సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలుగుదేశం పార్టీలోకి వివిధ నియోజకవర్గాల్లో పారాచూట్ నాయకులు దిగిపోవడంతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఎక్కడ నుంచో ఉన్నట్టుండి నియోజకవర్గాల్లో దిగిన వారితో స్థానిక నేతలు, మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి ఏమాత్రం పొసగడంలేదు.
పైగా.. ఈ పారాచూట్ నేతలకు ఉన్న ధనబలం, హంగు ఆర్భాటాలకే చంద్రబాబు ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ కోసం తాముపడ్డ కష్టాలు, చేసిన పనులన్నింటినీ మరచిపోయి ఇప్పుడు ఒక్కసారిగా బయట నుంచి ఎవరెవరినో తీసుకొస్తే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
కానీ, చంద్రబాబు మాత్రం వారిని ఏమాత్రం ఖాతరు చేయకుండా డబ్బున్న వారే తన దగ్గరకు రావాలని స్పష్టంగా చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలను కూడా పక్కనపెట్టి ఈ పారాచూట్ నేతలను ఇన్‌ఛార్జిలుగా ప్రకటిస్తున్నారు. దీంతో వీరికి.. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.
కాకినాడలో ‘సానా’ వర్సెస్ సీనియర్లు..
కాకినాడ ఎంపీ సీటు రేసులో వ్యాపారవేత్త సానా సతీష్ దూసు కురావడంతో సీని యర్ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లో ఏదో ఒక దాన్నుంచి పోటీచేసేందుకు రెడీగా ఉండడం, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మద్దతు ఆయనకే ఉండడం జ్యోతుల నెహ్రూ వర్గానికి మింగుడు పడడంలేదు. నెహ్రూ తన కుమారుడు నవీన్‌కుమార్‌తో ఎంపీగా పోటీచేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అసలు పార్టీలో సభ్యత్వం కూడా లేని సతీష్ అడ్డుపడడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
ఇక తుని నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యను ఉన్నట్టుండి తీసుకొచ్చి ఇన్‌ఛార్జిగా నియమించారు. దీంతో అప్పటివరకు ఇన్‌ఛార్జిగా ఉన్న యనమలకు వరుసకు సోదరుడైన కృష్ణుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒక దశలో ఆయన పార్టీకి దూరమయ్యేందుకు సిద్ధమయ్యారు. దివ్యను వ్యతిరేకిస్తూ ఆమె వర్గానికి చెందిన యనమల రాజేష్‌పై కృష్ణుడు వర్గం దాడి కూడా చేసింది.
ఈ విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు కుమార్తె పాము సత్యశ్రీ తెరపైకి రావడంతో ఇప్పటివరకు పార్లమెంటు ఇన్‌ఛార్జిగా ఉన్న బాలయోగి తనయుడు గంటి హరీష్ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
ఏలూరు ఎంపీ సీటుపై సిగపట్లు..
ఇక ఏలూరు జిల్లా చింతల పూడి అసెంబ్లీ నియో జకవర్గ ఇన్‌ఛార్జిగా ఎన్‌ఆర్‌ఐ సొంగా రోషన్‌ను నియమించడంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు భగ్గు మంటున్నారు. అలాగే, ఏలూరు పార్లమెంటు సీటు కోసం ఎన్‌ఆర్‌ఐ గొరుముచ్చు గోపాల్‌యాదవ్ ముందుకురావడంతో ఆ సీటు తమదేనని భావి స్తున్న మాగంటి బాబు, బోళ్ల కుటుంబీకులు ఆందోళనలో మునిగిపోయారు. గోపాల్ నాలుగు నెల లుగా లోకేశ్ పాదయాత్ర, చంద్రబాబు సభలకు ఫుల్‌పేజీ యాడ్స్ ఇస్తూ హడావిడి చేస్తుండడం, పార్టీ నేతలతో సంబంధం లేకుండా విడిగా తన హంగు ప్రదర్శిస్తుండడాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది.
గుడివాడ, గుంటూరులో గరం గరం..
మరోవైపు.. కృష్ణాజిల్లా గుడి వాడ ఇన్‌ఛార్జిగా ఎన్‌ఆర్‌ఐ వెనిగళ్ల రాముని నియమించడంతో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న రావి వెంకటేశ్వరరావు వర్గం ఆగ్రహంతో రగి లిపోతోంది. కేవలం ధన బలం ఉందనే కారణంతో నే రావిని కాదని వెనిగళ్లకు చంద్రబాబు సీటు ఖరా రుచేయడం పార్టీ వర్గాలను నివ్వెరపరిచింది. అలా గే, గుంటూరు ఎంపీ సీటు రేసులో ఎన్‌ఆర్‌ఐ పెమ్మ సాని చంద్రశేఖర్‌ను చంద్రబాబు రంగంలోకి దింపడం అక్కడున్న నేతలకు మింగుడుపడడంలేదు.
నాగబాబు ఎంట్రీతో అనకాపల్లిలో సీన్ రివర్స్..
ఇక అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా సీనియర్లను కాదని బయట ప్రాంతం నుంచి వచ్చిన బైరా దిలీప్‌కుమార్ పేరును తెరపైకి తీసుకొ చ్చారు. టీడీపీ కార్యక్రమాలకు, లోకేశ్ యువగళం యాత్రకు భారీగా ఖర్చుచేసిన దిలీప్ టీడీపీ, జనసేన పొత్తులో పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ను కూడా పక్కన పెట్టేలా పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎంట్రీ ఇచ్చారు.
దీంతో ఆ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి కుటుంబం ఆగ్రహంతో ఊగిపోతోంది. విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు ఎన్‌ఆర్‌ఐ గొంప కృష్ణను దిగుమతి చేయడంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వర్గం రగిలిపోతోంది. పార్వతీపురం అసెంబ్లీ ఇన్‌చార్జి కొత్తగా బోనెల విజయచంద్రను నియమించడంతో మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
పల్నాడులో భాష్యం ప్రవీణ్ హల్‌చల్..
పల్నాడు జిల్లాలో వ్యాపారవేత్త భాష్యం ప్రవీణ్ హడావుడితో సీనియర్ నేతలు మండిపడుతున్నారు. మొదట్లో ఆయన చిలకలూరిపేటపై దృష్టిపెట్టి మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఎసరు పెట్టడంతో పార్టీలో అలజడి రేగింది. కేడర్ ఆందోళనతో ప్రవీణ్‌ను చిల కలూరిపేట నుంచి తప్పించినా ప్రస్తుతం పెదకూరపాడు సీటును ఆయనకు ఇస్తామని చంద్రబాబు సూచనప్రాయంగా చెప్పడంతో అక్కడి ఇన్‌ఛార్జి కొమ్మాలపాటి శ్రీధర్ ఆందోళన చెందుతూ తన వర్గంతో సమావేశాలు నిర్వహిస్తూ ఏంచేయాలో చర్చిస్తున్నారు.
ఎన్నికల ఫండ్ ఇచ్చిన వ్యక్తికి అందలం
నెల్లూరు జిల్లా ఉదయగిరి అభ్యర్థిగా ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్‌ను దాదాపు ఖరారు చేశారు. లోకేశ్ సన్నిహితుడిగా ఉన్న ఆయన ఎన్‌ఆర్‌ఐల నుంచి ఎన్నికల ఫండ్ సేకరించి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన దెబ్బకు ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు సీటు నిరాకరించడంతో ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.
కావలి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డికి దాదాపు ఖరారుచేయడంతో అక్కడి ఇన్‌ఛార్జి సుబ్బానాయుడు, సీనియర్ నేత బీద రవిచంద్రలు గుర్రుగా ఉన్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఇటీవలే పార్టీలో తిరుగుతున్న డాక్టర్ థామస్‌కే సీటిస్తానని చంద్రబాబు ప్రకటించడంతో పలువురు సీనియర్ నాయకులకు మింగుడు పడడంలేదు.
కళ్యాణదుర్గం రేసులో కాంట్రాక్టర్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబుని పోటీకి దింపేందుకు అధిష్టానం ప్రయత్నిస్తుండడం సీనియర్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఉమ్మడి కడప జిల్లా బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేస్తున్న బొజ్జా రోశన్న పేరును అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన రాజకీయాల్లోకి రావడంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ అభ్యర్థిత్వం ప్రశ్నార్థకమైంది.
Comments
Please login to add a commentAdd a comment