జనసేనకు దూరమవుతున్న అభిమానులు
బలం లేదు కాబట్టే 24 సీట్లకు ఒప్పుకున్నామనడంపై ఆగ్రహం.. కాపుల్లో వ్యతిరేకత.. అంతర్మధనం
ఇన్నాళ్లూ ఓ అసమర్థుడి వెంట నడిచామన్న చేదు నిజాన్ని ఆలస్యంగా తెలుసుకున్నందుకు సిగ్గు పడుతున్నాం. కాపులకు రాజ్యాధికారం అనే ఆశ మళ్లీ చిగురిస్తోందని సంబర పడుతున్న వేళ ఏమిటీ ప్రేలాపనలు? ఇదేం స్ట్రాటజీ? ఇవేం ఎత్తుగడలు? కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారెవరైనా ఒక బహిరంగ సభలో ఇలా మాట్లాడతారా? ప్యాకేజీ స్టార్ అని వైసీపీ వాళ్లు అంటున్న మాట నిజమేనని ఆయన నోటే చెప్పకనే చెప్పారు. మా ఆశలను కూకటివేళ్లతో సహా పెకిలించేశారు. – సోషల్ మీడియాలో జనసేన అభిమానులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాతిని ఉద్ధరిస్తారని పవన్ కళ్యాణ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సామాజికవర్గం ఉడికిపోతోంది. ఆ వర్గాలు ఇక పవన్ కోసం కాపు కాయలేమంటున్నాయి. పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చంద్రబాబుతో చేసుకున్న రాజకీయ ఒప్పందం మేరకు లభించిన సీట్లతో ఆ సామాజికవర్గం విసుగెత్తిపోయింది. ఇక ముందు పవన్‌ను నమ్మి రాజకీయాలు చేయలేమని ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన అభిమానులు, కాపు సామాజికవర్గం వారు బహిరంగంగానే దుమ్మెత్తి పోస్తున్నారు.
టీజే (తెలుగుదేశం–జనసేన) ఉమ్మడి సభలో పవన్ దిగజారుడుతనం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఒక రాజకీయ పార్టీగా ఏం చేయాలో, ఏం చేయకూడదో సామాజికవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వృద్ధతరం మేధావులు సోదాహరణంగా వివరిస్తున్నా పవన్ పెడచెవిన పెట్టడం వారికి ఆవేదన కలిగించింది. పైగా ఆ పెద్దల మాటలు చెవి కెక్కించుకోకపోవడం అటుంచి, అటువంటి వారు తనకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరమే లేదని తెగేసి చెప్పడాన్ని కాపు సామాజిక వర్గంతో పాటు పవన్ అభిమానులు సైతం ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు.
రాజకీయ యవనికలో కుట్రలకు కేరాఫ్‌గా నిలిచే చంద్రబాబుతో సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు ప్రస్తావన వచ్చిన ప్రారంభంలోనే జనసేన నేతలు, పవన్ అభిమానుల్లో పెదవి విరుపు మొదలైంది. ఇందుకు చంద్రబాబుతో పవన్‌కు ఎదురైన అనుభవాలను వారందరూ ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ లెక్క పెట్టకుండా చంద్రబాబుతో పవన్ చేతులు కలిపారు.
వారందరిదీ అదే ఆవేదన
గౌరవప్రదమైన స్థాయిలో సీట్లు తీసుకునే అవకాశం పుష్కలంగా ఉన్నా కూడా, కాదని కాలదన్నుకోవడం పట్ల జనసేన శ్రేణులు, అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంఖ్యా బలానికి తగిన రీతిలో గౌరవప్రదమైన స్థానాలు దక్కలేదనే ఆవేదన ఆ సామాజికవర్గం అంతటా నెలకొంది. గోదావరి జిల్లాల్లో అపార రాజకీయ అనుభవం కలిగిన చేగొండి హరిరామజోగయ్య మొదటి నుంచీ ముఖ్యమంత్రి పదవితో పవర్ షేరింగ్, కనీసం 50 అసెంబ్లీ స్థానాలు సాధించుకోవాలని పలుమార్లు లేఖల ద్వారా చెబుతూనే ఉన్నారు. అలాగైతేనే జనసేన శ్రేణుల నుంచి ఓట్ షేరింగ్ ఉంటుందని, లేదంటే పొత్తు ధర్మం చిత్తు అవుతుందని అనేక సందర్భాల్లో కుండబద్దలు కొట్టారు.
తాజాగా కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా గురువారం బహిరంగ లేఖ ద్వారా అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటాలు చేసిన ముద్రగడ.. తాజా రాజకీయ పరిణామాలపై తొలిసారి పవన్‌ను ఉద్దేశించి ఈ లేఖ రాశారు. కాపు ఉద్యమం సందర్భంగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు కాపుల పైన, తన కుటుంబం పైన జరిపిన దాషీ్టకాలను సైతం దిగమింగుకుని పవన్‌కు మద్దతుగా నిలవాలని భావించానని చెప్పారు.
అంతేకాకుండా ఆయనతో కలసి పని చేసి రాష్ట్రంలో కొత్త రాజకీయ ఒరవడి సృష్టించాలని కలలుగన్న విషయాన్నీ తన లేఖలో ప్రస్తావించారు. పవన్ అభిమానులు ఆయనను ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటే ఆయన మాత్రం 24 సీట్లకు మాత్రమే అంగీకరించడంపై ముద్రగడ విస్మయం వ్యక్తంచేశారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం, ముందుగా రెండేళ్లు సీఎం, 80 అసెంబ్లీ సీట్లు కోరాల్సిందని ముద్రగడ తన మనసులో మాట బయటపెట్టారు.
బాబు మాటే పవన్‌కు శాసనం
పవన్ తీరుతో మరో చారిత్రక తప్పిదం జరిగిపోయిందని కాపులు అంతర్మ«థనం చెందుతున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టయ్యి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు జైలుకు వెళ్లి భరోసా ఇవ్వడం ద్వారా బాబు పరపతి పెరగడానికి పరోక్షంగా పవనే కారకులయ్యారు. కానీ ఆ స్థాయిలో సీట్లు తీసుకు రాలేకపోవడంతో పవన్‌పై పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలై ఆ సామాజికవర్గంలో అంతర్మధనం మొదలైంది. సీట్లు, ఓట్లు బదిలీ, పవర్ షేరింగ్ కోసం అడుగుతున్న వారిపై పవన్ మాటలతో ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితుల్లో ఓటు షేరింగ్ ఎందుకు చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు.
‘గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడించారు. ఎలక్షన్ అంటే డబ్బుతో కూడుకున్న పని. అంత సత్తా మనకు ఉందా? కనీసం మనం భోజనాలు పెట్టించలేం..’ అని ప్రశ్నిస్తూ.. పవన్ తనకు తానుగానే పార్టీ శ్రేణులు, అభిమానుల్లో నిస్సత్తువ ఆవరించే పరిస్థితికి కారకులయ్యారని విశ్లేషిస్తున్నారు. అభిమానులు, ఆ సామాజికవర్గం మునుపటి మాదిరిగా ఉత్సాహంగా తాడేపల్లిగూడెం సభకు వెళ్లిన దాఖలాలు లేకపోవడానికి పవన్ నిర్ణయాలే కారణమని కాపు సామాజికవర్గ నేతలు అంటున్నారు. చంద్రబాబు మాటే పవన్‌కు శాసనమైందని వాపోతున్నారు.
కనీసం 50 సీట్లు తీసుకుని ఉండాల్సింది
పొత్తులో భాగంగా జనసేన కేవలం 24 సీట్లకు పరిమితం కావడం నాలాంటి కాపు నాయకులకు ఇబ్బందిగా ఉంది. పవన్ జనసేన పార్టీ అధ్యక్షుడు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థాయికి తగినట్టుగా కనీసం 50 సీట్లు తీసుకుని ఉండుంటే మాకు సంతృప్తిగా ఉండేది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ప్రయాణిస్తున్న క్రమంలో సీఎం పదవిలో కూడా షేరింగ్ ఉండుంటే మేమందరం ఆనందించే వాళ్లం. కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్య ఆవేదన కూడా ఇదే.
– కల్వకొలను తాతాజీ, కాపు జేఏసీ నేత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
పవన్ నిర్ణయం సరికాదు
పవన్ కాపు జాతిని నిరాశ పరిచారు. ఎన్నో ఏళ్లుగా కాపులు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం. పవన్ ద్వారా సాధ్యమవుతుందని కలలు కన్నాం. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుని కేవలం 24 సీట్లలో పోటీకి సిద్ధమయ్యారు. ఇలాగైతే ఏ విధంగా సీఎం అవుతారు? చంద్రబాబుకు వత్తాసు పలకడానికే పవన్ ఉన్నట్టుంది. పవన్ నిర్ణయం సరికాదు. – కురుమళ్ల చిన్ని, కాపు నాయకుడు, కిర్లంపూడి, కాకినాడ జిల్లా
50–60 సీట్లు తీసుకోవాల్సింది
రాష్ట్ర జనాభాలో 22 శాతం కాపులు ఉన్నారు. కాపు వర్గం వారు ఏ రోజైనా సీఎం అవుతారని ఊహించాం. టీడీపీతో పొత్తులో భాగంగా 50–60 సీట్లు వరకు తీసుకుంటారని ఆశించాం. కానీ 24 సీట్లకే పరిమితమవడం నిరుత్సాహానికి గురిచేసింది. – గుండాబత్తుల శ్రీను గోవిందరావు, మామిడికుదురు మండల కాపు నాడు అధ్యక్షుడు, కోనసీమ జిల్లా
పవన్‌కు సీఎం పదవి ప్రకటిస్తారని ఆశించాం
కోస్తా జిల్లాల్లో ప్రాధాన్యత క్రమంలో అత్యధిక సంఖ్యలో కాపులు ఉన్నారు. పవన్ ద్వారా సీఎం పదవి వస్తుందని ఆశించాం. టీడీపీతో పొత్తు పేరిట 24 సీట్లకే పరిమితమయ్యారు. పొత్తులో భాగంగా పవన్‌కు సీఎం పదవిని ఏడాదో, రెండేళ్లో ప్రకటిస్తారనుకున్నాం. ఆయన ఎందుకు తగ్గి చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్నారో అర్థం కావడం లేదు. – వెలుగుబండి సుబ్బారావు, కాపు నాయకుడు, వాకలపూడి, కాకినాడ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment