కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ అభ్యర్థుల ఖరారు
నామినేషన్ల గడువు ముగిసే ముందు రోజు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన కాంగ్రెస్
వెలమ, రెడ్డి, మైనార్టీలకు కేటాయించిన అధిష్టానం
వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పటివరకు ప్రకటించకుండా మిగిలిపోయిన మూడు స్థానాలు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించేసింది.
ఈ మేరకు బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ నుంచి డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ వలీవుల్లా సమీర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురాం రెడ్డికి అవకాశం ఇచ్చారు.
రఘురాంరెడ్డి తండ్రి సురేందర్‌రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఆయన డోర్నకల్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్‌సభ నుంచి నాలుగుసార్లు ఎంపీగా పనిచేశారు. రఘు రాంరెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సినీ హీరో దగ్గుబాటి వెంకటే‹Ùలకు వియ్యంకుడు. కాగా నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి రోజు.
అగ్రవర్ణాలకు 8 స్థానాలు: రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకూ అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగా, ఇందులో 8 టికెట్లను కాంగ్రెస్ అగ్రవర్ణాలకు కేటాయించింది. ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో ఒకటి ఆదివాసీ, మరోటి లంబాడా సామాజిక వర్గాలకు కేటాయించగా, ఎస్సీ రిజర్వుడు స్థానాలైన పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌లను మాలలకు, వరంగల్‌ను మాదిగలకు కేటాయించింది.
మెదక్, సికింద్రాబాద్, జహీరాబా ద్ స్థానాలను బీసీలకు కేటాయించగా, హైదరాబాద్ సీటును మైనార్టీకి, కరీంనగర్ స్థానాన్ని వెలమ సామాజిక వర్గానికి, నిజామాబాద్, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు టికెట్ కేటాయించడం గమనార్హం.
అది బీసీకే..: మూడు లోక్‌సభ స్థానాలతోపాటు త్వరలో ఎన్నికలు జరగనున్న నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికీ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. బీసీ వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న పేరును ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారుచేశారు. కరీంనగర్ లోక్‌సభ రేసులో ఆయన పేరు వినిపించినా.. అక్కడ ఓసీ వర్గానికి టికెట్ కేటాయించారు. దీంతో బీసీ వర్గానికి చెందిన మల్లన్నకు పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment