సాక్షి ప్రతినిధి,కడప: రాజ్యసభ సభ్యుడు సీఎంరమేష్‌నాయుడుపై తెలుగుతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ విధేయత, కష్టపడ్డనేతలకు గుర్తింపు ఇవ్వకుండా డబ్బే అర్హతగా పార్టీ టికెట్లు కేటాయిస్తుండటంతో ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మర్యాద, గౌరవాన్ని నిలిపిన ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డికి టికెట్ నిరాకరణపై కార్యకర్తలు రగిలిపోతున్నారు. సీఎం రమేష్ పోట్లదుర్తి గ్రామానికి చెందిన వ్యక్తి.
తన వ్యాపార కార్యకలాపాల ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చేరువయ్యారు. కాలక్రమేణ ఆయన కోటరీలో ఒక్కరిగా చేరిపోయారు. వైఎస్సార్ జిల్లాలో గ్రామస్థాయికి పరిమితమైన సీఎం రమేష్ ఒక్కమారుగా టీడీపీలో ప్రముఖవ్యక్తిగా మారారు. ఈపరిణామాన్ని ఇతర జిల్లా వాసు లు జీర్ణించుకున్నా, వైఎస్సార్ జిల్లా వాసులకు అంతగా రుచించడం లేదు. ఫ్యాక్షన్‌కు ఎదురొడ్డి కుటుంబాలను త్యాగం చేసుకుని, ఆస్తులను కర్పూరంలా కరిగించుకుని పార్టీ అభివృద్ధే ధ్యేయంగా పయనిస్తున్న నాయకులకంటే పైరవీకారులకే విలువ ఉండటంపై పలువురు తీవ్రం గా తప్పుబడుతున్నారు.
ఆ కోవలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ రెండాకులు ఎక్కుగానే ఉన్నారని తెలుగుతమ్ముళ్లు మదనపడుతున్నా రు. సీఎం రమేష్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసిన కారణంగా జిల్లాలో నలుగురు టీడీపీ టికెట్లు కోల్పోయిన ట్లు ఆపార్టీ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైరవీకారులకే ప్రాధ్యాన్యత ఇస్తుండటంపై పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఒకరి తర్వాత ఒకరికి చెక్.....
పార్టీలు ఏవైనా ఒకప్పుడు జిల్లాలో గ్రూపు రాజకీయాలు నడిచాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రూపు, కందుల ఓబులరెడ్డి గ్రూపులు రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేవి. 2004 ఎన్నికల వరకూ అదే ప్రామాణికంగా నేతలు వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంపికయ్యాక పార్టీలు, గ్రూపులు కనుమరుగయ్యాయి. పాతతరం గ్రూపులు, వర్గాలు అభివృద్ధి, సంక్షేమం ముందు బలాదూర్ అయ్యాయి.
ఈపరిస్థితుల్లో జిల్లా వాసి సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడు అయ్యాక ఆయన నేతృత్వంలో పార్టీ వ్యవహారాలు అధికమయ్యాయి. మూడు దశాబ్ధాలుగా వర్గ రాజకీయాల్లో ఆరితేరిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కొంత అంటీముట్టనట్లు వ్యవహరించారు. సీఎం రమే ష్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే తాము వెళ్లా లా.. ఆయన మాకు జాతీయనేతనా.. అంటూ పలు సందర్భాలలో వ్యంగ్యంగా మాట్లాడినట్లు సమాచారం. అలాంటి భావనతోనే ఎమ్మెల్యే లింగారెడ్డి, మాజీ మంత్రి బ్రహ్మయ్య, కందుల రాజమోహన్‌రెడ్డిలాంటి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆ విషయాన్ని మనస్సులో ఉంచుకున్న సీఎం రమేష్ ఒకరి తర్వాత మరొకరికి చెక్ పెట్టుకుంటూ వచ్చారు. చంద్రబాబు వద్ద మెప్పుకోసం పార్టీ నేతలపై వ్యతిరేకత, డ బ్బు కారణాలుగా చూపుతూ టీడీపీకి దూరం చేస్తూ వస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈ విధంగానే మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడుకు టికెట్ రానీయకుండా మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డికి దక్కేలా చేశారని ఆపార్టీ సీనియర్ నేతలు విశ్వసిస్తున్నారు. కందుల రాజమోహన్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా కడప పార్లమెంటుకు నాన్‌లోకల్ అయినా శ్రీనివాసులరెడ్డికి దక్కేలా చేశారని, మాజీ మంత్రి బ్రహ్మయ్యను కాదని డబ్బున్న మేడా మల్లికార్జునరెడ్డిని, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏకైక ఎమ్మెల్యే లింగారెడ్డికి సైతం డబ్బే కారణంగా చూపెట్టి టికెట్ రానీయకుండా చేసి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టికెట్ కేటాయించేలా వ్యవహరించారు.
లింగారెడ్డికి తీవ్ర పరాభవం....
రెండున్నర దశాబ్ధాలుగా ప్రజాజీవితంలో ఉంటూ పోరాటం చేసిన లింగారెడ్డి 2009లో టీడీపీ టికెట్ ద్వారా తనజీవితాశయమైన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ ప్రత్యర్థి వరదరాజులరెడ్డిని 16వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. లింగారెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికీ అధికారపార్టీ ముసుగులో వరదరాజులరెడ్డి అడుగడుగునా అడ్డుతగులుతూ వచ్చారు. నెలరోజుల క్రితం వరదరాజులరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మూడు దశాబ్ధాలుగా పార్టీనే ప్రాణప్రదంగా భావించిన లింగారెడ్డిని తప్పించి వరదకు అండగా నిలిచారు. ఈవైనాన్ని లింగారెడ్డి అనుచరులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. శుక్రవారం తెలుగుదేశపార్టీ జెండాలు, బ్యానర్లకు నిప్పుపెట్టారు. అధినేత చంద్రబాబు, సీఎం రమేష్‌పై శాపనార్థాలు పెట్టారు. గ్రామ స్థాయి నేత రమేష్‌కు రాజ్యసభ కేటాయించడంలో, వరదరాజులరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం వెనుక డబ్బుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని వాపోతున్నారు.
సీఎం రమేష్‌పై తెలుగుతమ్ముళ్ల ఫైర్
Published Sat, Apr 19 2014 2:28 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement
Advertisement