కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీలో ఉంటూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ తాము పాల్గొం టున్నామని, అటువంటి తమకు ఇప్పుడు స్థానం లేకుండా చేస్తున్నారని కడప తెలుగు మహిళ నగర అధ్యక్షురాలు చిప్పగిరి మీనాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి కడప నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించిన డివిజన్లకు సంబంధించిన టిక్కెట్లను పార్టీ మేయర్ అభ్యర్థి బాలకృష్ణయాదవ్, పార్టీ మైనార్టీ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు అమీర్‌బాబులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
పార్టీ కోసం కష్టించే వారిని కాదని, వలస వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పార్టీలోకి ఎర్రతివాచి పరిచి వారికి సీట్లు అమ్ముకునే సంస్కృతిని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కడప నగరంలోని మున్సిపాలిటీలో దళితులకు వచ్చిన రిజర్వేషన్ సీట్లలో ముక్కూమొహం తెలియని వారికి టిక్కెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు పార్టీ నగర మహిళా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడుతోపాటు మిగిలిన నాయకులు కూడా కార్యకర్తల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా టిక్కెట్లు ఎలా కేటాయిస్తారని విమర్శించారు.
సీఎం రమేష్‌నాయుడుకు కడప నగరం గురించి తెలియదని, ఇందులో జోక్యం చేసుకోవద్దని చెబుతున్నామన్నారు. పుత్తా నరసింహారెడ్డికి కడప ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్టీ నాయకులు వచ్చి సమాధానం చెప్పేవరకు విశ్రమించేది లేదని తెలుగు మహిళలు ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆందోళనలో నగర కార్యవర్గ నాయకులు దుర్గాప్రసాద్, ఓబులమ్మ తదితరులు పాల్గొన్నారు.
కడప నగర టీడీపీలో రచ్చ..రచ్చ
Published Sat, Mar 15 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement