డాక్టర్ మెతుకు ఆనంద్
ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. టీఆర్‌ఎస్ అధిష్టానం వికారాబాద్ టీఆర్‌ఎస్ టికెట్‌ను డాక్టర్ మెతుకు ఆనంద్‌కు కేటాయించింది. ఈమేరకు బుధవారం ప్రకటించింది. జిల్లాలోని మరో మూడు టికెట్లను కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన రోజున ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావుకు టికెట్ నిరాకరించింది. టికెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్టానం భారీ కసరత్తు చేసింది. పలుమార్లు మంత్రి కేటీఆర్ జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు ఇతర నేతలతో సమావేశమై సమాలోచనలు జరిపారు. ఎట్టకేలకు టికెట్ ప్రకటించడంతో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, అనంతగిరి: టీఆర్‌ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను బుధవారం రాత్రి ప్రకటించింది. ఈమేరకు వికారాబాద్ నియోజకవర్గం స్థానాన్ని డాక్టర్ మెతుకు ఆనంద్‌కు కేటయించింది. రెండు నెలలుగా ఈ టికెట్ విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. మొదటి జాబితాలో వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు పేరు లేకపోవడంతో ఆశావహులు టికెట్ దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీపడ్డారు. పార్టీ సీనియర్ నాయకులు, పలువురు డాక్టర్లు యత్నించారు. ఎట్టకేలకు అధిష్టా నం డాక్టర్ మెతుకు ఆనంద్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపింది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ బరిలో దిగారు. ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. మెతుకు ఆనంద్‌కు టికెట్ రావడంతో ఆయన సన్నిహితులు, పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యమంలో కీలక భూమిక
డాక్టర్ మెతుకు ఆనంద్ తెలంగాణ ఉద్యమంలో డాక్టర్స్ జేఏసీలో కీలకంగా పనిచేశారు. 2013–14లో వికారాబాద్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 2014లో ఎన్నికల్లో ఆయన పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. మెతుకు ఆనంద్ వికారాబాద్‌లో సబితాఆనంద్ పేరుతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. దీంతోపాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వికారాబాద్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment