కీరవాణి రిటైర్మెంట్!
1989... డిసెంబర్ 9. కీరవాణి జీవితంలో కొత్త మలుపు. చక్రవర్తి దగ్గర శిష్యరికం చేసిన ఆయనకు సంగీతదర్శకుడిగా తొలి అవకాశం. ఎన్నో ఆశలు.. ఎన్నో కలలు. అవన్నీ నెరవేరే క్షణం. చెన్నయ్‌లోని ప్రసాద్ స్టూడియో దానికి వేదిక. తొలి పాట రికార్డ్ అయ్యింది. ఓ పక్క అంబరాన్నంటే సంబరం. మరోపక్క మనసులో ఒక విచిత్రమైన ఆలోచన. సరిగ్గా 27 ఏళ్ల తర్వాత ఇదే రోజున సంగీతదర్శకుడిగా రిటైర్ కావాలి. తన భవిష్యత్తేంటో తెలియదు. తనేం సాధిస్తాడో తెలియదు. అయినా రిటైర్‌మెంట్ గురించి ఆలోచన. ఎవరికైనా చెబితే నవ్వుతారు. కానీ, కీరవాణిది అతివిశ్వాసం కాదు.. ఆత్మవిశ్వాసం. ఎస్... తను సంగీతదర్శకుడిగా రాజ్యమేలతాడు. తన ప్రతిభపై తనకు అపారమైన నమ్మకం ఉంది. అంతవరకూ ఓకే. అప్పుడు తీసుకున్న డెసిషన్‌ని ఇంకా గుర్తుపెట్టుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు.
కట్ చేస్తే... 2014 జనవరి 30. ‘ఫేస్‌బుక్’లో కీరవాణి సంచలన ప్రకటన. 2016 డిసెంబర్ 8న రిటైర్ కాబోతున్నానన్నది ఆ ప్రకటన సారాంశం. మొదట అంతా జోక్ అనుకున్నారు. కానీ, తర్వాత అందులోని సీరియస్‌నెస్ ఏంటో అర్థమైంది. 1989లోనే ఈ డెసిషన్ తీసుకున్నారని తెలిసి అందరూ షాకయ్యారు. తెలుగు చిత్రసీమలో ఆయన నంబర్‌వన్ మ్యూజిక్ డెరైక్టర్. మరో పది, పదిహేనేళ్లయినా రాణించగల సత్తా ఆయనలో ఉంది. అలాంటి ఆయన సడన్‌గా ఈ ప్రకటన చేయడంతో అందరూ విస్తుపోయారు. ‘‘నా రిటైర్‌మెంట్ డేని పలువురు సంగీతదర్శకులు, నాకు బాగా దగ్గరైన నా అసోసియేట్స్‌తో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. నా తొలి పాట రికార్డ్ అయిన ప్రసాద్ స్టూడియోలోనే జరుపుకోవాలనుకుంటున్నాను. ఈరోజు రావడానికి మరో మూడేళ్లు ఉంది. ఇన్నేళ్లుగా తమ ఇష్టాయిష్టాలను, సలహాలను, సూచనలను ఇచ్చిన నా అభిమానులకు ధన్యవాదాలు’’ అని కీరవాణి ‘ఫేస్‌బుక్’ ద్వారా వెల్లడించారు.