Ramesh Naidu
-
టీడీపీ నేత ఇంట్లో భారీగా పట్టుబడ్డ డబ్బు
-
పాన్ ఇండియా మూవీగా దాసరి బయోపిక్
దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు జీవితం వెండితెరకు రానుంది. సీనియర్ దర్శకుడు ధవళ సత్యం ‘దర్శకరత్న’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కించనున్నారు. ఇమేజ్ ఫిలింస్ పతాకంపై తాడివాక రమేష్ నాయుడు నిర్మించనున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ధవళ సత్యం మాట్లాడుతూ– ‘‘రచయితగా, దర్శక–నిర్మాతగా ఎందరికో మార్గదర్శకుడైన దాసరిగారితో నాది విడదీయలేని అనుబంధం. ఆ బంధమే ‘దర్శకరత్న’ చేసేందుకు నన్ను పురిగొల్పింది’ అన్నారు. తాడివాక రమేష్ నాయుడు మాట్లాడుతూ– ‘‘ఓ జాతీయ స్థాయి నటుడు దాసరిగారి పాత్రను పోషిస్తారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందించనున్నాం’’ అన్నారు. డైరెక్టర్ రేలంగి నరసింహారావు, నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, డైరెక్టర్ కాశీ విశ్వనాథ్, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పి.రామకృష్ణగౌడ్, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, వినాయకరావు తదితరులు దాసరితో తమ అనుబంధం గురించి మాట్లాడారు. -
అభ్యంతరకరమైన పోస్టు..: రమేష్ నాయుడు
అమరావతి: నాథూరామ్ గాడ్సేను నిజమైన దేశ భక్తుడిగా అభివర్ణించిన ఏపీ బీజేపీ నేత రమేష్ నాయుడు నాగోతు తన ట్వీట్‌ను డెలిట్ చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘‘నా ట్విటర్‌ను హ్యాండిల్ చేస్తున్నవారు అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. దానిని, వారి సేవలను తొలగించడమైనది’’ అంటూ వివరణ ఇచ్చారు. నవంబరు 15న గాడ్సే వర్ధంతిని పురస్కరించుకని.. ‘‘నేడు నాథూరాం గాడ్సే వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన పట్ల కృతజ్ఞతాభావం చాటుకుంటున్నా. భరతభూమిలో ముందెన్నడూ ఇలాంటి గొప్ప దేశభక్తుడు జన్మించలేదు’’అని నివాళులు అర్పించారు. (చదవండి: ఇలాంటివి రాసే బాబుకు 23 ఇచ్చారు: సోము) ఈ క్రమంలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. జాతిపిత మహాత్మా గాంధీ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ గతంలో రమేష్ నాయుడు చేసిన పోస్టును, గాడ్సేను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్‌ను పోలుస్తూ .. రాజకీయాల కోసమే రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. దీంతో ట్వీట్‌ను డెలిట్ చేయడంతో పాటుగా తన ట్విటర్ ఖాతాను నిర్వహిస్తున్న వారికి కూడా ఉద్వాసన పలికినట్లు రమేష్ నాయుడు మరో ట్వీట్లో పేర్కొన్నారు. నా ట్విట్టర్ ను handle చేస్తున్నవారు అభ్యన్తరకరమైన post పెట్టారు దానిని , వారి సేవలను తొలగించడమైనది 🙏 — Rameshnaidu Nagothu (@RNagothu) November 15, 2020 -
‘మాయ చేసి పోతివిరో నాగులూ’...
అసలు రమేశ్ నాయుడు ఏఆర్.డి. బర్మన్లానో ఏ మదన్మోహన్లానో దేశమంతా తెలిసిన సంగీత దర్శకుడు అయి ఉండాలి. అంత ప్రతిభ ఉన్న సంగీత దర్శకులు తెలుగులో తక్కువ ఉన్నారు. ప్రతిభ ఉన్న తెలుగువాడు కదా ఉపయోగించుకుందాం అని గాడ్‌ఫాదర్‌లా నిలిచేవారు దేశంలో అంత కంటే తక్కువ ఉన్నారు. అయినప్పటికీ ఏమి. తెలుగువారికి ఆయన పాటలు వినే అదృష్టం దక్కింది. తెలుగువారి వాకిటలో ఆయన నాటిన పాటల నంది వర్థనాల కళ మిగిలింది. పి.సుశీల చేత, బాలూ చేత, జానకి చేత సున్నితంగా పాడించడం ఎవరైనా చేస్తారు. కాని ఎల్.ఆర్. ఈశ్వరి చేత కూడా ఆయన సున్నితంగా పాడించి శృంగారం అంటే అరుపులు, మూలుగులు కాదు గొంతులోని పిలుపులు అని నిరూపించారు. ‘జీవితం’ సినిమాలో ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన పాట ఎవరికి గుర్తు లేదు? ‘మాయ చేసిపోతివిరో నాగులూ... నా మాట మరిచిపోతివిరో నాగులూ’... రేడియోలో ఉదయమో మధ్యాహ్నమో నిద్రపోయే ముందు ఈ పాట తప్పక వినిపించేది. అంతేనా? ‘అమ్మ మాట’ కోసం ఒక పాట రికార్డు చేయాలి. సన్నివేశానికి తగినట్టు ఏదో రఫ్ నోట్స్ రాసుకుని భోజనానికి వెళ్లారు సి.నారాయణరెడ్డి. తొందరగా భోజనం ముగించుకు వచ్చిన రమేశ్ నాయుడు ఆ రఫ్ నోట్సే పల్లవి అనుకుని దానికి ట్యూన్ కట్టారు. అంటే అది న్యూస్పేపర్లోని వార్తకు ట్యూన్ కట్టడంతో సమానం. కాని రమేశ్‌నాయుడు కట్టారు. ఎల్.ఆర్. ఈశ్వరి చేత అంతే లలితంగా పాడించారు. ఆ పాట ఏదో తెలుసుగా? ‘లగ్గమెప్పుడ్రా మామా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే’.... రమేశ్ నాయుడు ఎల్.ఆర్. ఈశ్వరితో పాడించిన ఈ రెండు పాటలు చెప్పాక ఇంకో పాట చెప్పకపోతే శిక్షార్హమైన నేరం అవుతుంది. లేదంటే ఓకే..యా అవుతుంది. ఎస్.. గుర్తుకొచ్చింది కదా. ‘దేవుడు చేసిన మనుషులు’ లో దేవకన్య కాంచన నైట్‌క్లబ్‌లో పాడే పాట. ఆ మసక మసక చీకటి. ఆ మల్లెతోట చాటు. ఆరుద్ర ఘాటు. ‘మసక మసక చీకటిలో.. మల్లెతోట ఎనకాల’... రమేశ్ నాయుడు దేశంలోని 12 భాషల్లో పాటలు చేశారు. కృష్ణా జిల్లాలోని కొండపల్లి నుంచి ఆయన ప్రయాణం 14 ఏళ్ల వయసులో మొదలయ్యి బొంబాయి, కలకత్తా, మద్రాసుల మీదుగా సాగింది. పావలా కాసు ప్రతిభ ఉంటే పది రూపాయల సౌండ్ చేసేవారు ఎక్కువ ఫీల్డ్‌లో. కాని వంద రూపాయల ప్రతిభ ఉంచుకుని కూడా రమేశ్ నాయుడు తనను తాను ముందు వరుసలో నిలబెట్టుకోవడానికి మొహమాటపడేవారు. సాహిత్యం వినిపించేలా చేయడం, గాయకుల ప్రతిభ కనిపించేలా చేయడం, వాద్య పరికరాలను వాటి హద్దుల్లో ఉంచడం ఇవి రమేశ్ నాయుడుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ‘ఇక్కడే కలుసుకున్నాము... ఎప్పుడో కలుసుకున్నాము’ (జీవితం) పాట గుర్తుకు తెచ్చుకోండోసారి. రమేశ్ నాయుడికి వేణువంటే ఇష్టం. వేణుగానం ఉన్న పాటలు చాలా చేశారు. కాని ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ఘంటసాల పాడిన ఈ పాట అపురూపం. ఎన్నిసార్లు విన్నా ఆ వేణువులో ఆ గానంలో ఏదో వేదన ఉంటుంది. పాటలో వేదనను నింపడం అంత సులువు కాదు. ‘విన్నారా... అలనాటి వేణుగానం.. మోగింది మరలా’... కె.వి. మహదేవన్, సత్యం, చక్రవర్తి... ఈ ముగ్గురు కూడా (1975–85)ల మధ్య విపరీతమైన మార్కెట్లో ఉన్నారు. కమర్షియల్ సినిమాలంటే వీరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. కాని దాసరి నారాయణరావు, విజయనిర్మల, జంధ్యాల దాదాపుగా రమేశ్ నాయుడు చేత పాటలు చేయించుకోవడానికి ఇష్టపడేవారు. విజయ నిర్మల ‘మీనా’ సినిమాకు ఆయన చేసిన ‘శ్రీరామ నామాలు శతకోటి’ పాట ప్రతి శ్రీరామ నవమికి ప్లే అవుతూనే ఉంది. జంధ్యాల ‘ముద్దమందారం’ సినిమాకు చేసిన పాటలు– ‘అలివేణి ఆణిముత్యమా’, ‘నీలాలు కారేనా కాలాలు మారేనా’ క్లాసిక్స్‌గా నిలువలేదూ! ఇక దాసరికి 20 సినిమాలు చేశారు. అన్ని సినిమాలు ఒకెత్తు... ‘మేఘసందేశం’ ఒకెత్తు. రమేశ్‌నాయుడు బాణీలు ఇవ్వడాన్ని ఇష్టపడేవారు కాదు. పాట రాస్తే సన్నివేశానికి తగినట్టుగా ట్యూన్ చేయాలనేది ఆయన ధోరణి. ‘మేఘసందేశం’కు మహాకవులు పాటలు రాశారు. వేటూరి ‘ఆకాశదేశాన.. ఆషాఢ మాసాన’ అన్నారు. కృష్ణశాస్త్రి ‘సిగలో అవి విరులో’ అన్నారు. ‘ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై’ అని కూడా అన్నారు. వీటికి తోడు జయదేవుని అష్టపది ‘ప్రియే చారుశీలే’. వీటన్నింటిని సుశీల, ఏసుదాసుల గొంతులో మరికొన్ని మల్లెలు నింపి శ్రోతలకు పరిమళాలు వొంపారు. ఇదే సినిమాలో మంగళంపల్లి చేత ‘పాడనా వాణి కల్యాణిగా’ పాడించారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్నారు. ఇవన్నీ చేసింది హైస్కూలు చదువు కూడా సరిగా లేని రమేశ్ నాయుడు... ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోని రమేశ్ నాయుడు. ఒకనాటి ‘దేవదాసు’ స్ఫూర్తితో కృష్ణ ‘దేవదాసు’ తీస్తే ఆనాటి పాటలకు దీటుగా రమేశ్ నాయుడు పాటలు ఇచ్చారు. ‘మేఘాల మీద సాగాలి’. ‘పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ’, ‘కల చెదిరింది.. కథ మారింది’ ఇవన్నీ ప్రేక్షకులకు నచ్చాయి. కాని అక్కినేని దేవదాసు ప్రభావం ఈ దేవదాసు మీద పడింది. కృష్ణ నటించిన ‘అంతం కాదిది ఆరంభం’, ‘భోగిమంటలు’, ‘సూర్యచంద్ర’ సినిమాలకు రమేశ్ నాయడు సంగీతం అందించారు. బాలూతో రమేశ్ నాయుడు పాడించిన సోలో గీతాలు సంగీత సాహిత్యాల మేలుకలయికతో నిలిచి ఉన్నాయి. ‘దోర వయసు చిన్నది’ (దేవుడు చేసిన మనుషులు), ‘శివరంజని నవరాగిణి’ (శివరంజని), ‘లలిత కళారాధనలో’ (కల్యాణి), ‘పారాహుషార్ పారాహుషార్’ (స్వయంకృషి) ఇవన్నీ రమేశ్ నాయుడిని తెలుగు శ్రోతల నుంచి దూరం చేయకుండా పట్టి ఉంచాయి. రమేశ్ నాయుడు 54 ఏళ్ల వయసులో 1987లో మరణించారు. ఆయన పాట అపూర్వం. అపురూపం. ఆగక వినిపించే తుమ్మెద సంగీతం. జోరు మీదున్నావు తుమ్మెదా... ఈ జోరెవరి కోసమే తుమ్మెదా.. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలోని అక్రమ కట్టడాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరకట్టపై ఉన్న అన్ని అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు చేరువులు, దేవాలయాల భూములు కబ్జా చేశారని రమేష్ నాయుడు ఆరోపించారు. వీటిన్నంటిని కూడా కూల్చివేయాలని.. అలా చేస్తే జగన్‌కు పుష్పాభిషేకం చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఇలా ఎవరు అక్రమ కట్టడాలు కట్టినా కూల్చివేయాలని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. విభజనలో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందన్నారు రమేష్ నాయుడు. ఏపీ విషయంలో కేసీఆర్ కొంత పట్టువిడుపులు ప్రదర్శించాలని కోరారు. రాయల సీమ కరువుతో అల్లాడుతోందన్నారు. నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలు అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు వర్తింప జేయాలని.. ప్రైవేట్ స్కూల్లకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. -
‘ఏపీకి రూ. 250 కోట్లు వస్తాయి’
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో ప్రస్తుతం ఉన్న కరువు, తుపాను పరిస్థితుల పట్ల బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు రమేష్ నాయుడు స్పందించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రతతో నీళ్లు అడుగంటిపోతున్నాయన్నారు. వందల అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్లు పడక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. రాయలసీమలో తాగడానికి నీళ్ల కోసం మహిళలు కిలోమీటర్ల మేర నడిచి వెళ్తున్నారన్నారు. గుంటూరు తదితర ప్రాంతాల్లో పశుగ్రాసాలు లేక మూగ జీవాలు అల్లాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరువు ప్రాంతాల గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరాలు అందించాలని బీజేపీ కోరుతుందన్నారు. నకిలీ విత్తనాలతో పత్తి దిగుబడి చాలా తగ్గిపోయిందని తెలిపారు. ప్రభుత్వం సర్టిఫై చేసిన కంపెనీలు నకిలీ విత్తనాలు ఇవ్వడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఫొని తుపాను బారిన పడిన నాలుగు రాష్ట్రాలకి కేంద్రం రూ. 1000 కోట్లు కేటాయించిందని తెలిపారు. దీనిలో ఆంధ్రప్రదేశ్‌కి రూ. 250 కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ నిధుల్ని సక్రమంగా ఉపయోగించాలని కోరారు. ఓడిపోతానని స్పష్టంగా తెలిసిపోయింది కాబట్టే చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. -
కరవుపై తక్షణమే చర్యలు తీసుకోండి: బీజేపీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏపీ బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు నాగోతు రమేష్ నాయుడు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న కరవుపై తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో బీజేపీ యువ మోర్చా ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు. ప్రతీ ఏటా కరవు బారిన పడుతున్న రాయలసీమను శాశ్వతంగా ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గాలపై చర్చ జరగాల్సి ఉందని, గ్రామాలలో కనీసం తాగడానికి మంచి నీరు కూడా దొరకడం లేదని లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల మేత దొరకని పరిస్థితి ఏర్పడిందని, పశువులను కబేళాలకు తరలించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వలసలు వెళ్తున్న రైతాంగాన్ని ఉపాధి హామీ పథకం ద్వారా ఆదుకోవాలని కోరారు. వేరుశెనగ, జొన్న, సజ్జలు, రాగి, మొక్కజొన్న పంటలు పండించే రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ కల్పించాలని కోరారు. గతంలో మీరు అట్టహాసంగా ప్రారంభించిన రెయిన్ గన్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని మరోసారి హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. -
‘అందుకు నిరుద్యోగ యువత సిద్ధంగా ఉన్నారు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బుద్ధి చెప్పటానికి నిరుద్యోగ యువత సిద్ధంగా ఉందని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు అన్నారు. సోమవారం బాబు ఏది జాబు అంటూ భారతీయ జనతా యువ మోర్చా నేతలు, కార్యకర్తలు విజయవాడలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ రంగంలోని ఖాళీలను భర్తీ చేయాలంటూ, నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలకు పెంచాలంటూ ఏపీపీఎస్ ఛైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ధర్నాచౌక్‌నుంచి ర్యాలీగా బయలుదేరిన నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, యువ మోర్చా నేతలకు మధ్య వాగ్వివాదం.. తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఏలూరు రోడ్డులో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు వస్తుంది అంటూ నిరుద్యోగ యువతని చంద్రబాబు మోసం చేశారని, ఆయన వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కొడుకుకు తప్పితే రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. -
నిరుద్యోగభృతి కాదు..ఎన్నికల భృతే !
విజయవాడ: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల ప్రచారంలో బాబు వస్తే జాబ్ వస్తుందని, రుణమాఫీ చేస్తానని ప్రచారం చేశారు..అధికారంలోకి వచ్చాక మాట తప్పారని బీజేవైఎం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ నాయుడు విమర్శించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు వచ్చే అక్టోబర్ నుంచి ఇచ్చేది నిరుద్యోగ భృతి కాదని, ఎన్నికల భృతి మాత్రమేనని చెప్పారు. చంద్రబాబు నిరుద్యోగులకు చేసిన మోసాన్ని రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తామని వివరించారు. ఇంటికొక ఉద్యోగ హామీ ఊసే లేదు..రాష్ట్రంలో 2 లక్షల 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. బాబు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులను విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. లోకేష్‌కు తప్ప రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగం రాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 10 లక్షల మందికే నిరుద్యోగ భృతి అంటూ షరతులు విధించారని మండిపడ్డారు. -
టీడీపీ చిత్తుగా ఓడిపోతుంది: బీజేపీ
అమరావతి: రిజర్వేషన్లని సాకుగా చూపి ఎన్నికలు పెట్టకపోవడం చాలా దారుణమని, ఎన్నికలు పెడితే టీడీపీ చిత్తుగా ఓడిపోతుందని బీజేపీ నేషనల్ ఎక్జిక్యూటిమ్ మెంబర్ రమేష్ నాయుడు జోస్యం చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ..స్థానిక సంస్థల ఎన్నికల పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. ఓడిపోతామనే భయంతోనే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేయించిందని విమర్శించారు. స్పెషల్ ఆఫీసర్స్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. పంచాయితీల్లో స్పెషల్ ఆఫీసర్లకు అధికారం ఇస్తే అభివృద్ధి ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. గ్రామ సర్పంచులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని వెల్లడించారు. చంద్రబాబు స్థానిక సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
ఎన్నికలలోపే కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలలోపే కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రమేష్ నాయుడు అన్నారు. విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాకే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప ఉక్కు పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని, మరో నెల రోజుల్లో తేదీ కూడా ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీకి క్రెడిట్ రాకూడదనే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ వస్తే తెలుగుదేశం మనుగడ కష్టమని ప్లాంట్ రాకుండా అడ్డుపడుతోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారాయన. -
ఆ డబ్బు ఏంచేశారు పవన్..?
సాక్షి, విజయవాడ: దక్షిణాదిలో బిజెపి ఎదుగుదలను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని, దీనిలో మిత్రపక్షంగా వున్న టీడీపీ భాగస్వామ్యం కావడం బాధాకరమని బీజేవైఎం జాతీయ కార్యవర్గసభ్యుడు ఎన్. రమేష్ నాయుడు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కియా మోటార్స్ ఏర్పాటైన ప్రాంతంలో రైతుల భూములను టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు రాయలసీమ ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు. ‘కర్ణాటక, ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారు అధికంగా వున్న చోట్ల తమ పార్టీ నష్టపరిచేందుకు కుట్ర జరుగుతోంది. కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీలో జేఎఫ్‌సీలో అవుట్‌డేటెడ్ నేతలు, స్వయం ప్రకటిత మేథావులు వున్నారు. జేఎఫ్సీ నివేదిక కోసం నిర్వహించిన సమావేశం ఫార్స్. గతంలో పవన్ కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే వేదిక ఏర్పాటు చేసి, కోటి రూపాయలు కేటాయించినట్టు ప్రకటించారు. ఈ ఫోర్స్ ఏమయ్యింది? ఆ డబ్బు ఏం చేశారు? రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై పవన్ వైఖరి ఏమిటి? సీమ గోడు పవన్‌కు పట్టదా? పరిశ్రమలు పెట్టే ప్రాంతాల్లో రైతుల నుంచి టీడీపీ నేతలు భారీ కొనుగోళ్లు చేస్తున్నారు. కియా మోటార్స్ ప్రాంతంలో పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్ భూములు కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలోని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. సుమారు రెండు వందల కోట్ల విలువైన భూములు ఈ రకంగా తీసుకున్నారు. దీనిపై అన్ని ఆధారాలు మా వద్ద వున్నాయి. రైతులను భయపెట్టి 275 ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి, భూములను రైతులకు ఇప్పించాల’ని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం
ఇంటికి వచ్చిన స్నేహితునితో కలిసి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండాపోయాడు. ఈ సంఘటన మంగళవారం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవి కథనం ప్రకారం.. బాగ్ అంబర్‌పేట సాయిబాబా నగర్లో నివసించే కె. రమేష్‌నాయుడు(23) అతని భార్య శ్రీవిద్యతో ఉంటున్నాడు. ఇతను ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. కాగా ఈ నెల 24 వీరి ఇంటికి రమేష్ స్నేహితుడైన లక్ష్మణ్ వచ్చాడు. కాసేపు మాట్లాడుకొని ఇద్దరూ ఇంట్లో నుంచి పని ఉందంటూ బయటకు వెళ్లారు. అప్పటి నుంచి రమేష్‌నాయుడు తిరిగి రాకపోవడంతో అతని కోసం అన్నిచోట్లా వెదికారు. ప్రయోజనం లేకపోవటంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘తిండికి లేకే ఈ దొంగతనం చేస్తున్నా..’
ఇంటర్ నుంచే చోరీలు శంషాబాద్: పట్టణంలో తరచూ చోరీలకు పాల్పడుతూ ఇటు జనాన్ని, అటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఓ దొంగ ఎట్టకేలకు దొరికిపోయాడు. అతడి నుంచి 70 తులాల బంగారం, 50 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం శంషాబాద్ జోన్ డీసీపీ రమేష్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా విపనగండ్ల మండలం తూంకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన రత్లావత్ శంకర్‌నాయక్ (23) విపగండ్లలో ఇంటర్ చదువుతున్న 2012-2013 సమయంలో చోరీలబాట పట్టాడు. అదే ఏడాది అతనిపై అచ్చంపేట, వనపర్తి పోలీస్స్టేషన్లలో అతడు సుమారు 30 చోరీ కేసులు నమోదయ్యాయి. అనంతరం బీఫార్మసీలో చేరిన అతడు చదువును మధ్యలోనే ఆపేశాడు. మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లిన శంకర్‌నాయక్ గత మే నెలలో బెయిల్‌పై బయటకు వచ్చాడు. జల్సాలకు అలవాటుపడిన అతడు రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్‌లోని ఓ అపార్టుమెంట్లో ఖరీదైన డబుల్‌బెడ్ రూం ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని లగ ్జరీగా జీవిస్తున్నాడు. రెండు నెలలుగా శంషాబాద్, షాద్‌నగర్, కొత్తూరు మండలాల్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఇటీవల శంషాబాద్‌లో ఎనిమిదిసార్లు పలు ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలు చేయడంతో స్థానికులు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ‘తిండికి లేకే ఈ దొంగతనం చేస్తున్నా..’ శంషాబాద్‌లోని ఓ ఇంట్లో శంకర్‌నాయక్ డాక్యుమెంట్లకు సంబంధించిన బ్యాగును అపహరించుకుపోయాడు. అనంతరం ‘నాకు తిండికి లేకే ఈ దొంగతనం చేస్తున్నా’నంటూ ఓ లేఖను రాసి పెట్టి తిరిగి సదరు పత్రాలు ఆ ఇంట్లోనే వదిలేసి వెళ్లాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో 2 ఇళ్లలో, అదే జిల్లా కొత్తూరులో 4 ఇళ్లలో శంకర్‌నాయక్ చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. చోరీ సొత్తును శంకర్‌నాయక్ తనకు పరిచయమున్న నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన కట్రాజ యాదయ్య, అంకతి నాగరాజులకు ఇచ్చేవాడు. వాళ్లు బంగారం, వెండిని ముత్తూట్, మణప్పురం తదితర ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఇచ్చేవారు. పోలీసులు వారిపై కూడా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. శంకర్‌నాయక్ నుంచి 70 తులాల బంగారం, 50 తులాల వెండితో పాటు ఓ హోండా యాక్టివా వాహనం, ఓ టీవీని స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువ మొత్తం రూ. 8.25 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు.. శంకర్‌నాయక్‌కు ఓ ప్రియురాలు ఉంది. ఆమెను ఇంప్రెస్ చేసేందుకు చోరీలు చేశాడని విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు అతడు లగ్జరీ జీవితం గడిపేవాడు. ఈక్రమంలోనే చోరీల బాటపట్టాని తెలిసింది. ఇలా దొరికిపోయాడు..! రెండురోజుల క్రితం స్థానికంగా చేపట్టిన వాహనాల తనిఖీల్లో శంకర్‌నాయక్ హోండా యాక్టివా మీద వెళ్తూ పోలీసులు అనుమానాస్పద స్థితిలో దొరికిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా పైవిషయాలు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని రిమాండుకు తరలించారు. ఈ సమావేశంలో ఏసీపీ సుదర్శన్, సీఐ సుధాకర్, డీఐ సుదర్శన్‌రెడ్డి, డీఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. -
సీఎం రమేష్‌పై తెలుగుతమ్ముళ్ల ఫైర్
సాక్షి ప్రతినిధి,కడప: రాజ్యసభ సభ్యుడు సీఎంరమేష్నాయుడుపై తెలుగుతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ విధేయత, కష్టపడ్డనేతలకు గుర్తింపు ఇవ్వకుండా డబ్బే అర్హతగా పార్టీ టికెట్లు కేటాయిస్తుండటంతో ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మర్యాద, గౌరవాన్ని నిలిపిన ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డికి టికెట్ నిరాకరణపై కార్యకర్తలు రగిలిపోతున్నారు. సీఎం రమేష్ పోట్లదుర్తి గ్రామానికి చెందిన వ్యక్తి. తన వ్యాపార కార్యకలాపాల ద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు చేరువయ్యారు. కాలక్రమేణ ఆయన కోటరీలో ఒక్కరిగా చేరిపోయారు. వైఎస్సార్ జిల్లాలో గ్రామస్థాయికి పరిమితమైన సీఎం రమేష్ ఒక్కమారుగా టీడీపీలో ప్రముఖవ్యక్తిగా మారారు. ఈపరిణామాన్ని ఇతర జిల్లా వాసు లు జీర్ణించుకున్నా, వైఎస్సార్ జిల్లా వాసులకు అంతగా రుచించడం లేదు. ఫ్యాక్షన్‌కు ఎదురొడ్డి కుటుంబాలను త్యాగం చేసుకుని, ఆస్తులను కర్పూరంలా కరిగించుకుని పార్టీ అభివృద్ధే ధ్యేయంగా పయనిస్తున్న నాయకులకంటే పైరవీకారులకే విలువ ఉండటంపై పలువురు తీవ్రం గా తప్పుబడుతున్నారు. ఆ కోవలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ రెండాకులు ఎక్కుగానే ఉన్నారని తెలుగుతమ్ముళ్లు మదనపడుతున్నా రు. సీఎం రమేష్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసిన కారణంగా జిల్లాలో నలుగురు టీడీపీ టికెట్లు కోల్పోయిన ట్లు ఆపార్టీ సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైరవీకారులకే ప్రాధ్యాన్యత ఇస్తుండటంపై పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరికి చెక్..... పార్టీలు ఏవైనా ఒకప్పుడు జిల్లాలో గ్రూపు రాజకీయాలు నడిచాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రూపు, కందుల ఓబులరెడ్డి గ్రూపులు రాజకీయ కార్యకలాపాలు నిర్వహించేవి. 2004 ఎన్నికల వరకూ అదే ప్రామాణికంగా నేతలు వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంపికయ్యాక పార్టీలు, గ్రూపులు కనుమరుగయ్యాయి. పాతతరం గ్రూపులు, వర్గాలు అభివృద్ధి, సంక్షేమం ముందు బలాదూర్ అయ్యాయి. ఈపరిస్థితుల్లో జిల్లా వాసి సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడు అయ్యాక ఆయన నేతృత్వంలో పార్టీ వ్యవహారాలు అధికమయ్యాయి. మూడు దశాబ్ధాలుగా వర్గ రాజకీయాల్లో ఆరితేరిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు కొంత అంటీముట్టనట్లు వ్యవహరించారు. సీఎం రమే ష్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే తాము వెళ్లా లా.. ఆయన మాకు జాతీయనేతనా.. అంటూ పలు సందర్భాలలో వ్యంగ్యంగా మాట్లాడినట్లు సమాచారం. అలాంటి భావనతోనే ఎమ్మెల్యే లింగారెడ్డి, మాజీ మంత్రి బ్రహ్మయ్య, కందుల రాజమోహన్రెడ్డిలాంటి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని మనస్సులో ఉంచుకున్న సీఎం రమేష్ ఒకరి తర్వాత మరొకరికి చెక్ పెట్టుకుంటూ వచ్చారు. చంద్రబాబు వద్ద మెప్పుకోసం పార్టీ నేతలపై వ్యతిరేకత, డ బ్బు కారణాలుగా చూపుతూ టీడీపీకి దూరం చేస్తూ వస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈ విధంగానే మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడుకు టికెట్ రానీయకుండా మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డికి దక్కేలా చేశారని ఆపార్టీ సీనియర్ నేతలు విశ్వసిస్తున్నారు. కందుల రాజమోహన్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా కడప పార్లమెంటుకు నాన్‌లోకల్ అయినా శ్రీనివాసులరెడ్డికి దక్కేలా చేశారని, మాజీ మంత్రి బ్రహ్మయ్యను కాదని డబ్బున్న మేడా మల్లికార్జునరెడ్డిని, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఏకైక ఎమ్మెల్యే లింగారెడ్డికి సైతం డబ్బే కారణంగా చూపెట్టి టికెట్ రానీయకుండా చేసి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి టికెట్ కేటాయించేలా వ్యవహరించారు. లింగారెడ్డికి తీవ్ర పరాభవం.... రెండున్నర దశాబ్ధాలుగా ప్రజాజీవితంలో ఉంటూ పోరాటం చేసిన లింగారెడ్డి 2009లో టీడీపీ టికెట్ ద్వారా తనజీవితాశయమైన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ ప్రత్యర్థి వరదరాజులరెడ్డిని 16వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. లింగారెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికీ అధికారపార్టీ ముసుగులో వరదరాజులరెడ్డి అడుగడుగునా అడ్డుతగులుతూ వచ్చారు. నెలరోజుల క్రితం వరదరాజులరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మూడు దశాబ్ధాలుగా పార్టీనే ప్రాణప్రదంగా భావించిన లింగారెడ్డిని తప్పించి వరదకు అండగా నిలిచారు. ఈవైనాన్ని లింగారెడ్డి అనుచరులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. శుక్రవారం తెలుగుదేశపార్టీ జెండాలు, బ్యానర్లకు నిప్పుపెట్టారు. అధినేత చంద్రబాబు, సీఎం రమేష్‌పై శాపనార్థాలు పెట్టారు. గ్రామ స్థాయి నేత రమేష్‌కు రాజ్యసభ కేటాయించడంలో, వరదరాజులరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం వెనుక డబ్బుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని వాపోతున్నారు. -
కడప నగర టీడీపీలో రచ్చ..రచ్చ
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో ఉంటూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ తాము పాల్గొం టున్నామని, అటువంటి తమకు ఇప్పుడు స్థానం లేకుండా చేస్తున్నారని కడప తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు చిప్పగిరి మీనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి కడప నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించిన డివిజన్లకు సంబంధించిన టిక్కెట్లను పార్టీ మేయర్ అభ్యర్థి బాలకృష్ణయాదవ్, పార్టీ మైనార్టీ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు అమీర్‌బాబులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టించే వారిని కాదని, వలస వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పార్టీలోకి ఎర్రతివాచి పరిచి వారికి సీట్లు అమ్ముకునే సంస్కృతిని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కడప నగరంలోని మున్సిపాలిటీలో దళితులకు వచ్చిన రిజర్వేషన్ సీట్లలో ముక్కూమొహం తెలియని వారికి టిక్కెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు పార్టీ నగర మహిళా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్నాయుడుతోపాటు మిగిలిన నాయకులు కూడా కార్యకర్తల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా టిక్కెట్లు ఎలా కేటాయిస్తారని విమర్శించారు. సీఎం రమేష్‌నాయుడుకు కడప నగరం గురించి తెలియదని, ఇందులో జోక్యం చేసుకోవద్దని చెబుతున్నామన్నారు. పుత్తా నరసింహారెడ్డికి కడప ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్టీ నాయకులు వచ్చి సమాధానం చెప్పేవరకు విశ్రమించేది లేదని తెలుగు మహిళలు ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆందోళనలో నగర కార్యవర్గ నాయకులు దుర్గాప్రసాద్, ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ బదిలీకి బ్రేక్
కర్నూలు, న్యూస్‌లైన్: జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి బదిలీ వ్యవహారం ఉత్కంఠకు తెరపడింది. ఈయనను హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా బదిలీ చేసి రమేష్ నాయుడును జిల్లా ఎస్పీగా నియమిస్తూ గత నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. అయితే కర్నూలులో బాధ్యతలు చేపట్టి మూడున్నర మాసాలు గడవక మునుపే నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారంటూ ఎస్పీ కేంద్ర ప్రభుత్వ ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఎలాంటి ఆరోపణలు లేని ఐపీఎస్ అధికారిని రెండేళ్లలోపు బదిలీ చేయరాదనే నిబంధన నేపథ్యంలో క్యాట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ప్రకాషింగ్ కమిటీ, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా బదిలీ ఉండాలని క్యాట్‌లో ఎస్పీ తన వాదనను వినిపించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కారణాలను వెల్లడించకపోవడంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రఘురామిరెడ్డినే ఎస్పీగా కొనసాగించాలని క్యాట్ ఆదేశించింది. ఎస్పీ బదిలీ నేపథ్యంలో సంబరాలు చేసుకున్న సొంత శాఖలోని ఆయన వ్యతిరేకులు, కొందరు రాజకీయ నాయకులు తాజా తీర్పును జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొంది. -
ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా బాధ అనిపిస్తుంది : ఎస్.పి.శైలజ
‘అలివేణీ... ఆణిముత్యమా...’ ‘ముద్దమందారం’లోని ఈ పాట వినగానే... అంతులేని ఆనందోద్వేగం గుండెల్లో ఉబికి... కళ్లలోంచి నీటిముత్యాలుగా దొర్లుతాయి. ‘శివరంజనీ... నవరాగినీ...’ ‘తూర్పుపడమర’లోని ఈ గీతం చెవిన పడితే... హృదయం ఉప్పొంగుతుంది. శరీరం రోమాంచితం అవుతుంది. ‘మనసా... తుళ్లిపడకే...అతిగా ఆశపడకే..’ వేటూరి అక్షరాలు స్వరాలంకృతమై ఈ రీతిగా పలకరిస్తే... వయసు కలవరిస్తుంది. మనసు పలవరిస్తుంది. మనిషిలోని అన్ని ఉద్వేగాలనూ ఇలా స్వరాలతో తట్టిలేపడం అందరికీ సాధ్యం కాదు. ఆ మేజిక్ కొందరికే సాధ్యం. ఆ కొందరిలో అగ్రగణ్యుడు రమేష్‌నాయుడు. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాకు రాగాభిషేకం చేసిన సంగీత జ్ఞాని ఆయన. అమ్మమాట, తాతామనవడు, దేవుడు చేసిన మనుషులు, దేవదాసు, తూర్పు పడమర, శివరంజని, ముద్దమందారం, మేఘసందేశం, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి, స్వయంకృషి... ఇలా చెప్పుకుంటూ పోతే... రమేష్‌నాయుడు హార్మోనియం నుంచి ఉద్భవించిన అద్భుతాలు ఎన్నో ఎన్నో ఎన్నెనో... నేడు ఆ సంగీత స్రష్ట జయంతి. రమేష్‌నాయుడు బయట ఎలా ఉన్నా... రికార్డింగ్ థియేటర్లో చండశాసనుడు. అనుకున్నట్టు అవుట్‌పుట్ రాకపోతే... ఎస్పీ బాలుని కూడా ఉపేక్షించేవారు కాదు. కానీ... ఎస్పీ శైలజ మాత్రం ఇందులో మినహాయింపు. ఆమెను మాత్రం ఏమీ అనేవారు కాదాయన. కారణం ఏంటో తెలుసా? శైలజ అచ్చం రమేష్‌నాయుడు అమ్మలా ఉంటారట. అందుకే.. ధైర్యాన్నిచ్చి, బుజ్జగించి మరీ నెమ్మదిగా పాడించేవారు. శైలజ అంటే రమేష్‌నాయుడుకి ఎంత ఇష్టమంటే... చివరిఘడియల్లో శైలజ చేతులమీదుగా తులసితీర్ధం తీసుకొని కన్నుమూయాలనుకునేంత. అందుకే... ఆ సంగీతచక్రవర్తి జయంతి సందర్భంగా ‘సాక్షి’ రమేష్‌నాయుడు గురించి శైలజతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలివి. రమేష్నాయుడుగారితో మీ తొలి పరిచయం ఎలా జరిగింది ? అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నెల్లూరులో పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నయ్య సంగీత విభావరి కూడా ఏర్పాటుచేశారు. ఆ కార్యక్రమానికి అన్నయ్యతో పాటు రమేష్‌నాయుడుగారు కూడా వచ్చారు. అనుకోకుండా ఆ వేదికమీదే నేను పాట పాడాను. నా పాట ఆయనకు బాగా నచ్చేసింది. ‘అవకాశం వస్తే.. సినిమాల్లో పాడతావా తల్లీ...’ అనడిగారు. పాడతానని చెప్పాను. అన్న మాట ప్రకారం ఆయన స్వరాలందించిన ‘సూర్యపుత్రులు’ సినిమా కోసం తొలిసారి నాతో పాడించారు. సినీగాయనిగా నా రెండో సినిమా అది. నా కెరీర్ మొత్తంమీద రమేష్‌గారి నేతృత్వంలో దాదాపు ఓ 40 పాటలు పాడి ఉంటానేమో. రమేష్‌నాయుడుగారి సహచర్యంలో మీకు గుర్తుండి పోయిన అంశాలేమైనా ఉన్నాయా? ఒకటి కాదు. ఆయన సహచర్యంలో అన్నీ గొప్ప అనుభూతులే. ఆయన రికార్డింగ్ అంటే చాలు.. చాలా హ్యాపీగా ఫీలయ్యేదాన్ని. కారణం.. అందరితో ఆయన ఎలా ఉన్నా... నా విషయంలో మాత్రం కూల్‌గా ఉండేవారు. నాకు ఏ ఇబ్బందీ కలక్కుండా చూసుకునేవారు. ఓ సారి అన్నయ్య ఆయన్ను సూటిగానే అడిగేశారు. ‘ఏంటండీ... చిన్న చిన్న తప్పులకు కూడా మా అందర్నీ కోప్పడతారు.. కానీ మా చెల్లెల్ని మాత్రం ఏమీ అనరు. దేనికి?’ అని. అప్పుడు చెప్పారు... నేను అచ్చం వారి అమ్మగారిలా ఉంటానట. అందుకే.. నాతో కోపంగా మాట్లాడలేకపోయేవారాయన. ఆ విషయం మీకెప్పుడు తెలిసింది? తర్వాత అన్నయ్య ద్వారా తెలిసింది. రమేష్‌నాయుడుగారు కూడా తర్వాత నాకు ఆ విషయం చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఆయన చివరి ఘడియల్లో మీ చేతుల ద్వారా తులసితీర్థం తీసుకొని కన్నుమూయాలని కోరుకున్నారట. కారణం అదేనా? అదే కావచ్చు. అయితే... అప్పుడు నేను ఆయన వద్దకు వెళ్లలేకపోయాను. ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా బాధ అనిపిస్తుంది. కారణం... అప్పుడు నాకు టైఫాయిడ్. 104 జ్వరంతో ఉన్నాను. రమేష్‌నాయుడు చివరి ఘడియల్లో ఉన్నారని, పైగా నా చేతుల ద్వారా ఆయన వెళ్లిపోవాలనుకుంటున్నారని తెలిసి మా అన్నయ్య సహాయకులు విఠల్‌గారిని అడిగి... ఎలాగోలా ఆయన వద్దకు వెళ్లాను. అయితే... అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది. రమేష్‌నాయుడు స్వరాలందించిన పాటల్లో మీకు నచ్చిన పాట? చాలా ఉన్నాయి. కృష్ణగారి ‘దేవదాసు’ సినిమాలోని ప్రతి పాట ఓ ఆణిముత్యమే. అలాగే ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘మేఘసందేశం’ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో నాతో పాడించకపోయేసరికి చాలా బాధపడ్డాను. నా బాధ గమనించి ఆ సినిమా రీ-రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నాతో కొన్ని హమ్మింగులు అనిపించారు. టైటిల్స్‌లో కూడా నా పేరు వేయించారు. ఆ విధంగా ఆ బాధను పోగొట్టారాయన. అలాగే.. ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘రావు గోపాలరావు’ సినిమాలో అన్ని పాటలూ నాతోనే పాడించారు. అలాగే.. ‘ఆనందభైరవి’లోని ‘సుడిగాలిలో దీపం’ పాట కూడా నాకు మంచి పేరు తెచ్చింది. మీరు పాడిన పాటల్లో ఆయనకు ఇష్టమైన పాట? ‘మయూరి’లో నేను పాడిన ‘నీ పాదం ఇలలోన నాట్యవేదం’ పాటంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ సినిమాకు అన్నయ్య ఎస్పీబాలు సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఎప్పుడు కనిపించినా... ఆ పాట గురించే నాతో మాట్లాడేవారాయన. - బుర్రా నరసింహ -
నిమజ్జనానికి అప్రమత్తంగా ఉండాలి : సీవీ ఆనంద్
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ నిమజ్జనం ముగిసే వరకు అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో వినాయక మండపాల వద్ద గట్టి బందోబస్తుతో పాటు నిఘాను పెట్టారు. శివార్లలోని 20 నిమజ్జన కేంద్రాలను డీసీపీలు రవివర్మ, రమేష్‌నాయుడు, రంగారెడ్డి, శివకుమార్ తదితరులు శనివారం సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఇక ప్రతి మండపం వద్ద ముందు జాగ్రత్త చర్యగా బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేయిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని ఎల్బీనగర్, శంషాబాద్, బాలానగర్, మాదాపూర్, మల్కాజిగిరి జోన్ పరిధిల్లో సుమారు 10 వేలకు పైగా వినాయక మండపాలు ఏర్పాటయ్యాయి. ఆయా స్టేషన్ల వారీగా ప్రతి మండపం వద్ద బందోబస్తు కోసం సిబ్బందిని నియమించారు. అలాగే పెట్రోలింగ్‌ను సైతం పెంచారు. కొన్ని మండపాల్లోని గణేష్‌లను ఐదు రోజులకు నిమజ్జనానికి తరలిస్తుండగా, మిగతా మండపాలలోని విగ్రహాలను 11వ రోజు నిమజ్జనానికి తరలించనున్నారు. నిమజ్జనం సాఫీగా సాగేందుకు కమిషనరేట్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారుల సహాయంతో 19 నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం వద్ద కావాల్సిన క్రేన్లు, సహాయక కేంద్రం, ఫైర్, జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. నిమజ్జన కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేకంగా క్యాంప్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్యాంప్‌లను జాయింట్ పోలీసు కమిషనర్ శివప్రసాద్‌తో పాటు ఆయా జోన్ల డీసీపీలు రవివర్మ, రమేష్‌నాయుడు, రంగారెడ్డి, శివకుమార్‌లు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 18న జరిగే సామూహిక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నిమజ్జన కేంద్రాలు ఇవే... ఐడీపీఎల్ చెరువు, హస్మత్‌పుర చెరువు, సఫిల్‌గూడ చెరువు, సరూర్‌నగర చెరువు, ఐడీఎల్ట్యాంక్, అల్వాల్ చెరువు, బాలాజీనగర్ చెరువు, కౌకూర్ చెరువు, షామీర్పేట చెరువు, సూరారం చెరువు,లింగంచెరువు, వెన్నెలగడ్డ చెరువు, ప్రగతినగర్ చెరువు, కాప్రా చెరువు, కీసర చెరువు, పూడురు చెరువు, ఎల్లమ్మపేట చెరువు, దుర్గంచెరువు, హిమాయత్‌నగర్ చెరువు, మేకంపూర్ చెరువు.