అక్రమంగా ఆక్రమణ.. | Lands Occupying Illegal Manner In Tandur | Sakshi
Sakshi News home page

అక్రమంగా ఆక్రమణ..

Published Mon, Jul 22 2019 12:11 PM | Last Updated on Mon, Jul 22 2019 12:14 PM

Lands Occupying Illegal Manner In Tandur - Sakshi

శ్మశానవాటిక స్థలంలో నిర్మించిన దుకాణాలు

సాక్షి, తాండూరు: తాండూరులో అక్రమార్కులు రెచ్చి పోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా స్థలాలను ఆక్రమించడంతో పాటు ఎవరి పర్మిషన్‌ లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. పట్టణంలో బీసీలు, వీరశైవుల కోసం ప్రభుత్వం శ్మశానవాటిక స్థలాన్ని కేటాయించింది. ఇందిరాచౌక్‌ సమీపాన హైదరాబాద్‌ మార్గంలో కుడి వైపున బీసీలకు, ఎడమ వైపున వీరశైవులకు అధికారులు స్థలం అందించారు. ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో అక్రమార్కుల కన్ను పడింది. దీంతో శ్మశానవాటికలకు ఇచ్చిన స్థలాలను ఆక్రమించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. ఈ భవన సముదాయాలకు ఎలాంటి అనుమతులు లేవు. కొంత మంది  స్థానిక నాయకులు ఇందులో భాగస్వాములుగా మారి ఈ వ్యవహారాన్ని సాగించారనే ఆరోపణలున్నాయి.

మరోవైపు పట్టణంలోని విజయ విద్యాలయ స్కూల్‌ పక్కనే ఉన్న ముస్లిం మైనార్టీల శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమించి దుకాణాలు నిర్మించారు. సర్వేనంబర్‌ 111లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. భవనాలు కట్టారు. ఈ విషయంపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. దీంతో పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీల్లో తాండూరు మొదటిది. 19.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న పట్టణంలో 13,500 నివాస గృహాలున్నాయి. ఏటా రూ.3 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్‌ ఉంది. అయితే రెండేళ్లుగా మున్సిపల్‌ పరిధిలో ఇళ్లు, దుకాణ సముదాయాలు నిబంధనలకు విరుద్ధంగా వెలుస్తున్నాయి. పట్టణంలోని పలు ప్రైవేటు పాఠశాలల నిర్మాణాలను సైతం ఎలాంటి పర్మిషన్‌ లేకుండా చేపట్టడం గమనార్హం.   

అనుమతి పొందకుండానే.. 
వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్న రియల్‌ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. హద్దురాళ్లు పాతి స్వేచ్ఛగా ప్లాట్లు విక్రయిస్తున్నారు. మున్సిపల్‌ పరిధిలో పర్మిషన్‌ లేని లేఔట్లు 30 వరకు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మల్‌రెడ్డిపల్లి మార్గంలో సర్వే నంబర్‌ 128లో మున్సిపల్‌ అనుమతులు లేకుండానే వెంచర్‌ చేశారు.   

శివారు ప్రాంతాల్లో.. 
 ఇటీవల తాండూరు మున్సిపాలిటీలో విలీనమైన శివారు ప్రాంతాల్లో ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు ఊపందుకున్నాయి. వందల సంఖ్యలో భారీ భవంతులు వెలుస్తున్నాయి. మున్సిపాలిటీకి చెందిన స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.   

బొందలపై రాబందులు... 
తాండూరులో భూమి విలువ భారీగా పెరిగింది. దీంతో పట్టణ నడిబొడ్డున ఉన్న బొందల (శ్మశానాలు)పై రియల్‌ రాబందుల వాలాయి. బొందలను ధ్వంసం చేసి షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించారు. ఓ సంఘం ఇందులో ఏకంగా 40నుంచి 50 దుకాణాలు నిర్మించింది. వీటి వెనకభాగంలో మెకానిక్‌ షెడ్లు నిర్మించేందుకు మరికొంత మంది సిద్ధమవుతున్నారు. మరో సామాజికవర్గానికి చెందిన దుకాణ సముదాయాలు సైతం ఎలాంటి పర్మిషన్‌ లేకుండానే వెలిశాయి. తాండూరు పట్టణంలో నిబంధనలకు వ్యతిరేకంగా భవన నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.   

కొత్త చట్టం అమలుతో కూల్చివేతలే.. 
రెండు రోజుల క్రితమే కొత్త మున్సిపల్‌ చట్టానికి రూపకల్పన చేశారు. దీనిపై అసెంబ్లీ ఆమోద ముద్ర కూడా పడింది. ఇందులో పేర్కొన్న ప్రకారం అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అధికారాలను మున్సిపాలిటీలకు కట్టబెట్టారు. ఈ విధానం పకడ్బందీగా అమలైతే తాండూరు మున్సిపాలిటీలో వేల సంఖ్యలో అక్రమ భవనాలు, పదుల సంఖ్యలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు కూల్చివేసే అవకాశముంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement