సంగీతానికి హద్దులు లేవు. భాషలకు అతీతం. ఇంతకు ముందు బప్పిలహరి లాంటి పలువురు సంగీత దర్శకులు దక్షిణాదిలో పలు హిట్ చిత్రాలకు పని చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల దక్షిణాది సంగీత దర్శకులకు బాలీవుడ్‌లో క్రేజ్ పెరుగుతుందనే చెప్పవచ్చు. తాజాగా కోలీవుడ్ యువ సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ పేరు బాలీవుడ్‌లో మారుమ్రోగుతోంది. ఒర్ ఇరవు చిత్రం ద్వారా కోలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా పరిచయమైన ఈయన విజయ్ సేతుపతి, మాధవన్ కలిసి నటించిన విక్రమ్ వేదా చిత్రంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నారు.
ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రంలోని థీమ్ సాంగ్ సంగీత ప్రియులకు విపరీతంగా ఆకట్టుకుంది. అలా మెలోడి పాటలు రూపొందించడంలోనూ దిట్ట అని నిరూపించుకున్నారు. ఖైదీ, అడంగామరు, సాని కాగితం వంటి పలు చిత్రాలకు సంగీతాన్ని అందించి పేరు తెచ్చుకున్నారు. కాగా విక్రమ్ వేదా చిత్రం తాజాగా హిందీలో రీమేక్ అవుతోంది.
ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ నే సంగీతాన్ని అందిస్తూ బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. త్వరలో నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలవుతున్న హిందీ వెర్షన్ విక్రమ్ వేదా చిత్ర ట్రైలర్ ఇటీవల మొదలైంది. ఈ ట్రైలర్‌కు, చిత్ర పాటలకు బాలీవుడ్ వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమిళం, తెలుగు తదితర భాషల్లో చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బిజీగా ఉన్నా ఇకపై బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుకోబోతున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల అవకాశాలు వస్తున్నట్లు శ్యామ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment