draught situation
-
‘ఏపీకి రూ. 250 కోట్లు వస్తాయి’
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో ప్రస్తుతం ఉన్న కరువు, తుపాను పరిస్థితుల పట్ల బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు రమేష్ నాయుడు స్పందించారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రతతో నీళ్లు అడుగంటిపోతున్నాయన్నారు. వందల అడుగుల లోతు బోర్లు వేసినా నీళ్లు పడక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. రాయలసీమలో తాగడానికి నీళ్ల కోసం మహిళలు కిలోమీటర్ల మేర నడిచి వెళ్తున్నారన్నారు. గుంటూరు తదితర ప్రాంతాల్లో పశుగ్రాసాలు లేక మూగ జీవాలు అల్లాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరువు ప్రాంతాల గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరాలు అందించాలని బీజేపీ కోరుతుందన్నారు. నకిలీ విత్తనాలతో పత్తి దిగుబడి చాలా తగ్గిపోయిందని తెలిపారు. ప్రభుత్వం సర్టిఫై చేసిన కంపెనీలు నకిలీ విత్తనాలు ఇవ్వడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఫొని తుపాను బారిన పడిన నాలుగు రాష్ట్రాలకి కేంద్రం రూ. 1000 కోట్లు కేటాయించిందని తెలిపారు. దీనిలో ఆంధ్రప్రదేశ్‌కి రూ. 250 కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ నిధుల్ని సక్రమంగా ఉపయోగించాలని కోరారు. ఓడిపోతానని స్పష్టంగా తెలిసిపోయింది కాబట్టే చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. -
కరువుకు ప్యాంటు, షర్టు వేస్తే ఆయనే!
కరువుకు ప్యాంటు, షర్టు వేస్తే అదే చంద్రబాబు అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, వాటిని ప్రశ్నించని ఏపీ సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో చేస్తున్న 'జలదీక్ష' రెండోరోజున జగన్‌కు మద్దతుగా వచ్చిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడారు. చంద్రబాబుతో పాటే రాష్ట్రంలో మళ్లీ కరువు వచ్చిందని, గతంలో తొమ్మిదేళ్లు.. ఇప్పుడు రెండేళ్లుగా కరువుతో అల్లాడుతున్నామని అన్నారు. ఏ ముహూర్తాన చంద్రబాబు సీఎం అయ్యారో ఆ రోజు నుంచి కరువుతో బాధపడుతున్నామని చెప్పారు. ఆయన కృష్ణా జిల్లాకు వెళ్లారు, డెల్టా మొత్తం ఎడారిలా మారిపోయిందని, లింగమనేని గెస్ట్‌హౌస్‌లో ఉంటే ప్రకాశం బ్యారేజి ఎండిపోయిందని, కర్నూలు వస్తే శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు అడుగంటిపోయాయని ఎద్దేవా చేశారు. ఇంతటి తీవ్రమైన కరువును పట్టించుకోకుండా తన కుటుంబ సభ్యులతో విహార యాత్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. కరువు నిధులను కూడా వదలకుండా దోచేసుకుంటున్నారని, మజ్జిగ పేరుతో 39 కోట్లు విడుదల చేసి, హెరిటేజ్ మజ్జిగను అమ్ముకుంటున్నారని విమర్శించారు. కరువు రాష్ట్రాల సీఎంలు అంతా మోదీని కలిసి ఆయనతో నిధుల కోసం మాట్లాడుతుంటే ఈయన మాత్రం తాను దోచుకున్న డబ్బులు స్విట్జర్లాండ్‌లో తన బినామీల పేరిట దాచుకోడానికి వెళ్లారని ఆరోపించారు. రాష్ట్రానికి రూ. 4 వేల కోట్ల నష్టం వస్తే కనీసం 400 కోట్లు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. పశువులకు కూడా నీళ్లు లేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని, ఇలాంటి పరిస్థితిలో కూడా ఎగువన అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని ఆమె అన్నారు. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని తెలిసి కూడా చంద్రబాబు మాట్లాడటం లేదని మండిపడ్డారు. పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో 115 టీఎంసీల కృష్ణా నీళ్లు మళ్లిస్తే రాయలసీమకు చుక్క నీరు కూడా రాదని గుర్తుపెట్టుకుని దీక్షను విజయవంతం చేయాలని కోరారు. సీమ ప్రాజెక్టులన్నీ ఉత్సవ విగ్రహాలుగా మారిపోయే ప్రమాదం ఉందని, ఏడాదిగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు జరుగుతుంటే చంద్రబాబు సైలెంట్‌గా గమనిస్తున్నారే తప్ప నోరు విప్పి మాట్లాడలేదని చెప్పారు. రాజమౌళి మనకు బాహుబలి సినిమా చూపిస్తే, కేసీఆర్ మాత్రం చంద్రబాబుకు బాబు బలి పార్ట్ 1 చూపించారని, అందుకే ఆయన హైదరాబాద్ నుంచి మూటాముల్లె సర్దుకుని విజయవాడ పారిపోయారని ఎద్దేవా చేశారు. బాబు బలి పార్ట్ 2 బయటకు వస్తే చంద్రబాబు జైల్లో ఉండక తప్పదని స్పష్టం చేశారు. ఓటుకు కోట్ల కేసు కోసం అటు కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని, ఇక్కడ కేసీఆర్ దగ్గర రాయలసీమ ప్రాజెక్టులను తాకట్టు పెట్టేశారని అన్నారు. సీమ అంటేనే చంద్రబాబుకు కక్షని, తనకు ఓట్లేయలేదన్న కసితో సీమ మీద పగ తీర్చుకుంటున్నారని తెలిపారు. కమీషన్ల కోసం పట్టిసీమ ప్రాజెక్టుతో 1500 కోట్లను నీళ్లపాలు చేశారని, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను గాలికి వదిలేశారని చెప్పారు. తాము సమస్యలపై నిలదీస్తుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారని, ఏడాదికి పైగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారని.. కానీ ఎమ్మెల్యేలను లాక్కున్నంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా, నిరుద్యోగ యువతకు ఉద్యోగం వస్తుందా అని రోజా ప్రశ్నించారు. మీరు కాదు కదా.. మీ చంద్రబాబు కాదు కదా.. ఆయనను పుట్టించిన ఖర్జూరనాయుడుకు కూడా వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయించే దమ్ము లేదని ఆమె స్పష్టం చేశారు. మోదీ, పవన్ కాళ్లు పట్టుకుని కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారని.. జగన్ పార్టీ పెట్టిన కొత్తలో ఎంపీగా పోటీ చేస్తేనే 5.5 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చిందని గుర్తుచేశారు. చంద్రబాబులో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాలు చేశారు. జగన్ తరఫున ఒక మహిళా ఎమ్మెల్యేగా వార్ డిక్లేర్ చేస్తున్నానని, ఉప ఎన్నికలకు వెళ్తే నీ అభివృద్ధి ఏంటో, జగన్ పట్ల జనానికి ఉన్న అభిమానం ఏంటో తెలుస్తుందని ఆమె అన్నారు. -
మాంఝీ ఎఫెక్ట్: అపర భగీరథులు ఎందరో!
తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశంలోని 13 రాష్ట్రాల్లోని 300 జిల్లాల్లో కనీసం గొంతు తడుపుకొనేందుకు నీటి చుక్క దొరకడం లేదు. గత రెండు సంవత్సరాలు వర్షాలు పడక పోవడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నా ఇందులో వారి పాపం కూడా లేకపోలేదు. నీటి వనరుల సంరక్షణకు పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేస్తే కరువు పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావు. ఇప్పటికి కూడా ప్రజలకు తాగు నీరును అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయిన ప్రజలు' తమంతట తామే కార్యరంగంలోకి దూకారు. కొందరు అపర భగీరథులయ్యారు. ప్రభుత్వ ప్రదేశాల్లో బావులు, గుంతలు తవ్వడం పలు రాష్ట్రాల్లో నిషేధం ఉండడంతో సొంత స్థలాల్లో, సొంత పొలాల్లో బావులు తవ్వడం ప్రారంభించారు. మధ్యప్రదేశ్, అగర్ జిల్లాలోని నెవారి గ్రామంలో భగవాన్ సింగ్ అనే 38 ఏళ్ల రైతు అపర భగీరథుడి అవతారమెత్తారు. తన పొలంలో 90 అడుగుల లోతు బావిని కేవలం 20 రోజుల్లో తవ్వాడు. సరిపడా నీళ్లు పడడంతో ఆ రైతు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒంటరిగా చేసిన ఆయన ఈ పోరాటానికి స్థానికులంతా ఆయన్ని దశరథ్‌రామ్ మాంఝీ అని పిలవడం మొదలుపెట్టారు. బీహార్‌లోని గయాకు సమీపంలో దశరథ్ మాంఝీ అనే దళితుడు దగ్గరి దారికోసం ఏకంగా ఓ కొండను ఒంటరిగా 22 ఏళ్లపాటు నిర్విరామంగా తవ్విన విషయం తెల్సిందే. ఇప్పుడు భగవాన్ సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది రైతులు తమ పొలాల్లో సొంతంగా బావులు తవ్వుకుంటున్నారు. మహారాష్ట్ర, వాషిమ్ జిల్లాలోని కళంబేశ్వర్ గ్రామంలో బాపూరావు తజ్నే అనే దళిత కూలి కూడా అపర భగీరథుడయ్యారు. ఆయన రోజుకు ఆరు గంటలపాటు పనిచేస్తూ 40 రోజుల్లో ఓ బావిని తవ్వాడు. అదృష్టవశాత్తు 15 అడుగులకే సరిపడ నీరు పడింది. దళితులన్న కారణంగా ఊరి బావి వద్దకు ఊరి పెద్దలు తన భార్యను రానివ్వకపోవడంతో బాపూరావు తన భార్య కోసం, తన తోటి దళితుల కోసం బావిని తవ్వాడు. బావిని తవ్వడంలో గతంలో ఆయనకు ఎలాంటి అనుభవం లేదు. కేవలం సంకల్పబలంతో అనుకున్నది సాధించారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో కుమార్ అనే ఓ 17 ఏళ్ల కుర్రాడు తన తల్లి కోసం ఇంటి వెనక పెరట్లో 55 అడుగుల లోతైన బావి తవ్వాడు. పొద్దంతా కూలిపనికి వెళ్లొచ్చి రాత్రి పూట దూరానున్న ఊరి బావికెళ్లి పలు బిందెల నీళ్లు తీసుకొస్తున్న తల్లి కష్టం చూసి కన్నకొడుకు చలించాడు. తల్లికి ఆ కష్టాన్ని తప్పించాలనే తపనతో 45 రోజులపాటు కష్టపడి బావిని తవ్వాడు. ఈ కుమార్‌ను కూడా స్థానికులు దశరథ్‌రామ్ మాంఝీతో పోలుస్తున్నారు. ప్రభుత్వాలు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నప్పుడు ఇలాంటి కథలన్నీ కావాలిప్పుడు. మధ్యప్రదేశ్‌లోని మస్తాపూర్ గ్రామంలో కొంత మంది కూలీలు కలసి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బావిని తవ్వుతున్నారు. వారు ఇప్పటికీ మూడు నెలలుగా శ్రమిస్తున్నా ఒక్క నయాపైసా కూలి ముట్టలేదు. ఈ విషయమై మీడియా జిల్లా అధికారులను నిలదీస్తే రాష్ట్ర అధికారులు నిధులు విడుదల చేయలేదని, రాష్ట్ర అధికారులను అడిగితే కేంద్రం నిధులు విడుదల చేయలేదని చెబుతున్నారు. ఇదీ మన ప్రభుత్వాల పనితీరు.