
పవన్ కళ్యాణ్, ఎన్. రమేష్ నాయుడు
సాక్షి, విజయవాడ: దక్షిణాదిలో బిజెపి ఎదుగుదలను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని, దీనిలో మిత్రపక్షంగా వున్న టీడీపీ భాగస్వామ్యం కావడం బాధాకరమని బీజేవైఎం జాతీయ కార్యవర్గసభ్యుడు ఎన్. రమేష్ నాయుడు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కియా మోటార్స్ ఏర్పాటైన ప్రాంతంలో రైతుల భూములను టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు రాయలసీమ ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు.
‘కర్ణాటక, ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగువారు అధికంగా వున్న చోట్ల తమ పార్టీ నష్టపరిచేందుకు కుట్ర జరుగుతోంది. కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీలో జేఎఫ్‌సీలో అవుట్‌డేటెడ్ నేతలు, స్వయం ప్రకటిత మేథావులు వున్నారు. జేఎఫ్‌సీ నివేదిక కోసం నిర్వహించిన సమావేశం ఫార్స్. గతంలో పవన్ కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే వేదిక ఏర్పాటు చేసి, కోటి రూపాయలు కేటాయించినట్టు ప్రకటించారు. ఈ ఫోర్స్ ఏమయ్యింది? ఆ డబ్బు ఏం చేశారు? రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై పవన్ వైఖరి ఏమిటి? సీమ గోడు పవన్‌కు పట్టదా?
పరిశ్రమలు పెట్టే ప్రాంతాల్లో రైతుల నుంచి టీడీపీ నేతలు భారీ కొనుగోళ్లు చేస్తున్నారు. కియా మోటార్స్ ప్రాంతంలో పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్ భూములు కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలోని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. సుమారు రెండు వందల కోట్ల విలువైన భూములు ఈ రకంగా తీసుకున్నారు. దీనిపై అన్ని ఆధారాలు మా వద్ద వున్నాయి. రైతులను భయపెట్టి 275 ఎకరాలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి, భూములను రైతులకు ఇప్పించాల’ని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment