samshabad jone
-
ఫుల్లుగా తాగేశారు... 34 లక్షల బాటిళ్లు ఖాళీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూములు, ఇళ్లు, ఐటీ, పారిశ్రామిక ఉత్పత్తుల్లోనే కాదు మద్యం అమ్మకాల్లోనూ జిల్లా దూసుకుపోతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే.. ఇక్కడ మద్యం విక్రయాలు అత్యధికంగా జరిగాయి. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం జిల్లా నుంచే సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి జూన్ 15 వరకు 2,33,69,322 బీర్లు అమ్ముడు పోగా, ఇందులో కేవలం జిల్లా వాసులే 51,51,058 బీర్లు తాగేశారు. తెలంగాణ వ్యాప్తంగా 1,65,10,978 ఫుల్ బాటిళ్లు ఖాళీ కాగా కేవలం జిల్లాలోనే 34,72,932 ఫుల్ బాటిళ్లు అమ్ముడుపోయాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాకి ఇప్పటి వరకు రూ.15,235 కోట్ల ఆదాయం సమకూరగా, కేవలం జిల్లా నుంచే రూ.3,354 కోట్లకుపైగా రావడం గమనార్హం. విందేదైనా మందు ఉండాల్సిందే నగరానికి చేరువలో ఉండడం.. అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడు మెజార్టీ ఔటర్ రింగ్‌రోడ్డు జిల్లాలో ఉండడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు దేశవిదేశాలకు చెందిన ఐటీ అనుబంధ సంస్థలు, అంతర్జాతీయ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి. అనేక మంది ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తున్నారు. వీరిలో చాలా మంది ఇక్కడే స్థిరపడేందుకు ఇష్టపడుతున్నారు. ఇళ్లు, భూములు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ఇక్కడి భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. భూ క్రయవిక్రయాల ద్వారా రైతులు, వ్యాపారులు అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు సైతం రూ.లక్షల్లో ఉన్నాయి. చేతినిండా డబ్బులు ఉండటంతో పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలు, విందులు, వినోదాల్లో మునిగితేలుతున్నారు. శుభకార్యాలు, అశుభకార్యాలు ఇలా ఏదైనా వచ్చిన బంధువులకు మద్యం, మాంసం తప్పనిసరైంది. శంషాబాద్ నుంచే అత్యధికం జిల్లాలో 234 మద్యం దుకాణాలు ఉండగా, వీటిలో శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో వంద, సరూర్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో 134 ఉన్నాయి. శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయం పరిధిలోనే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాతి స్థానంలో సరూర్‌నగర్ జోన్ నుంచి సమకూరడం విశేషం. ఇన్నర్ రింగ్‌రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు వెంట ఉన్న దుకాణాల్లోనే అమ్మకాలు ఎక్కువ జరగడం విశేషం. (చదవండి: కార్ల పైనా కన్నేస్తున్నారు!) -
‘తిండికి లేకే ఈ దొంగతనం చేస్తున్నా..’
ఇంటర్ నుంచే చోరీలు శంషాబాద్: పట్టణంలో తరచూ చోరీలకు పాల్పడుతూ ఇటు జనాన్ని, అటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఓ దొంగ ఎట్టకేలకు దొరికిపోయాడు. అతడి నుంచి 70 తులాల బంగారం, 50 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం శంషాబాద్ జోన్ డీసీపీ రమేష్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా విపనగండ్ల మండలం తూంకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన రత్లావత్ శంకర్‌నాయక్ (23) విపగండ్లలో ఇంటర్ చదువుతున్న 2012-2013 సమయంలో చోరీలబాట పట్టాడు. అదే ఏడాది అతనిపై అచ్చంపేట, వనపర్తి పోలీస్స్టేషన్లలో అతడు సుమారు 30 చోరీ కేసులు నమోదయ్యాయి. అనంతరం బీఫార్మసీలో చేరిన అతడు చదువును మధ్యలోనే ఆపేశాడు. మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లిన శంకర్‌నాయక్ గత మే నెలలో బెయిల్‌పై బయటకు వచ్చాడు. జల్సాలకు అలవాటుపడిన అతడు రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్‌లోని ఓ అపార్టుమెంట్లో ఖరీదైన డబుల్‌బెడ్ రూం ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని లగ ్జరీగా జీవిస్తున్నాడు. రెండు నెలలుగా శంషాబాద్, షాద్‌నగర్, కొత్తూరు మండలాల్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. ఇటీవల శంషాబాద్‌లో ఎనిమిదిసార్లు పలు ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలు చేయడంతో స్థానికులు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ‘తిండికి లేకే ఈ దొంగతనం చేస్తున్నా..’ శంషాబాద్‌లోని ఓ ఇంట్లో శంకర్‌నాయక్ డాక్యుమెంట్లకు సంబంధించిన బ్యాగును అపహరించుకుపోయాడు. అనంతరం ‘నాకు తిండికి లేకే ఈ దొంగతనం చేస్తున్నా’నంటూ ఓ లేఖను రాసి పెట్టి తిరిగి సదరు పత్రాలు ఆ ఇంట్లోనే వదిలేసి వెళ్లాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో 2 ఇళ్లలో, అదే జిల్లా కొత్తూరులో 4 ఇళ్లలో శంకర్‌నాయక్ చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. చోరీ సొత్తును శంకర్‌నాయక్ తనకు పరిచయమున్న నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన కట్రాజ యాదయ్య, అంకతి నాగరాజులకు ఇచ్చేవాడు. వాళ్లు బంగారం, వెండిని ముత్తూట్, మణప్పురం తదితర ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఇచ్చేవారు. పోలీసులు వారిపై కూడా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. శంకర్‌నాయక్ నుంచి 70 తులాల బంగారం, 50 తులాల వెండితో పాటు ఓ హోండా యాక్టివా వాహనం, ఓ టీవీని స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువ మొత్తం రూ. 8.25 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు.. శంకర్‌నాయక్‌కు ఓ ప్రియురాలు ఉంది. ఆమెను ఇంప్రెస్ చేసేందుకు చోరీలు చేశాడని విశ్వసనీయ సమాచారం. దీనికి తోడు అతడు లగ్జరీ జీవితం గడిపేవాడు. ఈక్రమంలోనే చోరీల బాటపట్టాని తెలిసింది. ఇలా దొరికిపోయాడు..! రెండురోజుల క్రితం స్థానికంగా చేపట్టిన వాహనాల తనిఖీల్లో శంకర్‌నాయక్ హోండా యాక్టివా మీద వెళ్తూ పోలీసులు అనుమానాస్పద స్థితిలో దొరికిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా పైవిషయాలు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితుడిని రిమాండుకు తరలించారు. ఈ సమావేశంలో ఏసీపీ సుదర్శన్, సీఐ సుధాకర్, డీఐ సుదర్శన్‌రెడ్డి, డీఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.