మొక్కజొన్న సాగు.. కొన్ని మెలకువలు
ఖరీఫ్‌లో మొక్కజొన్న పంటను వర్షాధారంగాను, నీటి వసతి కింద కూడా పండించుకోవచ్చు. ఈ పంటను విత్తనాల కోసం, కండెల కోసం, పాప్ కార్న్ కోసం, కూరగాయగా బేబీ కార్న్ రూపంలోనూ పండించుకోవచ్చు.విత్తనం కోసం పండించడానికి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ రీసెర్చ్ హైబ్రిడ్స్‌తోపాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన డీహెచ్‌ఎం 117, డీహెచ్‌ఎం 119, డీహెచ్‌ఎం 121 రకాలు సాగుకు అనుకూలం.వర్షాధారం పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. విత్తనం, భూమిలోని శిలీంద్రం నుంచి తొలిదశ మొక్కలను కాపాడటం కోసం 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా మాంకోజెబ్‌లలో ఏదైనా ఒక మందుతో విత్తన శుద్ధి చేయాలి.
ఎకరాకు 8 కిలోల సంకర రకాల విత్తనాన్ని బోదెలపైన 1/3 వంతు ఎత్తులో విత్తితే వర్షం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి వీలుంటుంది. బోదెకు, బోదెకు మధ్య దూరం 60 సెం. మీ., మొక్క కు, మొక్కకు మధ్య 20 సెం. మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి.పంట విత్తిన తరువాత రెండు, మూడు రోజుల లోపు అట్రజిన్ అనే కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల వెడల్పాటి, కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలను దాదాపు ఒక నెల వరకు అదుపు చేయవచ్చు.సంకర రకాలలో మంచి దిగుబడి కోసం ఎకరానికి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి. 1/3 వ వంతు నత్రజనిని, మొత్తం భాస్వరాన్ని, సగభాగం పొటాష్ ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. మిగిలిన 1/3 వ వంతు నత్రజనిని 30-35 రోజులకు, మరో 1/3వ వంతు 50-55 రోజుల మధ్య వేయాలి. మిగతా 1/2వ వంతు పొటాష్ ఎరువును పూత దశలో వేసుకోవాలి.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్