సాక్షి, అమరావతి : బీజేపీ జాతీయాధ్యక్షుడి హోదాలో అమిత్‌షా లేఖ రాస్తే అది అవమానమేలా అవుతుందని బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీతోపాటు వామపక్ష పార్టీలపై మండిపడ్డారు.
‘అమిత్ షా.. సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తే టీడీపీ నేతలు దాన్నేదో తప్పులా చూస్తున్నారు. ఏపీ అసెంబ్లీ పూర్తిగా తెలుగు దేశం కార్యకర్తల సమన్వయ సమావేశంగా మారింది. సభలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా.. పార్టీ వ్యవహారాలను.. అమిత్ షా లేఖ గుర్చించి ఎలా చర్చిస్తారు?.బీజేపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు మాట్లాడకుండా టీడీపీ ఏం మాట్లాడుతుంది? కుర్చీలు వేస్తే మేము కూడా మాట్లాడుతాం. అమరావతిలో అన్ని కార్యాలయాలు కట్టినప్పుడు రాజధాని పూర్తయినట్లే కదా. మరి అలాంటప్పుడు అనవసరమైన ప్రకటనలు ఎందుకు?. సెంటిమెంట్.. అయింట్మెంట్.. అంటూ పాలన సాగిస్తున్నారు. నిధుల్లో ఒక్క రూపాయి లెక్క చూపలేదు. ఏపీకి ఇప్పటిదాకా ఇచ్చిన నిధులు వెనక పడిన ప్రాంతాలకు ఇచ్చినవి కాదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి టీడీపీ ఎన్నికలకు వెళ్లటం ఖాయం’ అని విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.
‘ఆధారాలుంటే మీడియాకు ఇవ్వండి’
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. ఆయన తనయుడు జైషాలపై అవినీతి ఆరోపణలు చేస్తూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అమిత్ షా అవినీతికి పాల్పడినట్లు మీ దగ్గర ఆధారాలు ఉంటే జాతీయ మీడియాకు ఇవొచ్చు కదా అని చంద్రబాబుకు ఆయన సూచించారు. ‘ఈ దేశంలో 11 మంది ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణ చేసినంత మాత్రాన వారు అవినీతి పరులు అయిపోరు. నిరూపణ కావాలి. మీ పార్టీ కి చెందిన వ్యక్తి స్టాంపుల కుంభకోణం కేసులో దోషిగా తేలిన వ్యక్తి.. ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. అది తెలుసు కదా!’ అని చంద్రబాబుకు చురకలు అంటించారు.
‘పవన్.. గౌరవం పొగొట్టుకోకండి’
వామపక్ష పార్టీలతో కలిసి పని చేస్తే ఏపీలో ఉన్న అంతో.. ఇంతో గౌరవాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుందని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌కు విష్ణువర్ధన్ సూచించారు. ఎమ్మెల్యేగా పని చేసిన రామకృష్ణ లాంటి వ్యక్తి ప్రధాని మోదీపై వ్యక్తిగత దూషణలు చేయడం సరైందేనా? పవన్ చెప్పాలన్నారు. ఇక లెఫ్ట్ పార్టీలు టెంట్ల కింద పార్టీలని.. ఓట్లు సీట్లు రావని విష్ణువర్దన్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment