కండెదశలో గండం !
చివరి దశలోను మొక్కజొన్న రైతులకు సాగునీటి కష్టాలు తప్పటం లేదు. ఆయకట్టు భూముల్లో సాగుచేసిన మొక్కజొన్న పంటకు నీటిని అందించడం రైతులకు కత్తిమీద సాములా మారింది. నగరం మండలంలోని పలు గ్రామాల్లో ఈ రబీ సీజన్‌లో సుమారు 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేపట్టారు. సాగు చేసి 60 నుంచి 70 రోజులు కావటంతో ప్రస్తుతం పంట కండెదశలో ఉంది. ఈ తరుణంలో పంటకు నీటిని అందించి ఎరువులు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
పంట కాలువల్లో అరకొరగా ఉన్న నీటిని పొలాలకు మళ్లించేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా చివరి భూములకు నీటి తడులు అందించేందుకు రైతులు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నారు. కాలువలపై డీజిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసి ట్యూబ్‌ల సాయంతో నీటిని పంపుతున్నారు. ఈ క్రమంలో నీటి తడులకు ఎకరాకు రూ.1500 నుంచి రూ. 2000లకు పైగా అదనపు ఖర్చును భరించాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లోని చివరి భూముల్లో వేసిన మొక్కజొన్న నీటి తడులు అందక ఎండిపోతోంది. బోరుల్లో కూడా నీరు అందకపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
నీరు అందక ఎండుతున్న పంటను చూసి రైతులు కంటతడిపెడుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటను రక్షించుకునేందుకు బోరులు వేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. మొక్కజొన్న పంట చేతికొచ్చే తరుణంలో సాగునీటి సమస్య ఉత్పన్నం కావడంతో ఆ ప్రభావం దిగుబడులపై పడనుందని ఆందోళన చెందుతున్నారు.నీటి వసతి కలిగిన రైతులు అదనపు ఖర్చుకు వెనుకాడక పంటను రక్షించుకుంటున్నారు.