సాక్షి, హైదరాబాద్: వడగళ్ల వానలు రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం కలిగించాయి. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో టమాటా, బీరకాయ, మొక్కజొన్న, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుములు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల పొట్టదశకు వచ్చిన వరి నేలవాలింది. మామిడి పిందెలు, కాయలు రాలి తీవ్ర నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు.
ఆరు జిల్లాల్లో ప్రభావం..
అకాల వర్షాలతో ప్రధానంగా ఆరు జిల్లాల్లో పంటలపై ప్రభావం పడింది. సుమా రు 50 మండలాల్లోని 650 గ్రామాల్లో నష్టం జరిగిందని.. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో నష్టం తీవ్రంగా ఉందని అధికారులు చెప్తున్నారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్, మర్పల్లి మండలాల్లో అయితే పంట పొలాలన్నీ వడగళ్లతో నిండిపోయి మంచు ప్రాంతంలా మారిపోయాయి. ఆ పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. దీనితోపాటు సంగారెడ్డి, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ పలుచోట్ల వడగళ్లతో పంటలు దెబ్బతిన్నాయి.
నేడు మంత్రి పర్యటన
వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని.. శుక్రవారం రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలసి నష్టాన్ని పరిశీలిస్తానని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి, గులాబీ, ఉల్లి, బొప్పాయితోపాటు మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్టు తెలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment