సాక్షి, హైదరాబాద్: ఆఫ్రికన్ దేశాల్లో మొక్కజొన్నను నాశనం చేసిన ఫాల్ ఆర్మీ వామ్–స్పొడోప్తెరా ఫ్రూగిపెర్దా అనే పురుగు ఇప్పుడు మన దేశంలోని పంటలపై దాడి చేస్తోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ పురుగు ఇటీవల కర్ణాటక శివమొగ్గ ప్రాంతంలోని మొక్కజొన్న పంటలో గుర్తించారు. పంటను అమాంతం నాశనం చేసే ఈ పురుగు విషయంలో అప్రమత్తం కావాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను, జిల్లా వ్యవసాయాధికారులను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ఆదేశించారు. ఆఫ్రికన్ దేశాల నుంచి ఇతర దేశాలకు ఇది విస్తరిస్తుందని ఆయన వివరించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిందన్నారు. కర్ణాటక పక్కనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉండటంతో ఈ పురుగు ప్రభావం ఎలా ఉంటుందనే భయం అందరినీ కలవరపరుస్తోంది. ఈ పురుగు సోకితే పంటపై ఆశలు వదిలేసుకోవాల్సిందే.
రాష్ట్రంలో 10.78 లక్షల ఎకరాల్లో సాగు...
రాష్ట్రంలో ఖరీఫ్‌లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.78 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్ర ఆహారధాన్యాల పంటల్లో వరి తర్వాత అత్యంత కీలకమైన పంట మొక్కజొన్న కావడంతో రైతులు దీనిపై అధికంగా ఆశలు పెంచుకుంటారు. ఆసియాలోనే తొలిసారిగా గత నెలలో కర్ణాటకలో ఈ పురుగును గుర్తించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment