రమేశ్ నాయుడు
అసలు రమేశ్ నాయుడు ఏఆర్.డి. బర్మన్‌లానో ఏ మదన్‌మోహన్‌లానో దేశమంతా తెలిసిన సంగీత దర్శకుడు అయి ఉండాలి. అంత ప్రతిభ ఉన్న సంగీత దర్శకులు తెలుగులో తక్కువ ఉన్నారు. ప్రతిభ ఉన్న తెలుగువాడు కదా ఉపయోగించుకుందాం అని గాడ్‌ఫాదర్‌లా నిలిచేవారు దేశంలో అంత కంటే తక్కువ ఉన్నారు. అయినప్పటికీ ఏమి. తెలుగువారికి ఆయన పాటలు వినే అదృష్టం దక్కింది. తెలుగువారి వాకిటలో ఆయన నాటిన పాటల నంది వర్థనాల కళ మిగిలింది. పి.సుశీల చేత, బాలూ చేత, జానకి చేత సున్నితంగా పాడించడం ఎవరైనా చేస్తారు. కాని ఎల్.ఆర్. ఈశ్వరి చేత కూడా ఆయన సున్నితంగా పాడించి శృంగారం అంటే అరుపులు, మూలుగులు కాదు గొంతులోని పిలుపులు అని నిరూపించారు. ‘జీవితం’ సినిమాలో ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన పాట ఎవరికి గుర్తు లేదు? ‘మాయ చేసిపోతివిరో నాగులూ... నా మాట మరిచిపోతివిరో నాగులూ’... రేడియోలో ఉదయమో మధ్యాహ్నమో నిద్రపోయే ముందు ఈ పాట తప్పక వినిపించేది.
అంతేనా? ‘అమ్మ మాట’ కోసం ఒక పాట రికార్డు చేయాలి. సన్నివేశానికి తగినట్టు ఏదో రఫ్ నోట్స్ రాసుకుని భోజనానికి వెళ్లారు సి.నారాయణరెడ్డి. తొందరగా భోజనం ముగించుకు వచ్చిన రమేశ్ నాయుడు ఆ రఫ్ నోట్సే పల్లవి అనుకుని దానికి ట్యూన్ కట్టారు. అంటే అది న్యూస్‌పేపర్‌లోని వార్తకు ట్యూన్ కట్టడంతో సమానం. కాని రమేశ్‌నాయుడు కట్టారు. ఎల్.ఆర్. ఈశ్వరి చేత అంతే లలితంగా పాడించారు. ఆ పాట ఏదో తెలుసుగా? ‘లగ్గమెప్పుడ్రా మామా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే’....
రమేశ్ నాయుడు ఎల్.ఆర్. ఈశ్వరితో పాడించిన ఈ రెండు పాటలు చెప్పాక ఇంకో పాట చెప్పకపోతే శిక్షార్హమైన నేరం అవుతుంది. లేదంటే ఓకే..యా అవుతుంది. ఎస్.. గుర్తుకొచ్చింది కదా. ‘దేవుడు చేసిన మనుషులు’ లో దేవకన్య కాంచన నైట్‌క్లబ్‌లో పాడే పాట. ఆ మసక మసక చీకటి. ఆ మల్లెతోట చాటు. ఆరుద్ర ఘాటు. ‘మసక మసక చీకటిలో.. మల్లెతోట ఎనకాల’...
రమేశ్ నాయుడు దేశంలోని 12 భాషల్లో పాటలు చేశారు. కృష్ణా జిల్లాలోని కొండపల్లి నుంచి ఆయన ప్రయాణం 14 ఏళ్ల వయసులో మొదలయ్యి బొంబాయి, కలకత్తా, మద్రాసుల మీదుగా సాగింది. పావలా కాసు ప్రతిభ ఉంటే పది రూపాయల సౌండ్ చేసేవారు ఎక్కువ ఫీల్డ్‌లో. కాని వంద రూపాయల ప్రతిభ ఉంచుకుని కూడా రమేశ్ నాయుడు తనను తాను ముందు వరుసలో నిలబెట్టుకోవడానికి మొహమాటపడేవారు. సాహిత్యం వినిపించేలా చేయడం, గాయకుల ప్రతిభ కనిపించేలా చేయడం, వాద్య పరికరాలను వాటి హద్దుల్లో ఉంచడం ఇవి రమేశ్ నాయుడుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ‘ఇక్కడే కలుసుకున్నాము... ఎప్పుడో కలుసుకున్నాము’ (జీవితం) పాట గుర్తుకు తెచ్చుకోండోసారి.
రమేశ్ నాయుడికి వేణువంటే ఇష్టం. వేణుగానం ఉన్న పాటలు చాలా చేశారు. కాని ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ఘంటసాల పాడిన ఈ పాట అపురూపం. ఎన్నిసార్లు విన్నా ఆ వేణువులో ఆ గానంలో ఏదో వేదన ఉంటుంది. పాటలో వేదనను నింపడం అంత సులువు కాదు. ‘విన్నారా... అలనాటి వేణుగానం.. మోగింది మరలా’...
కె.వి. మహదేవన్, సత్యం, చక్రవర్తి... ఈ ముగ్గురు కూడా (1975–85)ల మధ్య విపరీతమైన మార్కెట్‌లో ఉన్నారు. కమర్షియల్ సినిమాలంటే వీరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. కాని దాసరి నారాయణరావు, విజయనిర్మల, జంధ్యాల దాదాపుగా రమేశ్ నాయుడు చేత పాటలు చేయించుకోవడానికి ఇష్టపడేవారు. విజయ నిర్మల ‘మీనా’ సినిమాకు ఆయన చేసిన ‘శ్రీరామ నామాలు శతకోటి’ పాట ప్రతి శ్రీరామ నవమికి ప్లే అవుతూనే ఉంది. జంధ్యాల ‘ముద్దమందారం’ సినిమాకు చేసిన పాటలు– ‘అలివేణి ఆణిముత్యమా’, ‘నీలాలు కారేనా కాలాలు మారేనా’ క్లాసిక్స్‌గా నిలువలేదూ! ఇక దాసరికి 20 సినిమాలు చేశారు. అన్ని సినిమాలు ఒకెత్తు... ‘మేఘసందేశం’ ఒకెత్తు.
రమేశ్‌నాయుడు బాణీలు ఇవ్వడాన్ని ఇష్టపడేవారు కాదు. పాట రాస్తే సన్నివేశానికి తగినట్టుగా ట్యూన్ చేయాలనేది ఆయన ధోరణి. ‘మేఘసందేశం’కు మహాకవులు పాటలు రాశారు. వేటూరి ‘ఆకాశదేశాన.. ఆషాఢ మాసాన’ అన్నారు. కృష్ణశాస్త్రి ‘సిగలో అవి విరులో’ అన్నారు. ‘ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై’ అని కూడా అన్నారు. వీటికి తోడు జయదేవుని అష్టపది ‘ప్రియే చారుశీలే’. వీటన్నింటిని సుశీల, ఏసుదాసుల గొంతులో మరికొన్ని మల్లెలు నింపి శ్రోతలకు పరిమళాలు వొంపారు. ఇదే సినిమాలో మంగళంపల్లి చేత ‘పాడనా వాణి కల్యాణిగా’ పాడించారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్నారు. ఇవన్నీ చేసింది హైస్కూలు చదువు కూడా సరిగా లేని రమేశ్ నాయుడు... ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోని రమేశ్ నాయుడు.
ఒకనాటి ‘దేవదాసు’ స్ఫూర్తితో కృష్ణ ‘దేవదాసు’ తీస్తే ఆనాటి పాటలకు దీటుగా రమేశ్ నాయుడు పాటలు ఇచ్చారు. ‘మేఘాల మీద సాగాలి’. ‘పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ’, ‘కల చెదిరింది.. కథ మారింది’ ఇవన్నీ ప్రేక్షకులకు నచ్చాయి. కాని అక్కినేని దేవదాసు ప్రభావం ఈ దేవదాసు మీద పడింది. కృష్ణ నటించిన ‘అంతం కాదిది ఆరంభం’, ‘భోగిమంటలు’, ‘సూర్యచంద్ర’ సినిమాలకు రమేశ్ నాయడు సంగీతం అందించారు.
బాలూతో రమేశ్ నాయుడు పాడించిన సోలో గీతాలు సంగీత సాహిత్యాల మేలుకలయికతో నిలిచి ఉన్నాయి. ‘దోర వయసు చిన్నది’ (దేవుడు చేసిన మనుషులు), ‘శివరంజని నవరాగిణి’ (శివరంజని), ‘లలిత కళారాధనలో’ (కల్యాణి), ‘పారాహుషార్ పారాహుషార్’ (స్వయంకృషి) ఇవన్నీ రమేశ్ నాయుడిని తెలుగు శ్రోతల నుంచి దూరం చేయకుండా పట్టి ఉంచాయి.
రమేశ్ నాయుడు 54 ఏళ్ల వయసులో 1987లో మరణించారు. ఆయన పాట అపూర్వం. అపురూపం. ఆగక వినిపించే తుమ్మెద సంగీతం.
జోరు మీదున్నావు తుమ్మెదా... ఈ జోరెవరి కోసమే తుమ్మెదా..
– సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment