టికెట్లు ఇస్సాం రండహో! | candidates for congress | Sakshi
Sakshi News home page

టికెట్లు ఇస్సాం రండహో!

Published Thu, Jan 9 2014 4:57 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

candidates for congress

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘మీ జిల్లాకొస్తాం... అడిగి మరీ టికెట్టు ఇచ్చి వెళతాం... ఎందుకు తీసుకోరో చూస్తాం...’అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. పార్టీ టికెట్ల కోసం ఆశావహులు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేయడం రాజకీయాల్లో రివాజు. కానీ కాంగ్రెస్ తీరు అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలో తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఎన్నికల గుబులు పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్నా పార్టీ తరఫున టికెట్ల కోసం ఏమాత్రం పోటీ కనిపించడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో టికెట్టు కావాలని అడిగే నాథుడే లేకుండా పోయాడు. పోనీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పరిస్థితి బాగుందా అంటే అదీ లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈసారి తమంతట తాముగా పోటీకి సుముఖత చూపడం లేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల కోసం వెతుకుతోంది. అందుకోసం తమ దూతలను జిల్లాకు పంపనుంది.  
 
 జిల్లాకు రానున్న అధిష్టానం దూతలు..
కాంగ్రెస్ అధిష్టానం నియమించిన పరిశీలకులు ఈ నెల 10, 11 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా అధిష్టానం పరిశీలకులను నియమించింది. రానున్న ఎన్నికల కోసం లోక్‌సభ నియోజకవర్గాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల కోసం అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేయడం పరిశీలకుల బాధ్యత. సాధారణంగా పరిశీలకులు గాంధీభవన్‌లోనే ఉంటే... ఆశావాహులు అక్కడికి వెళ్లి కలుస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీభవన్‌లో కూర్చుంటే పనిజరగదని కాంగ్రెస్ అధిష్టానానికి బోధపడింది. అందుకే జిల్లాలకు వెళ్లాలని ఆదేశించింది.  
 
 టికెట్లు తీసుకోండి... ప్లీజ్!
 ఉన్నంతలో కాస్తా కూస్తో ఎన్నికల్లో పోటీనివ్వగలిగే అభ్యర్థులతో జాబితా రూపొందించాలని పరిశీలకులను అధిష్టానం ఆదేశించింది. అందుకోసం పార్టీ నేతలను బుజ్జగించాలని..వారిని పోటీకి ఒప్పించాలని స్పష్టం చేసింది. దీంతో రంగంలోకి దిగిన పరిశీలకులు నియోజకవర్గాల వారీగా పార్టీకి అందుబాటులో ఉన్న నేతల వివరాలు సేకరిస్తున్నారు. వారితో ఫోన్లో మంతనాలు ప్రారంభించారు. తాము జిల్లాకు వచ్చినప్పుడు కలవాలని కోరుతున్నారు. ఒంగోలు అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున ఎవరూ పోటీకి సుముఖత చూపే పరిస్థితి లేకపోవడంతో ఏం చేయాలో పరిశీలకులకు అంతుచిక్కడం లేదు. మార్కాపురం పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఫండ్‌పై ఆశతోనే ఎవరైనా పోటీకి సిద్ధపడతారు తప్ప గెలుపుపై ధీమాతో కాదని పరిశీలకులకు అర్థమైంది.  
 
 సిట్టింగ్‌ల బెట్టు!
 ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో సగం మందికిపైగా ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో అవకాశాలు లేకపోవడంతో టీడీపీతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ పరిశీలకులు సిట్టింగ్ ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇదే అదనుగా బెట్టుచేయాలని భావిస్తున్నారు.
 
 మంత్రి మహీధర్ మడతపేచీ!
 వచ్చే ఎన్నికల్లో కందుకూరు నుంచి పోటీకి వెనుకంజ వేస్తున్న మంత్రి మహీధర్ రెడ్డి ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నారు. కందుకూరు టికెట్టు వద్దని చెప్పకుండా తాను ఈసారి లోక్‌సభకు పోటీచేయాలనే యోచనలో ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. అలా వీలుకానీ పక్షంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేయాలన్నది ఆయన ఉద్దేశం.  కానీ ఆ విషయాన్ని బహిర్గతం చేస్తే కందుకూరులో ఉన్న కొద్దిమంది అనుచరగణం కూడా జారుకుంటారని ఆయనకు తెలుసు. అందుకే తాను కందుకూరు నుంచే పోటీ చేస్తానని పైకి చెబుతున్నారు. కానీ లోపాయికారీగా నెల్లూరు లోక్‌సభ, కావలి అసెంబ్లీ టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అదే తంత్రాన్ని జిల్లాకు రానున్న పరిశీలకుల వద్ద కూడా అమలు చేయాలన్నది ఆయన ఉద్దేశం. మహీధర్‌రెడ్డికి నెల్లూరు లోక్‌సభగానీ, కావలి అసెంబ్లీ టికెట్టుగానీ ఖరారు చేస్తే కందుకూరులో కూడా అభ్యర్థిని నిర్ణయించడం కాంగ్రెస్‌కు మరో సమస్యగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల జాబితా రూపొందించడం కాంగ్రెస్ పరిశీలకులకు కత్తిమీద సాముగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement