెపురి విజయకృష్ణ (32) మూడేళ్లుగా మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తిసాగు చేస్తున్నాడు. అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టాడు. దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడంతో శుక్రవారం పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం దొనబండకు చెందిన కౌలు రైతు బానోత్ గోరియా (30) పురుగుల మందుతాగి అత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం అనుకూలించక అతడికి రూ. 2 లక్షల వరకు అప్పు అరుుంది. రంగారెడ్డి జిల్లా యా లాల మండలం ఎనికెపల్లికి చెందిన బండు కాశప్ప(40) ఆరు నెలల క్రితం అత్తగారి ఊరు బషీరాబాద్ మండలం జీవన్గికి వలస వచ్చాడు. అక్కడ ఐదెకరాలు కౌలుకు తీసుకుని పంట సాగు చేశాడు. ఇటీవల పంటకు ఎండు తెగులు సోకి ఎండిపోయింది. దీంతో పంటసాగు కోసం చేసిన రూ. 1.5 అప్పు ఎలా తీర్చాలో తెలియక గురువారం రాత్రి పురుగులమందు తాగాడు. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.