‘తిండికి లేకే ఈ దొంగతనం చేస్తున్నా..’ | we are doing robberies for food | Sakshi
Sakshi News home page

‘తిండికి లేకే ఈ దొంగతనం చేస్తున్నా..’

Published Fri, Aug 1 2014 11:42 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

‘తిండికి లేకే ఈ దొంగతనం చేస్తున్నా..’ - Sakshi

‘తిండికి లేకే ఈ దొంగతనం చేస్తున్నా..’

ఇంటర్ నుంచే చోరీలు

శంషాబాద్: పట్టణంలో తరచూ చోరీలకు పాల్పడుతూ ఇటు జనాన్ని, అటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఓ దొంగ ఎట్టకేలకు దొరికిపోయాడు. అతడి నుంచి 70 తులాల బంగారం, 50 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం శంషాబాద్ జోన్ డీసీపీ రమేష్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా విపనగండ్ల మండలం తూంకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన రత్లావత్ శంకర్‌నాయక్ (23) విపగండ్లలో ఇంటర్ చదువుతున్న 2012-2013 సమయంలో చోరీలబాట పట్టాడు.
 
అదే ఏడాది అతనిపై అచ్చంపేట, వనపర్తి పోలీస్‌స్టేషన్‌లలో అతడు సుమారు 30 చోరీ కేసులు నమోదయ్యాయి. అనంతరం బీఫార్మసీలో చేరిన అతడు చదువును మధ్యలోనే ఆపేశాడు. మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లిన శంకర్‌నాయక్ గత మే నెలలో బెయిల్‌పై బయటకు వచ్చాడు. జల్సాలకు అలవాటుపడిన అతడు రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఖరీదైన డబుల్‌బెడ్ రూం ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని లగ ్జరీగా జీవిస్తున్నాడు. రెండు నెలలుగా శంషాబాద్, షాద్‌నగర్, కొత్తూరు మండలాల్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఇటీవల శంషాబాద్‌లో ఎనిమిదిసార్లు పలు ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలు చేయడంతో స్థానికులు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
 
‘తిండికి లేకే ఈ దొంగతనం చేస్తున్నా..’

శంషాబాద్‌లోని ఓ ఇంట్లో శంకర్‌నాయక్ డాక్యుమెంట్లకు సంబంధించిన బ్యాగును అపహరించుకుపోయాడు. అనంతరం ‘నాకు తిండికి లేకే ఈ దొంగతనం చేస్తున్నా’నంటూ ఓ లేఖను రాసి పెట్టి తిరిగి సదరు పత్రాలు ఆ ఇంట్లోనే వదిలేసి వెళ్లాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో 2 ఇళ్లలో, అదే జిల్లా కొత్తూరులో 4 ఇళ్లలో శంకర్‌నాయక్ చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. చోరీ సొత్తును శంకర్‌నాయక్ తనకు పరిచయమున్న నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన కట్రాజ యాదయ్య, అంకతి నాగరాజులకు ఇచ్చేవాడు.
 
వాళ్లు బంగారం, వెండిని ముత్తూట్, మణప్పురం తదితర ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బులు  తెచ్చి ఇచ్చేవారు. పోలీసులు వారిపై కూడా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. శంకర్‌నాయక్ నుంచి 70 తులాల బంగారం, 50 తులాల వెండితో పాటు ఓ హోండా యాక్టివా వాహనం, ఓ టీవీని స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువ మొత్తం రూ. 8.25 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
 
ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు..
శంకర్‌నాయక్‌కు ఓ ప్రియురాలు ఉంది. ఆమెను ఇంప్రెస్ చేసేందుకు చోరీలు చేశాడని విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు అతడు లగ్జరీ జీవితం గడిపేవాడు. ఈక్రమంలోనే చోరీల బాటపట్టాని తెలిసింది.
 
ఇలా దొరికిపోయాడు..!

రెండురోజుల క్రితం స్థానికంగా చేపట్టిన వాహనాల తనిఖీల్లో శంకర్‌నాయక్ హోండా యాక్టివా మీద వెళ్తూ పోలీసులు అనుమానాస్పద స్థితిలో దొరికిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా పైవిషయాలు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని రిమాండుకు తరలించారు. ఈ సమావేశంలో ఏసీపీ సుదర్శన్, సీఐ సుధాకర్, డీఐ సుదర్శన్‌రెడ్డి, డీఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement