
నాకు ఇష్టమైన వంటకాలు, రెస్టారెంట్లు ఇవే
అభి‘రుచుల’ను వెల్లడించిన జూనియర్ ఎన్టీఆర్
అంతర్జాతీయ స్థాయి సక్సెస్‌లు అందుకుంటున్న టాలీవుడ్ (Tollywood)కు కేంద్ర బిందువు హైదరాబాద్. అలాంటి పరిశ్రమలో గ్లోబల్‌స్టార్స్‌గా పేరున్న అనేకమంది నటీనటులకు మన నగరం నిలయం. అయితే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న టాలీవుడ్ స్టార్స్ కూడా నగరంలోని కొన్ని రుచులకు దాసులే. వారు తమ అభి‘రుచుల్ని’ సంతృప్తి పరుచుకోడానికి నగరంలోని కొన్ని రెస్టారెంట్స్‌కి తరచూ రౌండ్స్ వేస్తుంటారు. అభిమానులకు చిక్కకుండా రహస్యంగా తమ టేస్ట్ బడ్స్‌ను శాంతింపజేస్తుంటారు. అదే విధంగా మన టాలీవుడ్ టాప్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌కి సైతం నగరంలో తనకు నచ్చిన, ఇష్టమైన వంటకాలు వడ్డించే రెస్టారెంట్స్ ఉన్నాయి.
గత నెల్లో దేవర చిత్రాన్ని అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రం అక్కడి థియేటర్లలో సందడి చేస్తోంది. మరోవైపు తారక్ తిరిగి నగరానికి వచ్చేశారు. అయితే తారక్ జపాన్ టూరుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఆ ఇంటర్వ్యూలో నగరంలో తాను ఇష్టపడే రెస్టారెంట్స్ రుచుల వివరాలు ఆయన వెల్లడించడమే ఇందుకు కారణం.
ఫ్రెండ్.. జపనీస్ ట్రెండ్..
నగరంలోని నాగ చైతన్య అక్కినేనికి చెందిన షోయు రెస్టారెంట్ ఎన్టీఆర్ ఎంచుకున్న మొదటి ఎంపిక. ‘ఈ అద్భుతమైన కళాత్మక ప్లేస్ నా స్నేహితుడు నాగ చైతన్య సొంతం. ఈ ప్రదేశంలో కొన్ని అద్భుతమైన జపనీస్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. మరీ ముఖ్యంగా జపనీస్ వంటకమైన సుషీ అక్కడ సూపర్బ్. హైదరాబాద్‌లో జపనీస్ వంటకాలకు నేను జై కొట్టే ప్లేస్ అది. ఇది నిజంగా అంతర్జాతీయ వంటకాలకు కేరాఫ్’ అంటూ ఎన్టీఆర్ కొనియాడారు.
మరికొన్ని ప్రదేశాలు..
జపనీస్ వంటకాలకు సంబంధించి తన ఫేవరెట్‌ను తెలియజేయడంతో పాటు అచ్చమైన హైదరాబాదీ వంటకాలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ కొన్నింటిని పేర్కొన్నారు. తాను ఆస్వాదించే మరికొన్ని రుచుల కోసం.. పాతబస్తీలోని షాదాబ్, జూబ్లీహిల్స్‌లోని స్పైస్ వెన్యూ, తెలంగాణ స్పైస్ కిచెన్, పాలమూరు గ్రిల్, అమీర్‌పేట్‌లోని కాకతీయ డీలక్స్ మెస్ కూడా ఆయన ఎంచుకున్న నచ్చే రుచుల జాబితాలో ఉన్నాయి.
చదవండి: పూరీ- విజయ్ సేతుపతి కాంబినేషన్‌పై ట్రోలింగ్.. నటుడి ఆగ్రహం