- విడుతల వారిగా మార్కెట్‌ను అభివృద్ధి చేస్తాం
- జిల్లా కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
- ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్: వ్యవసాయ రైతుల సంక్షేమ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందనీ.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక మార్కెట్‌యార్డులో సింగిల్‌విండో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ఏడ్చిన రాష్ట్రం అభివృద్ధి చెందదని, రైతులు సంతోషిస్తే రాష్ట్రాలు బాగుపడుతాయన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.35200కోట్లు కేటాయించి ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకున్నారని ఆయన కొనియాడారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఇక జిల్లా సస్యశ్యామలం కానుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రానున్న రెండేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా రైతులు అష్టకష్టలు పడి పండించిన ధాన్యం తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకుండా ఉండేందుకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి సాధ్యమైనంత త్వరగా రైతులకు డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. మార్కెట్‌యార్డులలో దళారి వ్యవస్థను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాట్లు ఆయన తెలిపారు. అనంతరం మార్కెట్‌యార్డు ఆవరణలో ఉన్న మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించారు. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కార్యదర్శి అనంతయ్యకు సూచించారు. అనంతరం తానుకూడా ఓ రైతునని, పంట పొలాల వద్ద నీరు పెట్టడం, నాగళితో దున్నడం వంటి వ్యవసాయపనులన్నింటిని చేశానని తన చిన్ననాటి ఙ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చెర్మైన్ కే.వెంకటయ్య, మార్కెట్ కార్యదర్శులు అనంతయ్య, నవీన్, టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాజేశ్వర్‌గౌడ్, రామకృష్ణ, చందుయాదవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
'రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'
Published Wed, Oct 28 2015 5:50 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement