సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బుద్ధి చెప్పటానికి నిరుద్యోగ యువత సిద్ధంగా ఉందని బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు అన్నారు. సోమవారం బాబు ఏది జాబు అంటూ భారతీయ జనతా యువ మోర్చా నేతలు, కార్యకర్తలు విజయవాడలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ రంగంలోని ఖాళీలను భర్తీ చేయాలంటూ, నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలకు పెంచాలంటూ ఏపీపీఎస్ ఛైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ధర్నాచౌక్‌నుంచి ర్యాలీగా బయలుదేరిన నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, యువ మోర్చా నేతలకు మధ్య వాగ్వివాదం.. తోపులాట చోటుచేసుకుంది.
అనంతరం ఏలూరు రోడ్డులో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ.. బాబు వస్తే జాబు వస్తుంది అంటూ నిరుద్యోగ యువతని చంద్రబాబు మోసం చేశారని, ఆయన వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కొడుకుకు తప్పితే రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్న నిరుద్యోగులను అరెస్టు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment