హైదరాబాద్: కేరళ వరదల్లో తెలంగాణకు చెందిన పీజీ వైద్య విద్యార్ధిని చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ బింగి మౌర్యరాఘవ్ కొట్టాయంలోని గోల్డెన్ జూబ్లీ వైద్య కళాశాలలో ఎండీ కోర్సులో సీటు కోసం శిక్షణ పొందుతోంది. కొట్టాయంలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో మౌర్య తాను అద్దెకు ఉంటున్న ఇంటిలో మూడో అంతస్తులో చిక్కుకుంది. వరదల కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఆమె అక్కడే వేచిచూస్తోంది. విద్యుత్, టెలిఫోన్ సేవలకు అంతరాయం కలగడంతో సమాచార సంబంధాలు తెగిపోయాయి.
కొడమంచిలి కొత్తగూడెం మేదరబస్తీ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోసాధ్యాయురాలిగా పని చేస్తున్న తల్లితో మౌర్య శుక్రవారం మాట్లాడి తన పరిస్థితిని వివరించింది. సన్నిహితుల ద్వారా ఈ సంగతి తెలుసుకున్న ప్రముఖ మిమిక్రీ కళాకారుడు మల్లం రమేశ్, స్వచ్ఛంద సేవకులు గంజి ఈశ్వరలింగం.. త్రివేంద్రం ఇస్రోలో సీనియర్ సైంటిస్టు గంజి వెంకటనారాయణకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. డాక్టర్ వెంకటనారాయణ తనకు తెలిసిన తెలుగు మెడికల్ ప్రొఫెసర్‌కు ఫోన్ చేసి మౌర్య పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేరళ వరదల్లో ఇబ్బందులు పడుతున్న వైద్య విద్యార్ధినిని స్వగ్రామం తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులు, మల్లం రమేశ్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment