అధినేతల అడుగులు   | Sonia Gandhi, Kcr Election Compaign In Rangareddy And Vikarabad | Sakshi
Sakshi News home page

అధినేతల అడుగులు  

Published Sat, Apr 6 2019 3:03 PM | Last Updated on Sat, Apr 6 2019 3:09 PM

Party Leaders Busy In Election Compaign - Sakshi

సాక్షి, వికారాబాద్‌: చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇక్కడ ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఈక్రమంలో ఈనెల 7న యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ జిల్లాకు రానున్నారు. పూడూరు మండలం మిర్జాపూర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు హస్తం శ్రేణులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

మరోవైపు చేవెళ్ల గడ్డపై మరోమారు గులాబీ జెండాను రెపరెపలాడించాలని టీఆర్‌ఎస్‌ పట్టుదలగా ఉంది. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి గెలుపుకోసం ఇప్పటికే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రోడ్‌షోలు నిర్వహించారు. తాజాగా గులాబీ అధినేత కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. 8వ తేదీన వికారాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించనున్నారు. రెండుపార్టీల అధినేతలు జిల్లాకు రానుండటంతో ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోనియా, కేసీఆర్‌ రాకతో రాజకీయం మరింత వేడెక్కనుంది.  

మిర్జాపూర్‌లో ఏర్పాట్లు 
ఈనెల 7న పూడూరు మండలంలోని మిర్జాపూర్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు హస్తం పార్టీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్షనేత బట్టి విక్రమార్కతోపాటు రాష్ట్రంలోని ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఇప్పటికే సభావేదిక వద్ద పనులు పూర్తయ్యాయి. చేవెళ్ల పార్లమెంట్‌ ఇన్‌చార్జి గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిరుపేదలకు రూ.72 వేలు, సంక్షేమ పథకాలపై ఆమె ప్రసంగించనున్నారు. అదేవిధంగా టీఆర్‌ఎస్, కేసీఆర్‌పైనా విమర్శల బాణాలు ఎక్కుపెట్టే అవకాశాలు లేకపోలేదు.   

2 లక్షల మందితో సీఎం సభ 
సీఎం కేసీఆర్‌ సభ జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా గులాబీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 8న కేసీఆర్‌ వికారాబాద్‌ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఏర్పాట్లపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. సుమారు 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేలా ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రచించారు. చేవెళ్ల పార్లమెంట్‌ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని గులాబీ దళపతి గట్టి పట్టుదలతో ఉన్నారు.

అదేవిధంగా వికారాబాద్, పరిగి, తాండూరుతోపాటు ఉమ్మడి రంగారెడ్డిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీ జన సమీకరణ చేసే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో భారీ బహిరంగ సభల్లో తన ప్రసంగంతో కేసీఆర్‌ జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈనేపథ్యంలో ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజకీయ భవితవ్యంపై కేసీఆర్‌ ఎలాంటి భరోసా ఇస్తారోనని ఆందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   

పార్టీల ప్రధాన ఎజెండా 
చేవెళ్ల పార్లమెంట్‌ పట్టణ, పల్లె ఓటర్ల కలబోత. రెండు ప్రాంతాల్లోని ఓటర్లను ఆకట్టుకనేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి రానుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, మిషన్‌ భగీరథ తదితర పథకాలు తమ అభ్యర్థిని గెలిపిస్తాయనే  భరోసాలో టీఆర్‌ఎస్‌ ఉంది. జిల్లాలోని ప్రధాన సమస్యలను ఇప్పటికే ఆయా పార్టీల నేతలు ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. సాగు, తాగునీరు, నిరుద్యోగ సమస్యలతోపాటు అభివృద్ధి విషయమై హామీలు ఇవ్వనున్నారు. జోన్‌ అంశం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అధినేతల ప్రసంగంలో ప్రధానంగా ఉండబోతుంది. ఇక్కడి ప్రధాన సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి ఓట్లను దండిగా రాబట్టుకోవాలని నేతలు భావిస్తున్నారు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement