ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నెట్‌వర్క్ : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఏర్పడిన అల్పపీడనంతోపాటు దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సోమవారం మరింత తీవ్రంగా మారొచ్చని పేర్కొంది. అలాగే ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, పరిసర ప్రాంతాల్లోనూ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, వాటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. ప్రధానంగా ఆదిలాబాద్, కొమురంభీం, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లోనూ అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురవొచ్చన్నారు.
మరోవైపు రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్‌లో అత్యధికంగా 15 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. అలాగే గార్లలో 13, బయ్యారం, డోర్నకల్‌లలో 12, చెన్నారావుపేటలో 11, ఖానాపూర్‌లో 10, గూడూరులో 9, ఏన్కూరు, జూలూరుపాడులలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. జిల్లాల్లో మోస్తరు వర్షాలు: అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం పలు జిల్లాల్లో జోరుగా వానలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఖమ్మం జిల్లా కారేపల్లిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం వరద నీటిలో చిక్కుకుంది. నాలుగు అడుగుల లోతులో వరద నీరు పాఠశాలను చుట్టుముట్టడంతో గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న తరగతి గదులు, వంట శాల, డైనింగ్ రూమ్ నీటితో నిండిపోయాయి. దీంతో విద్యార్థులు పైఅంతస్తులోకి పరుగులు తీశారు. విద్యార్థుల తల్లిదండ్రులు వస్తే సురక్షితంగా ఇళ్లకు పంపించాలని, మిగిలిన వారిని సమీపంలోని మోడల్ స్కూల్ వసతి గృహానికి తరలించాలని కలెక్టర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం సమీపంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
భద్రాద్రి జిల్లాలో సుమారు 1,000 హెక్టార్లలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. అశ్వారావుపేటలోని పెద్దవాగు పొంగి ప్రవహిస్తోంది. మూడు గేట్లు ఎత్తి 34 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో కొత్తూరు గ్రామంలోని 20 ఇళ్లు నీట మునగగా, కొత్తూరు–వేలేరుపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలోని తాలిపేరు, పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టులు సైతం పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి కూరగాయల మార్కెట్ జలమయమైంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనూ రాత్రి 8 గంటల నుంచి 9.30 గంటల వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. కాగా, మహబూబాబాద్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చెరువులు అలుగు పోస్తున్నాయి. జిల్లాలో సుమారు 1,500 చెరువులు ఉండగా, 807 చెరువులు వరదనీటితో నిండి అలుగు పోస్తున్నట్లు అధికారులు తెలిపారు. గూడూరు శివారులోని పాకాలవాగు ఉధృతంగా ప్రవహించడంతో నెక్కొండ, కేసముద్రం మధ్య, కేసముద్రం మండలం అర్పనపల్లి శివారు వట్టివాగు పొంగిపొర్లడంతో గూడూరు, కేసముద్రం, గార్ల, డోర్నకల్ మధ్య బంధంకుంట వాగు ప్రవాహంతో, గార్ల, రాంపురం మధ్య పాకాలవాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment