మాంఝీ ఎఫెక్ట్: అపర భగీరథులు ఎందరో!
తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశంలోని 13 రాష్ట్రాల్లోని 300 జిల్లాల్లో కనీసం గొంతు తడుపుకొనేందుకు నీటి చుక్క దొరకడం లేదు. గత రెండు సంవత్సరాలు వర్షాలు పడక పోవడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నా ఇందులో వారి పాపం కూడా లేకపోలేదు. నీటి వనరుల సంరక్షణకు పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేస్తే కరువు పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావు. ఇప్పటికి కూడా ప్రజలకు తాగు నీరును అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో 'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయిన ప్రజలు' తమంతట తామే కార్యరంగంలోకి దూకారు. కొందరు అపర భగీరథులయ్యారు. ప్రభుత్వ ప్రదేశాల్లో బావులు, గుంతలు తవ్వడం పలు రాష్ట్రాల్లో నిషేధం ఉండడంతో సొంత స్థలాల్లో, సొంత పొలాల్లో బావులు తవ్వడం ప్రారంభించారు.
మధ్యప్రదేశ్, అగర్ జిల్లాలోని నెవారి గ్రామంలో భగవాన్ సింగ్ అనే 38 ఏళ్ల రైతు అపర భగీరథుడి అవతారమెత్తారు. తన పొలంలో 90 అడుగుల లోతు బావిని కేవలం 20 రోజుల్లో తవ్వాడు. సరిపడా నీళ్లు పడడంతో ఆ రైతు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒంటరిగా చేసిన ఆయన ఈ పోరాటానికి స్థానికులంతా ఆయన్ని దశరథ్‌రామ్ మాంఝీ అని పిలవడం మొదలుపెట్టారు. బీహార్‌లోని గయాకు సమీపంలో దశరథ్ మాంఝీ అనే దళితుడు దగ్గరి దారికోసం ఏకంగా ఓ కొండను ఒంటరిగా 22 ఏళ్లపాటు నిర్విరామంగా తవ్విన విషయం తెల్సిందే. ఇప్పుడు భగవాన్ సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది రైతులు తమ పొలాల్లో సొంతంగా బావులు తవ్వుకుంటున్నారు.
మహారాష్ట్ర, వాషిమ్ జిల్లాలోని కళంబేశ్వర్ గ్రామంలో బాపూరావు తజ్నే అనే దళిత కూలి కూడా అపర భగీరథుడయ్యారు. ఆయన రోజుకు ఆరు గంటలపాటు పనిచేస్తూ 40 రోజుల్లో ఓ బావిని తవ్వాడు. అదృష్టవశాత్తు 15 అడుగులకే సరిపడ నీరు పడింది. దళితులన్న కారణంగా ఊరి బావి వద్దకు ఊరి పెద్దలు తన భార్యను రానివ్వకపోవడంతో బాపూరావు తన భార్య కోసం, తన తోటి దళితుల కోసం బావిని తవ్వాడు. బావిని తవ్వడంలో గతంలో ఆయనకు ఎలాంటి అనుభవం లేదు. కేవలం సంకల్పబలంతో అనుకున్నది సాధించారు.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో కుమార్ అనే ఓ 17 ఏళ్ల కుర్రాడు తన తల్లి కోసం ఇంటి వెనక పెరట్లో 55 అడుగుల లోతైన బావి తవ్వాడు. పొద్దంతా కూలిపనికి వెళ్లొచ్చి రాత్రి పూట దూరానున్న ఊరి బావికెళ్లి పలు బిందెల నీళ్లు తీసుకొస్తున్న తల్లి కష్టం చూసి కన్నకొడుకు చలించాడు. తల్లికి ఆ కష్టాన్ని తప్పించాలనే తపనతో 45 రోజులపాటు కష్టపడి బావిని తవ్వాడు. ఈ కుమార్‌ను కూడా స్థానికులు దశరథ్‌రామ్ మాంఝీతో పోలుస్తున్నారు. ప్రభుత్వాలు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నప్పుడు ఇలాంటి కథలన్నీ కావాలిప్పుడు.
మధ్యప్రదేశ్‌లోని మస్తాపూర్ గ్రామంలో కొంత మంది కూలీలు కలసి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బావిని తవ్వుతున్నారు. వారు ఇప్పటికీ మూడు నెలలుగా శ్రమిస్తున్నా ఒక్క నయాపైసా కూలి ముట్టలేదు. ఈ విషయమై మీడియా జిల్లా అధికారులను నిలదీస్తే రాష్ట్ర అధికారులు నిధులు విడుదల చేయలేదని, రాష్ట్ర అధికారులను అడిగితే కేంద్రం నిధులు విడుదల చేయలేదని చెబుతున్నారు. ఇదీ మన ప్రభుత్వాల పనితీరు.