మంత్రి వర్సెస్‌ ఎంపీ | Penukonda TDP Leaders B K Parthasarathi VS Savitha | Sakshi
Sakshi News home page

మంత్రి వర్సెస్‌ ఎంపీ

Published Wed, Oct 9 2024 1:26 PM | Last Updated on Wed, Oct 9 2024 1:27 PM

Penukonda TDP Leaders B K Parthasarathi VS Savitha

పెనుకొండలో తారస్థాయికి వర్గపోరు 

ఆధిపత్యం కోసం మంత్రి ప్రయత్నాలు 

పట్టు నిలుపుకునేందుకు బీకే వ్యూహాలు  

పెనుకొండ: మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి మధ్య వర్గపోరు తీవ్ర రూపం దాల్చుతోంది.    సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే ప్రారంభమైన ఈ వర్గపోరు ప్రస్తుతం ముదిరి పాకాన పడుతోంది. పెనుకొండ నియోజకవర్గంలో అన్నింటా ఆధిపత్యం చాటుకోవాలని మంత్రి ప్రయత్నిస్తుండగా.. పట్టు నిలుపుకోవాలని బీకే వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కేడర్‌ రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఇదివరకే ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడిగానూ ఉన్న బీకే పార్థసారథిని కాదని సవిత ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకుని గెలిచారు. 

మంత్రి పదవినీ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. చౌక దుకాణాల డీలర్‌íÙప్పులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు, వివిధ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, పోలీసుస్టేషన్లో పంచాయితీలు ..ఇలా ప్రతి దాంట్లోనూ తన వర్గీయులకే పెద్దపీట వేస్తున్నారు. చివరకు ఉద్యోగుల బదిలీల్లోనూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు. ప్రస్తుతం మద్యం షాపుల టెండర్లలో సైతం ఎంపీ వర్గీయులు పాల్గొనకూడదంటూ మంత్రి వర్గీయులు అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం పెనుకొండ ఎక్సైజ్‌ కార్యాలయం వద్ద ఘర్షణ వాతావరణ తలెత్తింది. 

పట్టు కోసం బీకే ప్రయత్నాలు 
అన్నింటా తన పెత్తనమే సాగేలా మంత్రి సవిత వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ బీకేతో పాటు ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో ఎలాగైనా తన పట్టు నిలుపుకోవాలని బీకే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం టెండర్లలో తన వర్గీయులను మంత్రి అనుచరులు అడ్డుకోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన.. పెనుకొండలోని తన స్వగృహంలో మకాం వేసి పోలీస్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి తన వర్గీయులూ దరఖాస్తులు వేసేలా చొరవ తీసుకున్నారు. అన్ని షాపులూ తమకే దక్కుతాయని అప్పటి వరకు సంతోషంగా ఉన్న మంత్రి వర్గీయులు.. పోలీసుల సహకారంతో బీకే వర్గీయులు కూడా పోటీగా దరఖాస్తులు వేయడంతో కంగుతిన్నారు. ఈ వ్యవహారం మద్యం షాపులు కేటాయించేనాటికి ఎటు వెళుతుందోనని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.  

సామాజిక వర్గాలపై  కన్ను 
హిందూపురం ఎంపీగా గెలిచినప్పటికీ సొంత ఇలాకా పెనుకొండలో తన మార్కు రాజకీయం కొనసాగించడానికి  బీకే పార్థసారథి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపీ ల్యాడ్స్‌ నిధులనే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి  పనులు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. అలాగే బలమైన సామాజిక వర్గాల వారికి అవసరమైన పనులు చేసిపెట్టి.. వారి అండ కోసమూ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పరిగిలో వాల్మీకి కల్యాణ మండపానికి రూ. కోటి, సోమందేపల్లిలో ఉప్పర (సగర) కులస్తుల కల్యాణ మండపానికి రూ.కోటి మంజూరు చేయించినట్లు చర్చ సాగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి సవిత అనుచరులు సోమందేపల్లిలో స్థల వివాదం ముందుకు తీసుకురావడంతో శంకుస్థాపన ఆగిపోయింది. అనంతరం సగర కులస్తులు ఎంపీని కలసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది.   

నోరు మెదపని పార్టీ పెద్దలు 
పెనుకొండ నియోజకవర్గంలో ఎంపీ బీకే, మంత్రి సవిత మధ్య వర్గ పోరు విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఇతర ముఖ్య నేతల దృష్టికి వెళ్లినా ఎవరూ నోరు మెదపడం లేదన్న చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది. అయితే..ఇక్కడి పరిణామాలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.    

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement