ఇచ్చిన 21 సీట్లలోనూ ఇష్టానుసారం మార్పులు
కొత్తగా పి. గన్నవరం జనసేనకు కేటాయించిన చంద్రబాబు
అక్కడ టీడీపీ అభ్యర్థిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో జనసేనకు కేటాయింపు
కూటమిలో ఇప్పటికీ 19 స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై అస్పష్టతే
అందులో రెండింటిలో జనసేన – టీడీపీ మధ్య అటూ ఇటూ మార్పులు
బీజేపీకి కేటాయించిన పది స్థానాల్లోనూ రెండింటిలో ఇదే పరిస్థితి
సాక్షి, అమరావతి: టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేనకు చంద్రబాబు ఇచ్చిందే ప్రాప్తం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తానంటే అవే మహా ప్రసాదంగా, ఏ సీటు ఇస్తానంటే దానినే పవన్‌కళ్యాణ్ స్వీకరించే పరిస్థితి కొనసాగుతోంది. నెల కిత్రం టీడీపీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన పి. గన్నవరం అసెంబ్లీ స్థానాన్ని ఇప్పుడు చంద్రబాబు వద్దనుకొని, జనసేనకు కేటాయించారు. ఆ స్థానంలో ప్రకటించిన టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్కడ తప్పనిసరిగా పార్టీ అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. దీంతో చంద్రబాబు పి.గన్నవరం సీటును జనసేనకు ఇచ్చేశారు.
అదీ అదనంగా కాదు.. అంతకు ముందు కేటాయించిన 21లో దీనినీ ఒకటిగా చేశారు. మరోవైపు.. క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు బలంగా కోరుకుంటున్న స్థానాలను మాత్రం ఆ పార్టీకి కేటాయించేందుకు చంద్రబాబు ఇష్టపడటం లేదు. వాటిపై ఎటూ తేల్చడంలేదు. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమిలో ఇప్పటికీ అభ్యర్థులు ఖరారు కాని భీమిలి, విజయవాడ వెస్ట్ వంటి స్థానాల కోసం జనసేన నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ జనసేన టికెట్టు కోరుకుంటున్న నాయకులే గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేశారు.
పొత్తులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కావాలని బీజేపీ కోరితే, చంద్రబాబు అది కాకుండా వెస్ట్ నియోజకవర్గం బీజేపీకి ఇచ్చి, ఇప్పుడు ఆ నియోజకవర్గంలో బీజేపీ, జనసేన నాయకుల మధ్య చిచ్చుపెట్టారు. భీమిలి స్థానాన్ని జనసేన గట్టిగా కోరుకుంటున్నా, చంద్రబాబు తేల్చడంలేదు. ఇలా జనసేన గానీ, పవన్ గానీ కోరుతున్న సీట్లను కాకుండా కేవలం టీడీపీ వద్దనుకునే సీట్లను మాత్రమే మిత్రపక్షాలుకు కేటాయిస్తున్నారని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది.
ఇంకా తేల్చని స్థానాలు 19
బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలతో కలిపి కూటమిలో ఇప్పటికీ 19 స్థానాలపై అస్పష్టత నెలకొంది. బీజేపీకి ఏ స్థానాలన్నది ఇప్పటికీ తేలలేదు. పాలకొండ, ఎచ్చెర్ల, పాడేరు, విశాఖ నార్త్, కైకలూరు, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, బద్వేలు, ఆదోని, ధర్మవరం స్థానాలు బీజేపీకి కేటాయించారన్న ప్రచారం సాగుతోంది. అయితే, ఈ స్థానాల్లో కనీసం రెండింటిలో మార్పులు ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
ఇంకా.. చీపురుపల్లి, భీమిలి, అవనిగడ్డ, దర్శి, అలూరు, గుంతకల్లు, రైల్వే కోడూరు, రాజంపేట, అనంతపురం అర్చన్ స్థానాల్లో ఎక్కడ ఏ పార్టీ పోటీ చేస్తుందన్నదీ తేలాల్సి ఉంది. వీటిలో చీపురుపల్లిలో టీడీపీనే పోటీ చేస్తుందని ఖాయంగా పార్టీ వర్గాలు చెబుతుంటే.. అవనిగడ్డలో జనసేనే పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కూటమిలో ఎవరికేమిటో తేలింది 156 సీట్లే..
రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. టీడీపీ మొదటి జాబితాలో 94, రెండో జాబితాలో 34, మూడో జాబితాలో మరో 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే, మొదట ప్రకటించిన పి. గన్నవరం స్థానాన్ని ఇప్పుడు జనసేనకు కేటాయించింది. జనసేన 21 స్థానాల్లో ఏడింటికి అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేసింది. అనధికారికంగా మరో 11 స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. గత నెల 24న చంద్రబాబుతో కలిసి నెల్లిమర్ల, తెనాలి, అనకాపల్లి, రాజానగరం, కాకినాడ రూరల్‌కు జనసేన అభ్యర్థులను పవన్ అధికారికంగా ప్రకటించారు.
తర్వాత నిడదవోలుకు అభ్యర్థిని ప్రకటించారు. పిఠాపురం నుంచి తానే పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. విశాఖ దక్షిణ, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పెందుర్తి, యలమంచిలి, ఉంగుటూరు, తిరపతి, రాజోలు స్థానాల్లో అభ్యర్థులను అనధికారికంగా నిర్ణయించి, వారికి మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ లెటర్ హెడ్‌పై పవన్ సంతకం చేసిన లెటర్లు అందజేశారు. కొత్తగా జనసేనకు వచ్చిన పి. గన్నవరానికి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను ఖరారు చేసి, ఆయన్ని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా నియమించారు.
పోలవరం స్థానంలోనూ జనసేనే పోటీ చేస్తుందని చెప్పి, అక్కడ చిర్రి బాలరాజును ఖరారు చేసి, ఆయనకూ ఎన్నికల నియమావళి, నిబంధనల పత్రాలను పవన్ శనివారం అందజేశారు. దీంతో జనసేనకు కేటాయించిన 21 స్థానాల్లో ఇంకా మూడు స్థానాలు, వాటిలో అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. టీడీపీ ప్రకటించిన 138 స్థానాలకు, జనసేన అధికారికంగా, అనధికారికంగా ఖరారు చేసిన 18 స్థానాలు కలిపి మొత్తం 156 స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్ధులు ఖరారయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment