ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా బాధ అనిపిస్తుంది : ఎస్.పి.శైలజ
ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా బాధ అనిపిస్తుంది : ఎస్.పి.శైలజ
Published Mon, Nov 25 2013 11:55 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
‘అలివేణీ... ఆణిముత్యమా...’ ‘ముద్దమందారం’లోని ఈ పాట వినగానే... అంతులేని ఆనందోద్వేగం గుండెల్లో ఉబికి... కళ్లలోంచి నీటిముత్యాలుగా దొర్లుతాయి. ‘శివరంజనీ... నవరాగినీ...’ ‘తూర్పుపడమర’లోని ఈ గీతం చెవిన పడితే... హృదయం ఉప్పొంగుతుంది. శరీరం రోమాంచితం అవుతుంది. ‘మనసా... తుళ్లిపడకే...అతిగా ఆశపడకే..’ వేటూరి అక్షరాలు స్వరాలంకృతమై ఈ రీతిగా పలకరిస్తే... వయసు కలవరిస్తుంది. మనసు పలవరిస్తుంది.
మనిషిలోని అన్ని ఉద్వేగాలనూ ఇలా స్వరాలతో తట్టిలేపడం అందరికీ సాధ్యం కాదు. ఆ మేజిక్ కొందరికే సాధ్యం. ఆ కొందరిలో అగ్రగణ్యుడు రమేష్‌నాయుడు. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాకు రాగాభిషేకం చేసిన సంగీత జ్ఞాని ఆయన. అమ్మమాట, తాతామనవడు, దేవుడు చేసిన మనుషులు, దేవదాసు, తూర్పు పడమర, శివరంజని, ముద్దమందారం, మేఘసందేశం, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి, స్వయంకృషి... ఇలా చెప్పుకుంటూ పోతే... రమేష్‌నాయుడు హార్మోనియం నుంచి ఉద్భవించిన అద్భుతాలు ఎన్నో ఎన్నో ఎన్నెనో... నేడు ఆ సంగీత స్రష్ట జయంతి.
రమేష్‌నాయుడు బయట ఎలా ఉన్నా... రికార్డింగ్ థియేటర్లో చండశాసనుడు. అనుకున్నట్టు అవుట్‌పుట్ రాకపోతే... ఎస్పీ బాలుని కూడా ఉపేక్షించేవారు కాదు. కానీ... ఎస్పీ శైలజ మాత్రం ఇందులో మినహాయింపు. ఆమెను మాత్రం ఏమీ అనేవారు కాదాయన. కారణం ఏంటో తెలుసా? శైలజ అచ్చం రమేష్‌నాయుడు అమ్మలా ఉంటారట. అందుకే.. ధైర్యాన్నిచ్చి, బుజ్జగించి మరీ నెమ్మదిగా పాడించేవారు. శైలజ అంటే రమేష్‌నాయుడుకి ఎంత ఇష్టమంటే... చివరిఘడియల్లో శైలజ చేతులమీదుగా తులసితీర్ధం తీసుకొని కన్నుమూయాలనుకునేంత. అందుకే... ఆ సంగీతచక్రవర్తి జయంతి సందర్భంగా ‘సాక్షి’ రమేష్‌నాయుడు గురించి శైలజతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలివి.
రమేష్‌నాయుడుగారితో మీ తొలి పరిచయం ఎలా జరిగింది ?
అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నెల్లూరులో పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నయ్య సంగీత విభావరి కూడా ఏర్పాటుచేశారు. ఆ కార్యక్రమానికి అన్నయ్యతో పాటు రమేష్‌నాయుడుగారు కూడా వచ్చారు. అనుకోకుండా ఆ వేదికమీదే నేను పాట పాడాను. నా పాట ఆయనకు బాగా నచ్చేసింది. ‘అవకాశం వస్తే.. సినిమాల్లో పాడతావా తల్లీ...’ అనడిగారు. పాడతానని చెప్పాను. అన్న మాట ప్రకారం ఆయన స్వరాలందించిన ‘సూర్యపుత్రులు’ సినిమా కోసం తొలిసారి నాతో పాడించారు. సినీగాయనిగా నా రెండో సినిమా అది. నా కెరీర్ మొత్తంమీద రమేష్‌గారి నేతృత్వంలో దాదాపు ఓ 40 పాటలు పాడి ఉంటానేమో.
రమేష్‌నాయుడుగారి సహచర్యంలో మీకు గుర్తుండి పోయిన అంశాలేమైనా ఉన్నాయా?
ఒకటి కాదు. ఆయన సహచర్యంలో అన్నీ గొప్ప అనుభూతులే. ఆయన రికార్డింగ్ అంటే చాలు.. చాలా హ్యాపీగా ఫీలయ్యేదాన్ని. కారణం.. అందరితో ఆయన ఎలా ఉన్నా... నా విషయంలో మాత్రం కూల్‌గా ఉండేవారు. నాకు ఏ ఇబ్బందీ కలక్కుండా చూసుకునేవారు. ఓ సారి అన్నయ్య ఆయన్ను సూటిగానే అడిగేశారు. ‘ఏంటండీ... చిన్న చిన్న తప్పులకు కూడా మా అందర్నీ కోప్పడతారు.. కానీ మా చెల్లెల్ని మాత్రం ఏమీ అనరు. దేనికి?’ అని. అప్పుడు చెప్పారు... నేను అచ్చం వారి అమ్మగారిలా ఉంటానట. అందుకే.. నాతో కోపంగా మాట్లాడలేకపోయేవారాయన.
ఆ విషయం మీకెప్పుడు తెలిసింది?
తర్వాత అన్నయ్య ద్వారా తెలిసింది. రమేష్‌నాయుడుగారు కూడా తర్వాత నాకు ఆ విషయం చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది.
ఆయన చివరి ఘడియల్లో మీ చేతుల ద్వారా తులసితీర్థం తీసుకొని కన్నుమూయాలని కోరుకున్నారట. కారణం అదేనా?
అదే కావచ్చు. అయితే... అప్పుడు నేను ఆయన వద్దకు వెళ్లలేకపోయాను. ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా బాధ అనిపిస్తుంది. కారణం... అప్పుడు నాకు టైఫాయిడ్. 104 జ్వరంతో ఉన్నాను. రమేష్‌నాయుడు చివరి ఘడియల్లో ఉన్నారని, పైగా నా చేతుల ద్వారా ఆయన వెళ్లిపోవాలనుకుంటున్నారని తెలిసి మా అన్నయ్య సహాయకులు విఠల్‌గారిని అడిగి... ఎలాగోలా ఆయన వద్దకు వెళ్లాను. అయితే... అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది.
రమేష్‌నాయుడు స్వరాలందించిన పాటల్లో మీకు నచ్చిన పాట?
చాలా ఉన్నాయి. కృష్ణగారి ‘దేవదాసు’ సినిమాలోని ప్రతి పాట ఓ ఆణిముత్యమే. అలాగే ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘మేఘసందేశం’ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో నాతో పాడించకపోయేసరికి చాలా బాధపడ్డాను. నా బాధ గమనించి ఆ సినిమా రీ-రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నాతో కొన్ని హమ్మింగులు అనిపించారు. టైటిల్స్‌లో కూడా నా పేరు వేయించారు. ఆ విధంగా ఆ బాధను పోగొట్టారాయన. అలాగే.. ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘రావు గోపాలరావు’ సినిమాలో అన్ని పాటలూ నాతోనే పాడించారు. అలాగే.. ‘ఆనందభైరవి’లోని ‘సుడిగాలిలో దీపం’ పాట కూడా నాకు మంచి పేరు తెచ్చింది.
మీరు పాడిన పాటల్లో ఆయనకు ఇష్టమైన పాట?
‘మయూరి’లో నేను పాడిన ‘నీ పాదం ఇలలోన నాట్యవేదం’ పాటంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ సినిమాకు అన్నయ్య ఎస్పీబాలు సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఎప్పుడు కనిపించినా... ఆ పాట గురించే నాతో మాట్లాడేవారాయన.
- బుర్రా నరసింహ
Advertisement