పొత్తు పేరుతో జనసేన ఉనికికే ఎసరు పెట్టిన టీడీపీ అధినేత
175 అసెంబ్లీ స్థానాల్లో ఇచ్చింది 21 మాత్రమే
రాయలసీమలోని 52 సీట్లలో దక్కింది రెండే
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో 4 మాత్రమే జనసేనకు
ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో జనసేనకు 12
విశాఖ జిల్లాలో 15 సీట్లలో ఇచ్చింది మూడే..
ఇలా రెండు, మూడు జిల్లాలకే జనసేనను పరిమితం చేసిన బాబు.. వీటిలోనూ
జనసేన నాయకులకు దక్కిన సీట్లు చాలా తక్కువ
అధిక భాగం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే సీట్లు
మనకేదీ ప్రాధాన్యత అంటూ ప్రశ్నిస్తున్న అభిమానులు
పవన్‌కు చెప్పుకుందామన్నా స్పందన లేక నిరాశ
బాబుతో పొత్తున్న పార్టీలు ఎదగలేవంటూ ఆవేదన
సాక్షి, అమరావతి: చంద్రబాబుతో పొత్తు అంటే ఇలాగే ఉంటుంది మరి! ఆయన పార్టీ టీడీపీ తప్ప మిత్రపక్షంలోని ఏ పార్టీకి అయినా ఆ తర్వాత పట్టేది అధోగతే. గతంలో వామపక్షాలు, బీజేపీ.. ఇప్పుడు జనసేన. పార్టీ ఎదుగదల దశలోనే జనసేనను చంద్రబాబు చిదిమేశారు. పొత్తుల పేరుతో ఆ పార్టీని రెండు ఉమ్మడి జిల్లాలకే పరిమితం చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను ఓ బొమ్మలా మార్చేసుకొని, రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 21 మాత్రమే ఇచ్చి, మమ అనిపించేశారు. రాష్ట్రంలో ఒక బలమైన సామాజికవర్గంలో ఎక్కువ మంది రాజకీయాల్లో ప్రాధాన్యత కోసం పవన్ కళ్యాణ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అలాంటి పార్టీని చంద్రబాబు వ్యూహాత్మకంగా దెబ్బతీసి, పొత్తుల పేరుతో ఉప ప్రాంతీయ పార్టీకన్నా తక్కువ స్థాయికి దిగజార్చారని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాయలసీమ ప్రాంతంలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉండగా, జనసేనకు ఇచ్చిన నియోజకవర్గాలు తిరుపతి, రైల్వే కోడూరు మాత్రమే. ఉమ్మడి శ్రీకాకళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు.. ఈ ఆరు జిల్లాల పరిధిలో 74 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 4 మాత్రమే జనసేనకు వచ్చాయి. ఈ నాలుగింటిలోనూ నెల్లిమర్ల, తెనాలి సీట్లను మాత్రమే జనసేన అధికారికంగా ప్రకటించింది. ఇంకా పాతపట్నం, అవనిగడ్డ స్థానాలు జనసేనకే అని చెబుతున్నప్పటికీ, అధికారికంగా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇలా 126 స్థానాలు (70 శాతానికి పైగా అసెంబ్లీ స్థానాలు) ఉన్న ఈ 10 ఉమ్మడి జిల్లాల్లో జనసేనకు వచ్చిన నియోజకవర్గాలు ఆరు మాత్రమే. అంటే.. కనీసం జిల్లాకు ఒకటి కూడా ఇవ్వలేదు. మిగిలిన మూడు ఉమ్మడి జిల్లాల్లో 34 స్థానాలు ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో 12 చోట్ల జనసేన పోటీ చేస్తోంది. ఈ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చింది ఈ రెండు జిల్లాల్లోనే. అదీ.. ఉన్న సీట్లలో మూడో వంతుకంటే తక్కువే. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని 15 స్థానాల్లో మూడు చోట్ల మాత్రమే జనసేన పోటీ చేస్తోంది. అంటే ఐదో వంతు స్థానాలతో సరిపెట్టారు.
నాయకుల గోడు పార్టీ అధినేత సైతం వినే పరిస్థితి లేక..
పొత్తులో జనసేన పార్టీకి దక్కినవే 21 అసెంబ్లీ సీట్లు. వీటిలోనూ జనసేన నేతలకు అన్యాయమే జరిగింది. ఇటీవలి కాలంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ఈ స్థానాల్లో ఎక్కువ భాగం దక్కాయి. భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి 2019 ఎన్నికల్లో పవన్‌కు ప్రత్యర్థిగా పోటీ చేసిన టీడీపీ నేతే కావడం గమనార్హం. మరోవైపు జనసేన పార్టీకి రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించగా, అందులో మచిలీపట్నం నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బాలÔౌరి రెండు నెలల క్రితమే పార్టీలో చేరారు. ఇలా సీట్ల సంఖ్యలోనే కాదు.. పార్టీ నేతలకు న్యాయం చేయడంలోనూ జనసేన దెబ్బతింది. దీంతో పార్టీలో నియోజకవర్గ, ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
ఇంతకాలం పార్టీకి పనిచేస్తే తమకు ఉన్న ప్రాధాన్యత ఏమిటంటూ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక, నాయకులు మౌనం వహిస్తున్నారు. 2019లో 24,248 ఓట్లు వచ్చిన భీమిలి నియోజకవర్గంలో ఈసారి జనసేన ఎందుకు పోటీ చేయడంలేదని అక్కడ టికెట్ ఆశించిన నాయకుడిని స్థానిక కార్యకర్తలు ఓ సమావేశంలో నిలదీశారు. వారికి సమాధానం చెప్పలేక ఆయన సమావేశం కొనసాగినంత సేపు తలదించుకొని ఉన్న వీడియో సోషల్ మీడియాలో రెండు మూడు రోజులుగా హల్‌చల్ చేస్తోంది. అదే విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేనకు గత ఎన్నికల్లో 22 వేలకు పైగానే ఓట్లు వచ్చాయి.
ఆ స్థానంలో అప్పుడు పోటీ చేసిన నాయకుడే మరోసారి పోటీ చేయాలని భావించారు. పొత్తులో ఆ స్థానం బీజేపీకి వెళ్లడంతో గత 15 రోజులుగా నిరసన దీక్షలు, ఆందోళనలు చేశారు. అయినా, పార్టీ నుంచి ఎవరూ పట్టించుకోకపోవడంతో ‘ఇంకేమి చేయాలి. ఎంత ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోకపోతే చివరకు ఆ ఏసుక్రీస్తుకే చెవిలో బాధ చెప్పుకున్నా’ అంటూ ఆయన మాట్లాడిన వీడియో సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తమ గోడును కనీసం పార్టీ అధినేత పవన్ కూడా వినే పరిస్థితి లేక చాలా నియోజకవర్గాల్లో నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొంటున్నారు.
మిత్రపక్షాలను మింగే అనకొండ.. అవకాశం ఉంటే...
తెలుగుదేశం పార్టీ అంటే మిత్రపక్షాలను మింగే అనకొండ అన్నది అందరికీ తెలిసిన విషయమే. 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆ«ంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి నాలుగు స్థానాల్లో గెలిచిందని.. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది 12 లోకసభ స్థానాలు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత రాష్ట్రంలోనూ ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. అందులో మూడు సార్లు బీజేపీ – టీడీపీ కలిసి పోటీ చేశాయి.
అయితే, 1998 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ, ఉమ్మడి ఏపీలో 18 శాతానికి ఓట్లు తెచ్చుకుంది. ఆ తర్వాత వరసగా రెండు విడతలు టీడీపీతో పొత్తు పెట్టుకొని, 2009 కల్లా మూడు శాతం ఓట్లకు దిగజారిపోయిందని జనసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. మళ్లీ ఐదేళ్ల విరామం అనంతరం 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని, ఒక శాతం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని ఆ నాయకులు తెలిపారు. పలుసార్లు టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్టులు సైతం రాష్ట్రంలో ప్రతి ఎన్నికలకు తమ ఓటు బ్యాంకు కోల్పోయారని విశ్లేíÙస్తున్నారు.
ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకొని, అధికారంలోకి వచ్చాక ఆ మిత్రపక్ష పార్టీలను వారికి సైతం తెలియకుండా మింగేసే చరిత్ర చంద్రబాబుదని తెలిపారు. ఇప్పుడు పొత్తులకు ముందే జనసేనను రెండు మూడు జిల్లాల ఉప ప్రాంతీయ పార్టీకన్నా తక్కువ స్థాయికి దిగజార్చిన చంద్రబాబు.. ఎన్నికల తర్వాత ఆ జిల్లాల్లోనూ జనసేనకు ఉనికే లేకుండా చేసే పరిస్థితే ఉంటుందని ఆ పార్టీ నాయకులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment