భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను బతిమాలుకుని బామాలుకుని.. పొత్తు పెట్టుకున్న చంద్రబాబు కూటమికి ఆ పొత్తు వల్ల ఎంత లాభమో తెలీదు కానీ.. కోలుకోలేనంత నష్టం అయితే తప్పదని రాజకీయ పండితులు అంటున్నారు. ఉత్తరాంధ్రలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని నిర్ణయించుకున్న బీజేపీతో జట్టు కట్టినందుకు విశాఖ జిల్లాలో కూటమిపై గుర్రుగా ఉన్నారు ప్రజలు. ఇక బీజేపీ కేంద్రమంత్రులు ముస్లిం రిజర్వేషన్లపై బాహాటంగా చేసిన వ్యాఖ్యలు టీడీపీని చావుదెబ్బ తీయడం ఖాయం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. బీజేపీ ఉన్న కూటమికి ముస్లింలు ఓటు వేసే పరిస్థితే ఉండదంటున్నారు.
ఈ ఎన్నికల్లో ఓటమి చెందితే తెలుగుదేశం పార్టీ మనుగడే కష్టమని భావిస్తోన్న చంద్రబాబు ఒంటరి పోరాటానికి ధైర్యం చేయలేకపోయారు. ముందుగా జనసేన పార్టీతో జట్టు కట్టారు. ఆ తర్వాత బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ ద్వారా బీజేపీ నాయకత్వానికి రాయబారాలు పంపారు. తమతో పొత్తు పెట్టుకుంటే అడిగిన ఎంపీ సీట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. చాలా కాలం పాటు టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటూ వచ్చిన కమల నాథులు మొత్తానికి చంద్రబాబు పార్టీతో పొత్తుకు సై అన్నారు. నిజానికి ఏపీలో బీజేపీకి ఒక్క శాతం ఓట్లు మత్రమే ఉన్నాయి. అయినా చంద్రబాబు పట్టుబట్టి పొత్తు పెట్టుకోడానికి వేరే కారణాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.
టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరి సీట్ల సర్దుబాటు అయినా కూడా మూడు పార్టీల క్షేత్ర స్థాయి కార్యకర్తల మధ్య ఇంతవరకు సయోధ్య కుదరలేదని ఆయా పార్టీల నేతలే కంగారు పడుతూ వచ్చారు. మిత్ర పక్షాల కోసం పలు సీట్లలో అభ్యర్ధులను మార్చుకోవలసి వచ్చింది కూడా. మూడు పార్టీలు కలిసి బరిలో దిగినా కూడా శ్రేణుల్లో ఉండాల్సిన జోష్ ఇంకా రాలేదు. ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తూనే ఉంది. బీజేపీ-జనసేన పార్టీల్లో ఒరిజినల్ నేతలను పక్కన పెట్టి టిడిపి నేతలకే టికెట్లు ఇప్పించుకోవడం కూడా కూటమికి మైనస్సే అయ్యింది.
ఈ తలనొప్పులతోనే సతమతమవుతూ ఉంటే బీజేపీ కేంద్ర మంత్రుల ప్రచారం టీడీపీ, జనసేనలను లాగి లెంపకాయ కొట్టింది. ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని చంద్రబాబుకు స్పష్టం చేశారు. అదే విషయాన్ని మీడియా సమావేశంలోనూ చెప్పారు. బీజేపీ విధానం కారణంగా టీడీపీకి ముస్లిం ఓట్లు పడే అవకాశాలు పూర్తిగా పోయాయి. చంద్రబాబు పాలనలో ముస్లింలను ఏనాడూ పట్టించుకోలేదన్ విమర్శలు ఎలానూ ఉన్నాయి. అవి చాలవన్నట్లు ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన రిజర్వేషన్లకు ఎసరు పెట్టే బీజేపీతో అంటకాగుతోన్న టీడీపీకి ముస్లింలు ఓటు వేసే పరిస్థితులు ఉండనే ఉండంటున్నారు ముస్లిం మేధావులు.
ఇక ఉత్తరాంధ్రలోనూ ఓ సమస్య ఉంది. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు అయ్యల చేతుల్లో పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో ఆంధ్రులకు భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయని.. ఈ కర్మాగారాన్ని ప్రైవేటీకరించరాదని అందులో కోరారు జగన్. అంతే కాదు కర్మాగారం లాభసాటిగా నడవాలంటే ఏం చేయాలో కొన్ని సూచనలు, సిఫారసులను కూడా ఆ లేఖలో పొందు పర్చారు. ఉక్కు కార్మికుల ఉద్యమానికి సంఘీభావం వ్యక్తం చేశారు కూడా.
బీజేపీ మిత్ర పక్షమైన జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ గతంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై నోరు మెదపలేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం తాను కేంద్రంతో మాట్లాడి కార్మికులను ఆదుకుంటానన్నారు. టీడీపీ నేత చంద్రబాబు కూడా అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును కాపాడతానన్నారు. అయితే విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తోన్న బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు తమ ప్రయోజనాలను పరిరక్షిస్తారన్న నమ్మకం ఉక్కు కార్మికుల్లో లేదంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. విశాఖ జిల్లాలో కనీసం ఆరేడు నియోజక వర్గాలపై ఉక్కు కార్మికుల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ-జనసేనలకు భారీ నష్టం తప్పదంటున్నారు రాజకీయ పండితులు.
-సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment