Music composer-singer
-
Birthday Special: మ్యూజిక్ ఇతడి చేతుల్లో మేజిక్.. ఏఆర్ రెహమాన్ బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్
సంగీతానికి హద్దులు లేవు. భాషలకు అతీతం. ఇంతకు ముందు బప్పిలహరి లాంటి పలువురు సంగీత దర్శకులు దక్షిణాదిలో పలు హిట్ చిత్రాలకు పని చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల దక్షిణాది సంగీత దర్శకులకు బాలీవుడ్లో క్రేజ్ పెరుగుతుందనే చెప్పవచ్చు. తాజాగా కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ పేరు బాలీవుడ్లో మారుమ్రోగుతోంది. ఒర్ ఇరవు చిత్రం ద్వారా కోలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా పరిచయమైన ఈయన విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన విక్రమ్ వేదా చిత్రంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంలోని థీమ్ సాంగ్ సంగీత ప్రియులకు విపరీతంగా ఆకట్టుకుంది. అలా మెలోడి పాటలు రూపొందించడంలోనూ దిట్ట అని నిరూపించుకున్నారు. ఖైదీ, అడంగామరు, సాని కాగితం వంటి పలు చిత్రాలకు సంగీతాన్ని అందించి పేరు తెచ్చుకున్నారు. కాగా విక్రమ్ వేదా చిత్రం తాజాగా హిందీలో రీమేక్ అవుతోంది. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ నే సంగీతాన్ని అందిస్తూ బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. త్వరలో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలవుతున్న హిందీ వెర్షన్ విక్రమ్ వేదా చిత్ర ట్రైలర్ ఇటీవల మొదలైంది. ఈ ట్రైలర్‌కు, చిత్ర పాటలకు బాలీవుడ్ వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళం, తెలుగు తదితర భాషల్లో చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నా ఇకపై బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకోబోతున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల అవకాశాలు వస్తున్నట్లు శ్యామ్ తెలిపారు. -
ప్చ్.. ఆస్కార్‌కు ఆస్కార్ మాత్రం రాలేదు!
సినీ ప్రపంచంలో ఆయనొక సంచలనం. ఒకరకంగా ఎలక్ట్రానిక్ మ్యూజిక్కు మార్గదర్శకుడు. అయినా ఆయనకు ప్రతిష్టాత్మక ‘ఆస్కార్’ మాత్రం రాలేదు. ఆయనే ఆస్కార్ సాలా. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా గూగుల్ డూడుల్‌తో నివాళి ఇచ్చింది. బెర్లిన్: భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రానిక్ సంగీత స్వరకర్త ఆస్కార్ సాలా 112వ జయంతి వేడుకలను గూగుల్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రత్యేక డూడుల్ ద్వారా ఆస్కార్ సాలాకు నివాళులర్పించింది. జర్మనీలోని గ్రీజ్‌లో 1910లో జన్మించిన ఆస్కార్‌ను ఎలక్ట్రానిక్ మ్యూజిక్కు మార్గదర్శకుడిగా పిలుస్తారు. ఆయన 1930లో ఎలక్ట్రానిక్ సింథసైజర్‌తో చేసిన 'ట్రాటోనియం' అనే పరికరాన్ని వాయించేవారు. ఆస్కార్ సాలా తల్లి గాయని కాగా.. తండ్రి సంగీతంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి.. కంటి డాక్టర్ కూడా. సంగీతంలోనే పుట్టి పెరిగారు ఆస్కార్ సాలా. చిన్న వయసులోనే పియానో వాయిస్తూ కన్సెర్ట్‌లు ఇచ్చేవారు. బెర్లిన్‌కు చెందిన వయోలిస్ట్ పాల్ హిందెమిత్ వద్ద పియోనో వాయించటం నేర్చుకున్నారు. ఆ తర్వాత ఫ్రెడరిక్ ట్రాట్వీన్ కనిపెట్టిన ఎలక్ట్రానిక్ సింథసైజర్ ట్రాటోనియంపై ఆసక్తి పెంచుకున్నారు. దాంతో పాటు భౌతికశాస్త్రం, స్వరకల్పనపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మిక్సర్ ట్రాటోనియంను అభివృద్ధి చేశారు. ప్రత్యేక డిజైన్‌లో ఒకేసారి పలు రకాల శబ్దాలు, మాటలను వినిపించేలా ఉండటం దాని ప్రత్యేకత. ఒక స్వరక్తరగా, ఎలక్ట్రో ఇంజినీర్‌గా ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌లో విశేష సేవలందించారు. సినిమాలకు సంగీతం.. 1940-50 మధ్య చాలా సినిమాలకు పని చేశారు ఆస్కార్ సాలా. ఆ తర్వాత తన సొంత స్టూడియోలో చాలా సినిమాలకు ఎలక్ట్రానిక్ సౌండ్ట్రాక్స్ను అందించారు. అలాగే.. రేడియో, టీవీ కార్యక్రమాలతో పాటు రోస్మ్యారీ(1959), ద బర్డ్స్(1962) చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత.. క్వార్టెట్ ట్రాటోనియం, కన్సెర్ట్ ట్రాటోనియం, వోల్క్స్ట్రాటోనియంలను అభివృద్ధి చేశారు. 1995లో జర్మనీ మ్యూజియంకు తన మిక్సర్ ట్రాటోనియంను విరాళంగా ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మ్యూజిక్‌లో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.. ఒక్క ఆస్కార్ తప్ప.! ఇదీ చదవండి: గూగుల్‌ని తిట్టిపోస్తున్న నెటిజన్లు...నివాళి ఇచ్చే పద్ధతి ఇదేనా! -
హాస్పిటల్ పాలైన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్
ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు అమీర్‌ఖాన్, రణ్‌బీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహిరికి సైతం కరోనా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన్ని చేర్పించినట్లు బప్పీలహిరి కుమార్తె రెమా లాహిరి తెలిపింది. 'కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాన్నకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముందు జాగ్రత్తగా ఆయన్ని హాస్పిటల్లో చేర్పించాం. మీ అందరి ప్రార్థనలతో నాన్న త్వరగా కోలుకొని ఇంటికి వెళ్తారు' అని పేర్కొంది. కాగా గతనెలలోనే తాను కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రీ- రిజిస్టర్ చేసుకున్నట్లు బప్పీలహిరి ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తూ ఈలోపే ఆయన కోవిడ్ బారిన పడ్డారు. దీంతో బప్పీలహిరి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులుగా తిరిగా రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. చల్తే చల్తే, డిస్కో డాన్సర్, షరాబి వంటి సినిమాలకు మ్యూజిక్ అందించి బప్పీలహరి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో చివరగా భాఘీ3 సినిమాకు ఆయన సంగీతం అందించారు. తెలుగులోనూ స్టేట్ రౌడీ, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, రౌడీ ఇన్స్పెక్టర్, సింహాసనం వంటి చిత్రాల్లో ఎన్నో సూపర్‌హిట్ పాటలను అందించారు. చదవండి : ఫన్నీ వీడియో: ఆ నటుడికి కరోనా గురించి ముందే తెలుసు! అమితాబ్ సినిమా విడుదల మళ్లీ వాయిదా, కారణం ఇదే -
‘మాయ చేసి పోతివిరో నాగులూ’...
అసలు రమేశ్ నాయుడు ఏఆర్.డి. బర్మన్లానో ఏ మదన్మోహన్లానో దేశమంతా తెలిసిన సంగీత దర్శకుడు అయి ఉండాలి. అంత ప్రతిభ ఉన్న సంగీత దర్శకులు తెలుగులో తక్కువ ఉన్నారు. ప్రతిభ ఉన్న తెలుగువాడు కదా ఉపయోగించుకుందాం అని గాడ్‌ఫాదర్‌లా నిలిచేవారు దేశంలో అంత కంటే తక్కువ ఉన్నారు. అయినప్పటికీ ఏమి. తెలుగువారికి ఆయన పాటలు వినే అదృష్టం దక్కింది. తెలుగువారి వాకిటలో ఆయన నాటిన పాటల నంది వర్థనాల కళ మిగిలింది. పి.సుశీల చేత, బాలూ చేత, జానకి చేత సున్నితంగా పాడించడం ఎవరైనా చేస్తారు. కాని ఎల్.ఆర్. ఈశ్వరి చేత కూడా ఆయన సున్నితంగా పాడించి శృంగారం అంటే అరుపులు, మూలుగులు కాదు గొంతులోని పిలుపులు అని నిరూపించారు. ‘జీవితం’ సినిమాలో ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన పాట ఎవరికి గుర్తు లేదు? ‘మాయ చేసిపోతివిరో నాగులూ... నా మాట మరిచిపోతివిరో నాగులూ’... రేడియోలో ఉదయమో మధ్యాహ్నమో నిద్రపోయే ముందు ఈ పాట తప్పక వినిపించేది. అంతేనా? ‘అమ్మ మాట’ కోసం ఒక పాట రికార్డు చేయాలి. సన్నివేశానికి తగినట్టు ఏదో రఫ్ నోట్స్ రాసుకుని భోజనానికి వెళ్లారు సి.నారాయణరెడ్డి. తొందరగా భోజనం ముగించుకు వచ్చిన రమేశ్ నాయుడు ఆ రఫ్ నోట్సే పల్లవి అనుకుని దానికి ట్యూన్ కట్టారు. అంటే అది న్యూస్పేపర్లోని వార్తకు ట్యూన్ కట్టడంతో సమానం. కాని రమేశ్‌నాయుడు కట్టారు. ఎల్.ఆర్. ఈశ్వరి చేత అంతే లలితంగా పాడించారు. ఆ పాట ఏదో తెలుసుగా? ‘లగ్గమెప్పుడ్రా మామా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచిరోజు లేదన్నాడే’.... రమేశ్ నాయుడు ఎల్.ఆర్. ఈశ్వరితో పాడించిన ఈ రెండు పాటలు చెప్పాక ఇంకో పాట చెప్పకపోతే శిక్షార్హమైన నేరం అవుతుంది. లేదంటే ఓకే..యా అవుతుంది. ఎస్.. గుర్తుకొచ్చింది కదా. ‘దేవుడు చేసిన మనుషులు’ లో దేవకన్య కాంచన నైట్‌క్లబ్‌లో పాడే పాట. ఆ మసక మసక చీకటి. ఆ మల్లెతోట చాటు. ఆరుద్ర ఘాటు. ‘మసక మసక చీకటిలో.. మల్లెతోట ఎనకాల’... రమేశ్ నాయుడు దేశంలోని 12 భాషల్లో పాటలు చేశారు. కృష్ణా జిల్లాలోని కొండపల్లి నుంచి ఆయన ప్రయాణం 14 ఏళ్ల వయసులో మొదలయ్యి బొంబాయి, కలకత్తా, మద్రాసుల మీదుగా సాగింది. పావలా కాసు ప్రతిభ ఉంటే పది రూపాయల సౌండ్ చేసేవారు ఎక్కువ ఫీల్డ్‌లో. కాని వంద రూపాయల ప్రతిభ ఉంచుకుని కూడా రమేశ్ నాయుడు తనను తాను ముందు వరుసలో నిలబెట్టుకోవడానికి మొహమాటపడేవారు. సాహిత్యం వినిపించేలా చేయడం, గాయకుల ప్రతిభ కనిపించేలా చేయడం, వాద్య పరికరాలను వాటి హద్దుల్లో ఉంచడం ఇవి రమేశ్ నాయుడుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ‘ఇక్కడే కలుసుకున్నాము... ఎప్పుడో కలుసుకున్నాము’ (జీవితం) పాట గుర్తుకు తెచ్చుకోండోసారి. రమేశ్ నాయుడికి వేణువంటే ఇష్టం. వేణుగానం ఉన్న పాటలు చాలా చేశారు. కాని ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ఘంటసాల పాడిన ఈ పాట అపురూపం. ఎన్నిసార్లు విన్నా ఆ వేణువులో ఆ గానంలో ఏదో వేదన ఉంటుంది. పాటలో వేదనను నింపడం అంత సులువు కాదు. ‘విన్నారా... అలనాటి వేణుగానం.. మోగింది మరలా’... కె.వి. మహదేవన్, సత్యం, చక్రవర్తి... ఈ ముగ్గురు కూడా (1975–85)ల మధ్య విపరీతమైన మార్కెట్లో ఉన్నారు. కమర్షియల్ సినిమాలంటే వీరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. కాని దాసరి నారాయణరావు, విజయనిర్మల, జంధ్యాల దాదాపుగా రమేశ్ నాయుడు చేత పాటలు చేయించుకోవడానికి ఇష్టపడేవారు. విజయ నిర్మల ‘మీనా’ సినిమాకు ఆయన చేసిన ‘శ్రీరామ నామాలు శతకోటి’ పాట ప్రతి శ్రీరామ నవమికి ప్లే అవుతూనే ఉంది. జంధ్యాల ‘ముద్దమందారం’ సినిమాకు చేసిన పాటలు– ‘అలివేణి ఆణిముత్యమా’, ‘నీలాలు కారేనా కాలాలు మారేనా’ క్లాసిక్స్‌గా నిలువలేదూ! ఇక దాసరికి 20 సినిమాలు చేశారు. అన్ని సినిమాలు ఒకెత్తు... ‘మేఘసందేశం’ ఒకెత్తు. రమేశ్‌నాయుడు బాణీలు ఇవ్వడాన్ని ఇష్టపడేవారు కాదు. పాట రాస్తే సన్నివేశానికి తగినట్టుగా ట్యూన్ చేయాలనేది ఆయన ధోరణి. ‘మేఘసందేశం’కు మహాకవులు పాటలు రాశారు. వేటూరి ‘ఆకాశదేశాన.. ఆషాఢ మాసాన’ అన్నారు. కృష్ణశాస్త్రి ‘సిగలో అవి విరులో’ అన్నారు. ‘ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై’ అని కూడా అన్నారు. వీటికి తోడు జయదేవుని అష్టపది ‘ప్రియే చారుశీలే’. వీటన్నింటిని సుశీల, ఏసుదాసుల గొంతులో మరికొన్ని మల్లెలు నింపి శ్రోతలకు పరిమళాలు వొంపారు. ఇదే సినిమాలో మంగళంపల్లి చేత ‘పాడనా వాణి కల్యాణిగా’ పాడించారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్నారు. ఇవన్నీ చేసింది హైస్కూలు చదువు కూడా సరిగా లేని రమేశ్ నాయుడు... ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోని రమేశ్ నాయుడు. ఒకనాటి ‘దేవదాసు’ స్ఫూర్తితో కృష్ణ ‘దేవదాసు’ తీస్తే ఆనాటి పాటలకు దీటుగా రమేశ్ నాయుడు పాటలు ఇచ్చారు. ‘మేఘాల మీద సాగాలి’. ‘పొరుగింటి దొరగారికి పొగరు ఎక్కువ’, ‘కల చెదిరింది.. కథ మారింది’ ఇవన్నీ ప్రేక్షకులకు నచ్చాయి. కాని అక్కినేని దేవదాసు ప్రభావం ఈ దేవదాసు మీద పడింది. కృష్ణ నటించిన ‘అంతం కాదిది ఆరంభం’, ‘భోగిమంటలు’, ‘సూర్యచంద్ర’ సినిమాలకు రమేశ్ నాయడు సంగీతం అందించారు. బాలూతో రమేశ్ నాయుడు పాడించిన సోలో గీతాలు సంగీత సాహిత్యాల మేలుకలయికతో నిలిచి ఉన్నాయి. ‘దోర వయసు చిన్నది’ (దేవుడు చేసిన మనుషులు), ‘శివరంజని నవరాగిణి’ (శివరంజని), ‘లలిత కళారాధనలో’ (కల్యాణి), ‘పారాహుషార్ పారాహుషార్’ (స్వయంకృషి) ఇవన్నీ రమేశ్ నాయుడిని తెలుగు శ్రోతల నుంచి దూరం చేయకుండా పట్టి ఉంచాయి. రమేశ్ నాయుడు 54 ఏళ్ల వయసులో 1987లో మరణించారు. ఆయన పాట అపూర్వం. అపురూపం. ఆగక వినిపించే తుమ్మెద సంగీతం. జోరు మీదున్నావు తుమ్మెదా... ఈ జోరెవరి కోసమే తుమ్మెదా.. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కీరవాణి రిటైర్మెంట్!
1989... డిసెంబర్ 9. కీరవాణి జీవితంలో కొత్త మలుపు. చక్రవర్తి దగ్గర శిష్యరికం చేసిన ఆయనకు సంగీతదర్శకుడిగా తొలి అవకాశం. ఎన్నో ఆశలు.. ఎన్నో కలలు. అవన్నీ నెరవేరే క్షణం. చెన్నయ్‌లోని ప్రసాద్ స్టూడియో దానికి వేదిక. తొలి పాట రికార్డ్ అయ్యింది. ఓ పక్క అంబరాన్నంటే సంబరం. మరోపక్క మనసులో ఒక విచిత్రమైన ఆలోచన. సరిగ్గా 27 ఏళ్ల తర్వాత ఇదే రోజున సంగీతదర్శకుడిగా రిటైర్ కావాలి. తన భవిష్యత్తేంటో తెలియదు. తనేం సాధిస్తాడో తెలియదు. అయినా రిటైర్మెంట్ గురించి ఆలోచన. ఎవరికైనా చెబితే నవ్వుతారు. కానీ, కీరవాణిది అతివిశ్వాసం కాదు.. ఆత్మవిశ్వాసం. ఎస్... తను సంగీతదర్శకుడిగా రాజ్యమేలతాడు. తన ప్రతిభపై తనకు అపారమైన నమ్మకం ఉంది. అంతవరకూ ఓకే. అప్పుడు తీసుకున్న డెసిషన్‌ని ఇంకా గుర్తుపెట్టుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. కట్ చేస్తే... 2014 జనవరి 30. ‘ఫేస్బుక్’లో కీరవాణి సంచలన ప్రకటన. 2016 డిసెంబర్ 8న రిటైర్ కాబోతున్నానన్నది ఆ ప్రకటన సారాంశం. మొదట అంతా జోక్ అనుకున్నారు. కానీ, తర్వాత అందులోని సీరియస్‌నెస్ ఏంటో అర్థమైంది. 1989లోనే ఈ డెసిషన్ తీసుకున్నారని తెలిసి అందరూ షాకయ్యారు. తెలుగు చిత్రసీమలో ఆయన నంబర్‌వన్ మ్యూజిక్ డెరైక్టర్. మరో పది, పదిహేనేళ్లయినా రాణించగల సత్తా ఆయనలో ఉంది. అలాంటి ఆయన సడన్‌గా ఈ ప్రకటన చేయడంతో అందరూ విస్తుపోయారు. ‘‘నా రిటైర్మెంట్ డేని పలువురు సంగీతదర్శకులు, నాకు బాగా దగ్గరైన నా అసోసియేట్స్‌తో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. నా తొలి పాట రికార్డ్ అయిన ప్రసాద్ స్టూడియోలోనే జరుపుకోవాలనుకుంటున్నాను. ఈరోజు రావడానికి మరో మూడేళ్లు ఉంది. ఇన్నేళ్లుగా తమ ఇష్టాయిష్టాలను, సలహాలను, సూచనలను ఇచ్చిన నా అభిమానులకు ధన్యవాదాలు’’ అని కీరవాణి ‘ఫేస్బుక్’ ద్వారా వెల్లడించారు.