ఖమ్మం, న్యూస్‌లైన్: మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపం చూపించాడు... ఎండవేడిమికి జనం అల్లాడారు...అంతలోనే ఆకాశంలో మబ్బులు ఆవరించాయి... మధ్యాహ్నం నుంచి రాత్రి వర కు భారీవర్షం కురిసింది. ఇలా జిల్లాలో శుక్రవా రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కుండపోత కురియగా... పలుచోట్ల పిడుగులు పడ్డాయి. అకాలవర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మిర్చి, మొక్కజొన్న పంటలు తడిసి పోయాయి. విక్రయించేందుకు వ్యవసాయ మార్కెట్‌లకు, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన పంటఉత్పత్తులు తడిసి ముద్ద అయ్యాయి. పిడుగుపాటు కారణంగా పినపాక మండలంలో ఓ మహిళ మృతిచెందగా, ఇల్లెందు మండలం లో 32 మేకలు చనిపోయాయి. గాలి దుమారం తో పలుచోట్ల లైన్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో డ్రైన్లు పొంగి పొర్లడంతో రోడ్లపైకి, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం మూలంగా జిల్లాలో సుమారు రూ. 30కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రైతులు సంఘాల నాయకులు చెబుతుండగా.. అసలు నష్టమే జరగలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడం గమనార్హం.
భారీవర్షంతో... ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు తెచ్చిన మిర్చి, పత్తి, మొక్కజొన్న ఉత్పత్తులు తడిసి పోయాయి. నగరంలో డ్రైన్లు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపైకి రావడంతో రోడ్లు జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాలనీల్లో నీరు నిలిచిపోయి ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రఘునాధపాలెం మండలంలో వీవీపాలెం, రఘునాథపాలెం, చింతగుర్తి, వేపకుంట్ల, గణేశ్వరం, మల్లేపల్లి, ఈర్లపుడి, రాంక్యాతండా, పంగిడి, మంచుకొండ, బూడిదంపాడు, చిమ్మపుడి, కోటపాడు ప్రాంతాల్లో మిర్చి, ధాన్యం తడిసిపోయాయి. మామిడి కాయలు నేలరాలాయి. కూరగాల పంటలు దెబ్బతిన్నాయి.
ఇల్లెందు నియోజకవర్గంలో వరి చేతికొచ్చే దశలో భారీవర్షం కురవడంతో తీవ్రనష్టం వాటిల్లింది. మామిడి నేలరాలింది. కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. మాణిక్యారం గ్రామానికి చెందిన సూర్నపాక వీరభద్రం మేకల గుంపు మీద పిడుగు పడగా 32 మేకలు అక్కడిక్కడే మృతి చెందాయి. సుమారు రూ. 1.50 ల క్షలు నష్టం వాటిల్లింది. బయ్యారం మండలంలో 500 హెక్టార్లలో వరికి నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. వెంకట్యాతండాలో ఇంటి గోడ కూలి రెండు గొర్రె పొట్టేళ్లు మృతి చెందాయి. టేకులగుంపులో పిడుగు పడి దుక్కిటెద్దు మృతి చెందింది.
మధిర నియోజకవర్గంలోని బోనకల్, చింతకాని మండలాల్లో గంటపాటు వర్షం కురిసింది. కల్లాల్లో ఉన్నమిర్చి, ధాన్యం, మొక్కజొన్న పంటలు తడిశాయి. ముష్టికుంట్ల, బోనకల్, ఆళ్లపాడు, మోటమర్రి గ్రామాల్లో ఈ నష్టం ఎక్కువగా ఉంది. ముదిగొండ మండలంలోని మాధాపురం, ఎడవల్లి, మేడేపల్లి, కమలాపురం తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. ఈవర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. రైతులు ఉరుకులు పరుగులతో మొక్కజొన్నలపై పట్టాలు కప్పారు. ముదిగొండ, వెంకటాపురం, గోకినేపల్లి, చిరుమర్రి గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. వర్షపునీటితో వీధులన్నీ జలమయ్యాయి.
పినపాక మండలంలో పిడుగుపాటుకు చిరుమల్ల గ్రామంలో ఈసం సుజాత(35)అనే మహిళ మృతి చెందినది. బూర్గంపాడు మండలంలోని 200ల ఏకరాల్లో మామిడి నేలరాలింది. 50ఎకరాల్లో వరిపంట తడిసింది. అదే విధంగా మార్కెట్ గోడౌన్‌కు తీసుకువచ్చిన ధాన్యం సైతం తడిసిపోయింది. అశ్వాపురం మండలంలో కురిసిన వర్షం, గాలి దుమారానికి 50ఎకరాల వరిపంట నేలకొరిగింది. మణుగూరు మండలంలో సాంబాయిగూడెం, రామానుజవరంలో కోసిన పనలు తడిసినాయి.
పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు, సుబ్లేడు, పాతర్లపాడు తదితర గ్రామాలలో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటి ల్లింది. వెదుళ్లచెరువు, కొక్కిరేణి గ్రామాలలో కల్లాల్లో ఆరబోసిన పసుపు పంట కూడా తడిసి తీవ్ర నష్టం వాటిల్లింది. నేలకొండపల్లి, కూసుమంచి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, ఖమ్మం రూరల్ మండలంలోని తీర్ధాల, ముత్తగూడెం, కొత్తూరు, ఏదులాపురం, గోళ్లపాడు తదితర గ్రామాలలో కల్లాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి తీవ్ర నష్టం వాటిల్లింది.
సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న కంకులు వర్షానికి తడవడం, మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేంసూరు మండలంలో శుక్రవారం వీచిన గాలులతో మామిడి కాయలు రాలిపోయాయి. పెనుబల్లి మండలంలో రబీ వరి పంట మూడు వేల ఎకరాలలో ఇంకా కోతలు పూర్తి కాకపోవటంతో నేలవాలింది. మిషన్లతో కోతలు కోసి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిపోయింది. తల్లాడ మండలంలో కల్లాల్లో కాటా వేసిన ధాన్యం తడిసింది.
వైరా నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా వైరా మండలంలో కోతకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. ధాన్యం పొలాల్లో తడిసిపోయింది. కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ఏఎంసీ ప్రాంగణంలో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యం 200 క్వింటాళ్ళు తడిసి పోయాయి. కొణిజర్ల మండలంలో వరి 600 ఎకరాల్లో కోయాల్సి ఉండగా పూర్తిగా వరి పనలు వాలిపోయాయి. మరో 600 ఎకరాలల్లో ధాన్యం తడిసిపోయింది. మిర్చి కూడా కల్లాల్లో తడిసిపోయింది. ఏన్కూరు మండలంలో మొక్కజొన్న 60 ఎకరాలలో పూర్తిగా తడిసిపోయింది. పత్తి 100 క్వింటాళ్ళు ఏఎంసీలో తడిసిపోయింది. కారేపల్లి మండలంలో మామిడి కాయాలు నేల రాలగా, కల్లాల్లో మిర్చి తడి సిపోయింది.
అశ్వారావుపేట నియోజకవర్గంలో దాదాపు 500 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. చంద్రుగొండ మండలంలో కల్లాల్లోని మిర్చి తడిసి ముద్దయింది.
కొత్తగూడెం నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. వర్షం కారణంగా కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.
కొత్తగూడెం పట్ణణంలో అండర్‌బ్రిడ్జిలో భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది.
భద్రాచలం డివిజన్‌లోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో భారీ వర్షం కురిసింది. వాజేడు మండలంలో కల్లాల్లో ఆరబోసిన 6వేల క్వింటాళ్ల మిర్చి, 500 క్వింటాళ్ల వరి ధాన్యం వర్షార్పణం అయింది. దుమ్ముగూడెం మండలంలో సున్నంబట్టి, బైరాగుల పాడు, బండిరేవు గ్రామాలలో కోసివుంచిన వరిపనలు వర్షానికి తడిసిముద్దయ్యాయి.
వేసవిలో కుండపోత
Published Sat, May 10 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement