సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన పొత్తు చర్చలు ఎటూ తేలడంలేదు. ఇప్పటికే పలుసార్లు సమావేశమై సమాలోచనలు జరిపిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు శనివారం మరోసారి మూడు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం రాత్రి పవన్, నాదెండ్ల మనోహర్‌తో చంద్రబాబు విందు సమావేశం నిర్వహించారు. చంద్రబాబు, లోకేశ్.. పవన్, నాదెండ్ల మాత్రమే ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తొలుత నలుగురు సమావేశమై పలు అంశాలపై చర్చించగా, ఆ తర్వాత చంద్రబాబు, పవన్ ఒకచోట, నాదెండ్ల, లోకేశ్ మరోచోట విడివిడిగా సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటుపై ఈ సమావేశంలోనూ స్పష్టత రాలేదని తెలిసింది. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించగా దాన్ని ఎప్పుడు, ఎక్కడ చేయాలనే దానిపై చర్చించారు. టీడీపీ గత మహానాడులో చెప్పిన ఆరు అంశాలతోపాటు జనసేన నుంచి మరిన్ని అంశాలతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించారు. సంక్రాంతి తర్వాత దీన్ని చంద్రబాబు, పవన్ కలిసి విడుదల చేయనున్నారు.
50 సీట్లు ఇవ్వండి..
అలాగే.. ఈ సమావేశంలో జనసేనకు ఇచ్చే సీట్లపైనే చర్చ జరిగింది. 50 సీట్లు కావాలని పవన్ చంద్రబాబును అడిగినట్లు సమాచారం. జిల్లాల వారీగా తాము కోరుతున్న సీట్లు, అక్కడ బలం, వచ్చే ఓట్ల గురించి పవన్ తన జాబితాను చంద్రబాబుకు ఇచ్చారు. కానీ, ఎన్ని సీట్లనే విషయాన్ని ఈ సమావేశంలోనూ చంద్రబాబు స్పష్టం చేయలేదు. సీట్ల సంఖ్య తేలకపోయినా ముందు ఉమ్మడి జాబితా ఇద్దామని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఒకవైపు వైఎస్సార్‌సీపీ మూడు జాబితాలు విడుదల చేసి దూకుడుగా వెళ్తుండగా తాము వెనుకబడిపోయామని వారు చర్చించుకున్నారు.
అందుకే వెంటనే ఏదో ఒక జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. 27 మందితో మొదట ఒక జాబితా విడుదల చేద్దామని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఇందులోనే టీడీపీ తరఫున 20 మంది వరకు ఉండేలా చూసుకుని, మిగిలిన స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించాలని ఒక అంచనాకు వచ్చారు. జనసేనకు తొలి జాబితాలో ఇచ్చే ఆ సీట్లపైనా సమావేశంలో చర్చించారు.
సంక్రాంతి పండుగ తర్వాత ఈ జాబితా విడుదల చేయనున్నారు. టీడీపీ నుంచి కొందరిని జనసేనకు పంపి అక్కడి సీట్లు ఇచ్చే ప్రతిపాదనలపైనా సమాలోచనలు జరిగాయి. బీజేపీతో పొత్తు అంశంపైనా మంతనాలు జరిపినట్లు సమాచారం. బీజేపీ ఇంకా ఏమీ తేల్చకపోవడంవల్ల సీట్ల సర్దుబాటు ఇబ్బందిగా మారిందని, దీనిపై త్వరలో నిర్ణయం వెలువడేలా చూడాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చంద్రబాబు, లోకేశ్, పవన్, నాదెండ్ల మాత్రమే ఉండడం చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment