ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పార్టీలు తెగ మారిపోతున్నారు. ఎంతోకాలంగా ఒక పార్టీలో ఉండి, అవతలి పార్టీ అధినేతను, నాయకులను నోటికి వచ్చినట్లల్లా తిట్టి.. ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్లడానికి ఏమాత్రం మొహమాటపడటంలేదు. అయితే.. ఇన్నాళ్ల నుంచి ఆ పార్టీలో ఉండి, జెండాలు మోసి ఎప్పుడో అప్పుడు టికెట్ రాకపోతుందా అని ఆశించినవాళ్లు మాత్రం ఇప్పుడు తమకు మొండిచేయి ఎదురవడంతో తట్టుకోలేకపోతున్నారు.
గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ జిల్లాకు చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని నోటికి వచ్చినట్లు తిట్టారు. ఇప్పుడు మొహమాటం ఏమీ లేకుండా అదే పార్టీలో చేరిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మాజీమంత్రి పితాని సత్యనారాయణ కూడా వచ్చారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు పితాని అధికారికంగా ప్రకటించేశారు.
అయితే.. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టికెట్ల మీద ఆశలు పెట్టుకున్న నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఇప్పుడీ కొత్త నాయకుల రాకతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆచంట నియోజకవర్గానికి అక్కడి ఎస్వీకేపీ కాలేజి మాజీ ప్రిన్సిపల్ గుబ్బల తమ్మయ్యను అభ్యర్థిగా అనధికారికంగా ఎప్పుడో ప్రకటించేశారు. కానీ ఇప్పుడు పితాని సత్యనారాయణ అక్కడ టీడీపీలో చేరడంతో.. టికెట్ ఎవరికి దక్కుతుందనేది అనుమానంగా మారింది. తమ్మయ్య ఇప్పటికే ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. ఆయన పరిస్థితి అయోమయంగా మారింది. ఇక తాడేపల్లిగూడెం పరిస్థితీ అంతే. అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఈలి నాని, కొట్టు సత్యనారాయణ ఇద్దరూ టీడీపీలో చేరిపోయారు. వాళ్లలో కొట్టుకు టికెట్ ఖాయమని అనుకుంటున్నారు. కానీ, ఆ టికెట్పై ఇప్పటికే ముళ్లపూడి బాపిరాజు, ఎర్రా నారాయణస్వామి మనవడు నవీన్ లాంటివాళ్లు ఆశ పెట్టుకున్నారు. వాళ్లకు మొండిచేయి చూపిన బాబు.. బాపిరాజుకు జడ్పీ చైర్మన్ పదవి ఆశపెట్టారు.
ఇదే పరిస్థితి ఇతర జిల్లాల్లో కూడా ఉంది. కృష్ణా జిల్లాలో తన తండ్రి హయాం నుంచి కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న మండలి బుద్ధప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆయన రాకను స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.
గోదారిలో టికెట్ల గోలగోల
Published Fri, Apr 4 2014 3:03 PM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement