సాక్షి, హైదరాబాద్ : ఏపీలో ప్రస్తుతం ఉన్న కరువు, తుపాను పరిస్థితుల పట్ల బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు రమేష్ నాయుడు స్పందించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రతతో నీళ్లు అడుగంటిపోతున్నాయన్నారు. వందల అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్లు పడక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. రాయలసీమలో తాగడానికి నీళ్ల కోసం మహిళలు కిలోమీటర్ల మేర నడిచి వెళ్తున్నారన్నారు. గుంటూరు తదితర ప్రాంతాల్లో పశుగ్రాసాలు లేక మూగ జీవాలు అల్లాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కరువు ప్రాంతాల గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరాలు అందించాలని బీజేపీ కోరుతుందన్నారు. నకిలీ విత్తనాలతో పత్తి దిగుబడి చాలా తగ్గిపోయిందని తెలిపారు. ప్రభుత్వం సర్టిఫై చేసిన కంపెనీలు నకిలీ విత్తనాలు ఇవ్వడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఫొని తుపాను బారిన పడిన నాలుగు రాష్ట్రాలకి కేంద్రం రూ. 1000 కోట్లు కేటాయించిందని తెలిపారు. దీనిలో ఆంధ్రప్రదేశ్‌కి రూ. 250 కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ నిధుల్ని సక్రమంగా ఉపయోగించాలని కోరారు. ఓడిపోతానని స్పష్టంగా తెలిసిపోయింది కాబట్టే చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment