చింత తీర్చేది చిరుధాన్యాలే! | To cater to the worries of millets | Sakshi
Sakshi News home page

చింత తీర్చేది చిరుధాన్యాలే!

Published Wed, Jan 14 2015 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

చింత తీర్చేది చిరుధాన్యాలే!

చింత తీర్చేది చిరుధాన్యాలే!

జొన్న రొట్టె, సజ్జ మలీద, రాగి సంకటి... ఇవన్నీ తెలంగాణ ఆహార వ్యవస్థ నుంచి విడదీయలేని వంటలు. పెళ్లిళ్లలో జొన్న తలంబ్రాలు.. మన చేలల్లో జొన్న పంటలు. సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, దేశీ మక్కలు(మొక్కజొన్నలు) ఇవ న్నీ తెలంగాణ వైశిష్ట్యాలు. తెలంగాణ మెట్ట భూముల దిక్కు చూస్తే 60 నుంచి 70 శాతం వరకూ ఈ చిరుధాన్యాలనే సాగు చేసేవారు. అయితే, ఎప్పుడైతే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో బియ్యాన్ని చేర్చారో అప్పటి నుంచి చిరుధాన్యాల సంస్కృతి కనుమరుగవుతున్నది.
 కిలో బియ్యం రూ. 2కు, రూ.1కు, ఉచితంగా ఇవ్వటంతో జొన్నలు, సజ్జలు, కొర్రలు తినేటి జనం ఆహార భ్రష్టులై బియ్యానికి బానిసలయ్యారు. ఇప్పుడు బియ్యం కబంధ హస్తాలు తెలంగాణ జనాన్ని సంపూర్ణంగా తమ అధీనంలోకి తీసుకున్నాయి. కిలో రూ.2కే బియ్యం ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే మెదక్ జిల్లాలో చిరుధాన్యాలు పండే లక్ష హెక్టార్ల భూమిని రైతులు బీళ్లుగా వదిలేశారు. అప్పటి నుంచి సంప్రదాయక ఆహార పద్ధతుల పతనం ప్రారంభమైంది. క్రమంగా చిరుధాన్యాలనేవి మాయమయ్యే పరిస్థితి వచ్చింది.

మధుమేహం, రక్తపోటు బియ్యం పుణ్యమే

పీడీఎస్ ద్వారా ప్రభుత్వం బియ్యం సరఫరా చేసిన ప్రభావం కేవలం సాగు భూములపైనే కాక ప్రజల ఆరోగ్యం, ప్రత్యేకించి పిల్లల పౌష్టికత మీద తీవ్ర ప్రభావం చూపింది. బియ్యం వాడకంతో పోషకాల కొరత ఏర్పడి ప్రజలు మధుమేహం, రక్తపోటు సహా పలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒకే రకమైన ఆహార పదార్థాలను పదేపదే తినటం ద్వారా పోషకాల సమతుల్యత దెబ్బతింటోంది. ప్రజల ఆహారపు అలవాట్లకు స్కూల్, హాస్టల్, అంగన్‌వాడీ భోజనాలు గండి కొట్టాయి. వీటన్నింటా పిల్లల ఆహారంలో వరి బియ్యం తప్ప మరే ఆహారానికి చోటు లేదు. జొన్నరొట్టె, రాగి సంకటి, కొర్ర బువ్వను తిన్న పేద పిల్లలు సైతం బలంగా ఎదిగేవారు. చిరుధాన్యాలలో పిల్లల ఎదుగుదల, ఆరోగ్యానికి అవసరమైన ఇనుము, సున్నం, కాల్షియం, బీటాకెరోటిన్, నియాసిన్, ఇతర సూక్ష్మ పోషకాలు దండిగా ఉన్నాయి. పిల్లల పెరుగుదలకు, ఆరోగ్యానికి, వాళ్ల శరీరంలో శక్తి నింపడానికి చాలా అవసరమైనవి ఈ పోషకాలు. బియ్యంలో వీటి కొరత చాలా ఎక్కువ. కానీ, ఈ పరిస్థితుల్లో కార్డుల మీద 6 కిలోల చొప్పున, హాస్టళ్లకు సన్న బియ్యం ఇవ్వాలన్న నిర్ణయంప్రజల ఆరోగ్యానికి మేలు చేయబోదనే విషయం ప్రభుత్వం గుర్తించాలి. చిరుధాన్యాలను ఆహారంగా అందిస్తే పోషక లోపాన్ని సవరించటం సాధ్యమవుతుంది. తద్వారా వీటి సాగు పెరుగుతుంది.

కరువు కాలానికి తగిన పంటలు

తెలంగాణలో సాగునీటి కొరత చాలా ఎక్కువ. ఈ సమస్యకు సరైన సమాధానం సాగు నీరు అవసరం లేని పంటలైన చిరుధాన్యాలు పండించడమే. పోయిన దశాబ్దం కరువు దశాబ్దంగా గడిచింది. వాతావరణ మార్పు వల్ల రాబోయే కాలంలో నీటి కొరత ఇంకా తీవ్రమవుతుంది. ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశాలున్నాయి. వీటితోనే అపౌష్టికత కూడా పెద్ద సమస్యవుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కొత్త సేద్య ప్రణాళికను రూపొందించుకోకుండా.. వరి, చెరకు సాగును ప్రోత్సహిస్తూ ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టిపెడుతూ ఉంటే భవిష్యత్తులో దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో మనం చిరుధాన్యాల గురించి ఇంకోసారి ఆలోచించాలి.
 తెలంగాణను చిరుధాన్యాల రాష్ట్రంగా ప్రకటించాలి. చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రోత్సహించాలి. అప్పుడే మనం ఒక కొత్త రాష్ట్రంలో భవిష్యత్తు గురించి సవ్యంగా ఆలోచిస్తున్నామని చెప్పుకోగలం. వాతావరణ మార్పుల నేపథ్యంలో వరి, గోధుమ సాగు మరింతగా సమస్యల మయం కాబోతున్నందున దేశ ఆహార భద్రత ప్రమాదంలో చిక్కుకోనుంది. ఈ తరుణంలో మనకు అండగా నిలిచేది చిరుధాన్యాలే. ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా ఒక చిరుధాన్యాల రాష్ట్రం అయితే.. ఈ దేశపు ఆహార భద్రతను కాపాడిన రాష్ట్రంగా మనం భవిష్యత్తులో ఒక స్థానాన్ని పొందగలుగుతాం.

 (వ్యాసకర్త డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ డెరైక్టర్)
 satheeshperiyapatna@gmail.com
 
 
 
చిరుధాన్యాలకు సారవంతమైన భూములు అవసరం లేదు. సారం అంతగా లేని భూముల్లో కూడా ఇవి పెరుగుతాయి.వర్షాధార పంటలైన చిరుధాన్యాలకు నీటి తడులు పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ వర్షాలు కురిసినా మంచి దిగుబడులొస్తాయి. చిరుధాన్యాలు పోషకాల భాండాగారాలు. పౌష్టికాహార లోపాన్ని జయించడానికి ఇవి ఆధారంగా నిలుస్తాయి.
 
అధిక సాగు నీరు అవసరమయ్యే వరి, గోధుమ సాగులో సమస్యలు జటిలమవుతున్న నేపథ్యంలో తెలంగాణను చిరుధాన్యాల సాగు ప్రధాన రాష్ట్రంగా ప్రకటించడం మేలన్న డిమాండ్ ముందుకొస్తోంది. కరువు కాలంలోనూ ప్రజలకు పౌష్టికాహారాన్ని, ఆహార భద్రతను అందించగలిగేది చిరుధాన్యాలేనన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించాలంటున్నారు పీ వీ సతీష్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement