సాక్షి, సిటీబ్యూరో: గణేష్ నిమజ్జనం ముగిసే వరకు అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో వినాయక మండపాల వద్ద గట్టి బందోబస్తుతో పాటు నిఘాను పెట్టారు. శివార్లలోని 20 నిమజ్జన కేంద్రాలను డీసీపీలు రవివర్మ, రమేష్‌నాయుడు, రంగారెడ్డి, శివకుమార్ తదితరులు శనివారం సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
ఇక ప్రతి మండపం వద్ద ముందు జాగ్రత్త చర్యగా బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేయిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లోని ఎల్బీనగర్, శంషాబాద్, బాలానగర్, మాదాపూర్, మల్కాజిగిరి జోన్ పరిధిల్లో సుమారు 10 వేలకు పైగా వినాయక మండపాలు ఏర్పాటయ్యాయి. ఆయా స్టేషన్‌ల వారీగా ప్రతి మండపం వద్ద బందోబస్తు కోసం సిబ్బందిని నియమించారు. అలాగే పెట్రోలింగ్‌ను సైతం పెంచారు. కొన్ని మండపాల్లోని గణేష్‌లను ఐదు రోజులకు నిమజ్జనానికి తరలిస్తుండగా, మిగతా మండపాలలోని విగ్రహాలను 11వ రోజు నిమజ్జనానికి తరలించనున్నారు.
నిమజ్జనం సాఫీగా సాగేందుకు కమిషనరేట్ పరిధిలో జీహెచ్‌ఎంసీ అధికారుల సహాయంతో 19 నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం వద్ద కావాల్సిన క్రేన్‌లు, సహాయక కేంద్రం, ఫైర్, జీహెచ్‌ఎంసీ, ఎలక్ట్రిసిటీ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. నిమజ్జన కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేకంగా క్యాంప్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్యాంప్‌లను జాయింట్ పోలీసు కమిషనర్ శివప్రసాద్‌తో పాటు ఆయా జోన్‌ల డీసీపీలు రవివర్మ, రమేష్‌నాయుడు, రంగారెడ్డి, శివకుమార్‌లు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 18న జరిగే సామూహిక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
నిమజ్జన కేంద్రాలు ఇవే...
ఐడీపీఎల్ చెరువు, హస్మత్‌పుర చెరువు, సఫిల్‌గూడ చెరువు, సరూర్‌నగర చెరువు, ఐడీఎల్‌ట్యాంక్, అల్వాల్ చెరువు, బాలాజీనగర్ చెరువు, కౌకూర్ చెరువు, షామీర్‌పేట చెరువు, సూరారం చెరువు,లింగంచెరువు, వెన్నెలగడ్డ చెరువు, ప్రగతినగర్ చెరువు, కాప్రా చెరువు, కీసర చెరువు, పూడురు చెరువు, ఎల్లమ్మపేట చెరువు, దుర్గంచెరువు, హిమాయత్‌నగర్ చెరువు, మేకంపూర్ చెరువు.
నిమజ్జనానికి అప్రమత్తంగా ఉండాలి : సీవీ ఆనంద్
Published Sun, Sep 15 2013 3:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
Advertisement
Advertisement