అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు! | Pawan Kalyan opened a new chapter in Pithapuram Meeting | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు!

Published Tue, Nov 5 2024 4:09 AM | Last Updated on Tue, Nov 5 2024 12:56 PM

Pawan Kalyan opened a new chapter in Pithapuram Meeting

పిఠాపురం సభలో కొత్త అంకానికి తెర తీసిన పవన్‌కళ్యాణ్‌ 

శాంతి భద్రతల వైఫల్యాలతో సీఎం, డిప్యూటీ సీఎంకు సంబంధం లేదన్నట్లు పవన్‌ వ్యాఖ్యలు

నిజానికి శాంతి భద్రతల విభాగం ఉండేది ముఖ్యమంత్రి వద్దే కదా! 

అవి విఫలమయ్యాయంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు వైఫల్యం చెందినట్లు కాదా? 

పవన్‌ నిజంగానే నిజాయితీగా వ్యవహరించదలచుకుంటే నిలదీయాల్సింది చంద్రబాబునే కదా? 

దీనికి విరుద్ధంగా దళిత మంత్రి అనితపై నెపం వేయడం ఎవరిని రక్షించడానికి? 

మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, అకృత్యాలతో  వెల్లువెత్తుతున్న జనాగ్రహాన్ని తప్పించుకునే వ్యూహం 

పవన్‌ సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే.. తిరుపతి జిల్లాలో ఓ బాలికపై లైంగిక దాడి ఘటన 

గత ఐదేళ్లూ టీడీపీ – జనసేన వేర్వేరు పార్టీలైనా బాబు– పవన్‌ది ఒకే మాట, ఒకే నిర్ణయాలు

సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల పాత్రలో పరస్పరం సహకరించుకుంటూ అనేక రాజకీయ డ్రామాలను రక్తి కట్టించిన చంద్రబాబు – పవన్‌కళ్యాణ్‌ ద్వయం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను అనుసరిస్తోంది! కూటమి ప్రభుత్వంపై కొద్ది నెలల్లోనే తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు సరికొత్త డ్రామాకు తెర తీసింది!! రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో సర్కారు దారుణ వైఫల్యాలపై సామాన్య ప్రజలతో పాటు అధికార పక్షంలోనూ వ్యతిరేకత వెల్లువెత్తుతున్న విషయం విదితమే. 

శాంతి భద్రతల వైఫల్యంపై టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల నుంచి సైతం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్రతరమవుతున్న ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ తన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు, డిప్యూటీ సీఎంగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పవన్‌కళ్యాణ్‌ రాష్ట్ర ప్రజలను నమ్మించే యత్నాల్లో నిమగ్నమయ్యారు. 

దీనిపై ఆయన నిజంగానే నిజాయితీగా వ్యవహరించదలచుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా నిలదీసి ప్రశ్నించాలి. లేదంటే మంత్రివర్గంలో తనూ భాగమే కాబట్టి.. ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యత వహించాలి. అయితే అలాంటిదేమీ లేకుండా.. శాంతి భద్రతలను నేరుగా పర్యవేక్షించే ముఖ్యమంత్రిని ప్రశ్నించకుండా.. దళిత మహిళ అయిన హోంమంత్రి అనితపై నెపాన్ని నెట్టేసే విధంగా పవన్‌ మాట్లాడటాన్ని చూస్తుంటే.. కొత్త డ్రామాను రక్తి కట్టిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

సోమవారం పిఠాపురం పర్యటన సందర్భంగా గొల్లప్రోలు సభలో పవన్‌కళ్యాణ్‌ మాట్లాడిన మాటలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. ‘రాష్ట్రంలో మహిళలు, చిన్న పిల్లలపై లైంగిక దాడులు, అరాచకాలు మితిమీరిపోయాయి. పోలీసులు శాంతి భద్రతలను గాలికొదిలేసి మీనమేషాలు లెక్కిస్తున్నారు. బయటకెళ్లాలంటే ప్రజలు ఏం ప్రశ్నిస్తారో అని భయమేస్తోంది. మమ్మల్ని తిడుతున్నారు. 

వారికి సమాధానం చెప్పలేక బయటకు వెళ్లలేకపోతున్నాం. మూడేళ్ల బాలికపై హత్యాచారం జరిగితే పోలీసులు ఏమీ చేయలేకపోయారు. ఆడబిడ్డల మాన, ప్రాణ రక్షణకు తగిన చర్యలు తీసుకోమని ఎన్నిసార్లు చెబుతున్నా స్పందన కనిపించడం లేదు. ఎమ్మెల్యేలు ఇసుకలో లాభాలు చూసుకుంటున్నారేగానీ అరాచకాలను ప్రశ్నించడం లేదు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఆడపిల్లలను ఇబ్బందులు పెడుతుంటే కూటమి ఎమ్మెల్యేలు ఎప్పుడైనా పట్టించుకున్నారా?’ అని తాజాగా పవన్‌ వ్యాఖ్యలు చేశారు.  

అయితే శాంతి భద్రతల వైఫల్యానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకుగానీ,  ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనకు గానీ ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా.. హోంమంత్రి అనిత ఇందుకు బాధ్యత వహించాలంటూ పవన్‌కళ్యాణ్‌ ఆ సభలో డిమాండ్‌ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.  

అందుకు బాధ్యత బాబుదే కదా..! 
హోంమంత్రి అనిత అయినప్పటికీ వాస్తవానికి శాంతి భద్రతల విభాగం పూర్తిగా ముఖ్యమంత్రి ఆ«దీనంలో కొనసాగుతుంది. మూడేళ్ల చిన్నారులపై అత్యాచారాలు జరిగినా, ఆడబిడ్డలపై లైంగిక దాడులు, హత్యాచారాలు చోటు చేసుకున్నా అవన్నీ రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం కిందకే వస్తాయి. అలాంటప్పుడు ఉప మఖ్యమంత్రి మాట్లాడిన మాటల ప్రకారమే.. శాంతి భద్రతల శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ వైఫల్యాలకు పూర్తి బాధ్యత వహించాలి. 

ఇందుకు విరుద్ధంగా మహిళా మంత్రి, పైపెచ్చు దళిత మంత్రి అయిన హోంమంత్రి అనిత వీటికి బాధ్యత తీసుకోవాలని పవన్‌కళ్యాణ్‌ డిమాండ్‌  చేయడం విచిత్రంగా ఉందని పలువురు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘హోంశాఖ మంత్రిగా మీరు బాధ్యత వహించండి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, హత్యలను పట్టించుకోండి. నేను హోంశాఖను తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. నేను అడగలేక కాదు.. హోంశాఖ తీసుకోలేక కాదు. నేను హోంశాఖ తీసుకున్నానంటే పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి’ అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలు తోడుదొంగల డ్రామాను బహిర్గతం చేస్తున్నాయని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. 

అప్పుడు భీషణ ప్రతిజ్ఞలు.. ఇప్పుడు భయమేస్తోందంటూ! 
ఎన్నికల్లో చంద్రబాబుతో కలసి కూటమిగా పోటీ చేసిన పవన్‌కళ్యాణ్‌ పలు సభల్లో ఆయన తరపున కూడా తానే హామీలిచ్చేశారు. ‘రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ఏ ఆడ్డబిడ్డపైనా అఘాయిత్యం జరగకుండా బలమైన చట్టాలు తెస్తాం..’ అని ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలపై వరుసగా అఘాయిత్యాలు, చిన్నారులపై అకృత్యాలు జరుగుతున్నా పవన్‌కళ్యాణ్‌ కనీసం ఖండిస్తూ ప్రకటనలు కూడా ఇవ్వలేదని సర్వత్రా విమర్శలున్నాయి. 

జరుగుతున్న పరిణామాలపై ప్రజలు తమను తిడుతున్నారని.. జనంలోకి వెళ్లాలంటే భయమేస్తోందని పవన్‌ స్వయంగా పిఠాపురం సభలో చెప్పారు. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకతను హోంమంత్రి పైకి మళ్లించి వైఫల్యాల నుంచి చంద్రబాబు, తాను బయట పడే వ్యూహాన్ని పవన్‌కళ్యాణ్‌ ఎంచుకున్నారు. ప్రభుత్వమంటే.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రివర్గం మొత్తానిది ఉమ్మడి బాధ్యత అని గుర్తులేదా? పవన్‌కళ్యాణ్‌ తాజా వ్యాఖ్యలు ప్రకారం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందంటే.. మంత్రివర్గం మొత్తం వైఫల్యం కిందకే వస్తుందని రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement