ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ఉత్సవాల వేదికపై సీఎం రేవంత్ మనవడితో ఉల్లాసంగా గవర్నర్
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించిన సీఎం
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ సోనియా వీడియో సందేశం
రాష్ట్ర అధికారిక గేయం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఉదయం 9.30 గంటల సమయంలో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు నివాళులు అర్పించారు. 9.55 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. సీఎం రేవంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. వివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అధికారిక గేయంగా ఖరారు చేసిన అందెశ్రీ రచన ‘జయ జయహే తెలంగాణ..’సంక్షిప్త రూపాన్ని ఆవిష్కరించారు. ఈ గేయాన్ని వినిపిస్తున్న సమయంలో కవి అందెశ్రీ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవడం కనిపించింది.
కేసీఆర్ కోసం ప్రత్కేకంగా సోఫా..: రాష్ట్ర ఆవి ర్భావ వేడుకలకు రావాలంటూ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఆహ్వనం పంపిన విషయం తెలిసిందే. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ సభలో ముందు వరసలో కేసీఆర్ కోసం ప్రత్యేకంగా సోఫా ఏర్పా టు చేశారు. కేసీఆర్‌కు కేటాయించిన స్థానం అంటూ కాగితంపై రాసి ఉంచారు.
సోనియాగాంధీ వీడియో సందేశం
వేడుకలకు ముఖ్య అతి థిగా సోనియాగాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించినా.. అనివార్య కారణాలతో రాలేకపోయారు. అయితే తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోనియా ఒక వీడియో సందేశం పంపారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఎల్రక్టానిక్ తెరలపై ఈ సందేశం వీడియోను ప్రదర్శించారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందరో అమరవీరుల త్యాగఫలం. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తున్నాను.
తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి 2004 లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చాను. అది సొంత పార్టీలో అసమ్మతి స్వరాలకు కారణమైంది. కొందరు నేతలు మా నిర్ణయంతో విభేదించారు. అయినా మాట నిలబెట్టుకుంటూ తెలంగాణ ఏర్పాటు చేశాం. ఇప్పుడు రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉన్నాం. సీఎం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ హామీలు నెరవేరుస్తుంది. ప్రజలకు శుభం జరగాలి. జైహింద్.. జై తెలంగాణ’’అని వీడియో సందేశంలో సోనియా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment